నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో భారత్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందారు. మృతురాలు 8 నెలల గర్భిణి కావడం మరింత విషాదకరం. గత వారాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భారత్‌కు చెందిన 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ కుటుంబం హార్న్స్‌బై ప్రాంతంలో నివాసముంటోంది. 8 నెలల గర్భిణి అయిన సమన్విత తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి సమీపంలోని పార్క్ వద్దకు వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఫుట్‌క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సమన్వితను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గర్భస్థ శిశువు ప్రాణాలు కూడా దక్కలేదని తెలిపారు. మరికొన్ని వారాల్లో డెలివరీ కావాల్సిఉండగా.. ఈ లోగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సమన్విత భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును నడిపింది 19 ఏళ్ల ఆరోన్ పపాజోగ్లుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు సమన్విత స్థానికంగా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.



