నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో తన అక్క రుచిత(21), అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని, ఊర్లో పరువు పోతుందని భావించిన తమ్ముడు రోహిత్(20) రుచిత గొంతును వైరుతో బిగించి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ ఘటనలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అక్క రుచితను చంపే ముందు ఇన్‌స్టాగ్రామ్ లో రోహిత్ రీల్ చేశాడు. అతని ఫోన్లో “బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా” అనే రీల్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో పథకం ప్రకారమే ఫేమస్ అయ్యేందుకు అక్క రుచితను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.