Thursday, October 16, 2025
E-PAPER
Homeజిల్లాలుఅలంపూర్ అభివృద్ధికి రూ. 1కోటి  కేటాయించాలి: కేవీపీఎస్

అలంపూర్ అభివృద్ధికి రూ. 1కోటి  కేటాయించాలి: కేవీపీఎస్

- Advertisement -

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు
నవతెలంగాణ – అలంంపూర్

అలంపూర్ పట్టణ అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు డిమాండ్ చేశారు. సంత మార్కెట్ దళితవాడ పక్కన ఉన్న మురుగునీటి గుంతను పూర్చాలని, అక్బర్ పేట వీధిలో సిసి రోడ్డు మురికి కాలువలు నిర్మించాలని, నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. అలంపూర్ పట్టణ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి అదనంగా ఏడాదికి కోటి రూపాయల చొప్పున ఐదేళ్లు కేటాయించాలని అన్నారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అలంపూర్ అభివృద్ధి కావడం లేదని అన్నారు. టౌన్ లో పరిసరాలు పరిశుభ్రంగా లేవని చెత్త కుండీలు నిండిన తీసే పరిస్థితి లేదని, సామూహిక మరుగుదొడ్లు ఉండడంవల్ల దుర్గంధం దుర్వాసన వెదజల్లుతుందని అన్నారు. టౌన్ మధ్యలో 7 వందల మీటర్ల పరిధిలో కందకం ఉండడం వల్ల మురుగునీరు చేరి కంపా చెట్లు మొలిచి సంత మార్కెట్, పెద్ద దర్గా, అక్బర్ పేట వీధులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కందకంలో ఉన్న మురుగునీరు బయటకు పంపాలని కంపచెట్లు తొలగించాలని కోరారు. అక్బర్ పేట వీధిలో వర్షం నీళ్ళు రోడ్డుపై నిలిచి దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, సిసి రోడ్డు వేసి రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు నిర్మించాలని కోరారు. సంత మార్కెట్ దళితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, న్యూ ప్లాట్స్ కాలనీ దళితులకు స్మశాన స్థలం లేక రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డుకు శవాలను తేలేక ఇబ్బంది పడుతున్నారని వారికి అక్కడే స్మశాన స్థలం కేటాయించాలని కోరారు.

సంతోష్ నగర్ దళితవాడ పక్కన ఉన్న స్మశానానికి సీసీ రోడ్డు వేయాలని అన్నారు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉన్న అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని మున్సిపల్ కార్మికులకు రెగ్యులర్ గా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, నాలుగు నెలలకు ఒక్కసారి ఇస్తున్నారని అన్నారు. గత 20 నెలలుగా 22 మంది మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ కూడా చేయడం లేదని అన్నారు. దయనీయమైన పరిస్థితిలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అలంపూర్ మున్సిపాలిటీకి జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి నిధులు కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. గత ఐదేళ్లుగా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న 16 మందిని కార్మికులుగా గుర్తించాలని అన్నారు. ధర్నాకు ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశన్న మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి, టౌన్ కార్యదర్శి అయ్యప్ప, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ఆలీ అక్బర్  కెవిపిఎస్ నాయకులు మౌలాలి, సిద్దయ్య, నరసింహ, పుల్లన్న, సుంకన్న, నాగన్న, రాజు, వెంకటేశ్వర్లు విశ్వం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -