నవతెలంగాణ-హైదరాబాద్ రోడ్డుపైకి వచ్చిన వరద నీటిలో బస్సు చిక్కుకున్న ఘటన వరంగల్ జిల్లాలోని ఉప్పరపల్లిలో చోటు చేసుకుంది. మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈక్రమంలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ నుంచి పర్వతగిరి మండలానికి వెళ్లే మార్గంలో ఉప్పరపల్లి ఎల్లమ్మ చెరువు మత్తడి పడింది. రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఈక్రమంలో నల్లబెల్లి నుంచి వరంగల్‌కు వెళ్తున్న హనుమకొండ డిపోనకు చెందిన బస్సు వరదనీటికి పడిన గుంతలో ఇరుక్కుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సు ఆపి ప్రయాణికులను దింపడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలు నిలిపేశారు. గుంతలో ఇరుక్కున్న బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.



