Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంరూల్స్‌ బ్రేక్‌

రూల్స్‌ బ్రేక్‌

- Advertisement -

బీహార్‌ ఎస్‌ఐఆర్‌ అస్తవ్యస్తం
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇబ్బందులు
క్షేత్రస్థాయిలో అనేక లోపాలు.. పలు నియమాల ఉల్లంఘన
బీఎల్‌ఓలపై తీవ్ర పని ఒత్తిడి
భారత్‌ జోడో అభియాన్‌ వాలంటీర్ల సర్వే
న్యూఢిల్లీ
: బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ ప్రక్రియను ఎలాగైనా విజయవంతం చేయాలని భావిస్తున్నది. నాలుగు దశల్లో జరగనున్న ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రెండో దశ బీహార్‌లో కొనసాగుతున్నది. అయితే ఈ రెండు దశల్లో పలు నియమాల ఉల్లంఘన జరిగిందని భారత్‌ జోడో అభియాన్‌ వాలంటీర్ల సర్వే వెల్లడిస్తున్నది. బూత్‌ స్థాయి అధికారుల(బీఎల్‌ఓలు)పై తీవ్ర పనిభారం, ఒత్తిడి ఉన్నదని గుర్తించింది. దీంతో సరైన వెరిఫికేషన్‌ లేకుండానే ప్రక్రియ సాగుతున్నదని స్పష్టం చేసింది. వీటితో పాటు క్షేత్రస్థాయిలో అనేక లోపాలు, ఇబ్బందులను ఎత్తి చూపింది.
ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లాలి. కానీ, పశ్చిమ చంపారన్‌లో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లలేకపోయారని వార్తలు వచ్చాయి. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎదురైంది. దీంతో బీఎల్‌ఓలు గ్రామ కూడలి నుంచి ఫారాలను అందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ప్రతి ఓటరుకూ డూప్లికేట్‌ ఎన్యుమరేషన్‌ ఫారమ్‌ అందాలి. కానీ ఆరు శాతం మందికే రెండు కాపీల ఫారమ్‌లు అందాయి. అయితే తానెప్పుడూ రెండు కాపీలను ఓటరుకు ఇవ్వలేదనీ, ఇది ఒక నియమమని తెలిసి ఆశ్చర్యపోయినట్టు ఒక బీఎల్‌ఓ చెప్పారు. ఇక బీఎల్‌ఓలు ప్రతి ఓటరు ఫారమ్‌పై రసీదును జారీ చేయాలి. అయితే ఒకే ఫారమ్‌ను ఇవ్వటం ద్వారా ఇది సాధ్యపడలేదు. దీంతో పౌరుల వద్ద ఎలాంటి రుజువూ లేకుండా పోయింది.
ఈసీఐ వద్ద 11 అప్రూవ్‌డ్‌ డాక్యుమెంట్స్‌తో కూడిన ప్రత్యేక జాబితా ఉన్నది. అయితే కొన్ని చోట్ల ఆ జాబితాలో ఉన్న డాక్యుమెంట్లను తిరస్కరించినట్టు, లేని డాక్యుమెంట్లను స్వీకరించినట్టు కథనాలు వచ్చాయి. ఇక ఫారమ్‌ను తప్పుల్లేకుండా నింపేలా బీఎల్‌ఓలు ప్రజలకు మార్గనిర్దేశం చేయాలి. కానీ వారు కొందరికి మాత్రమే వివరించారు. ఫలితంగా తప్పులు దొర్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి బీఎల్‌ఓకు వెయ్యి నుంచి 1200 వరకు ఓటర్లను అప్పగించారు. తగినంత సమయం లేకుండా పోయింది. దీంతో తమ మీద ఒత్తిడి పడి ఈ పరిస్థితి ఎదురైనట్టు పలువురు బీఎల్‌ఓలు చెప్పారు.
ఇక అటాచ్‌డ్‌ డాక్యుమెంట్స్‌తో వెరిఫై చేసిన ఫారమ్‌లను ఈసీఐనెట్‌ యాప్‌ ద్వారా బీఎల్‌ఓలు అప్‌లోడ్‌ చేయాలి. అయితే, క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌లు జరగకుండానే బీఎల్‌ఓలు వాటిని సమర్పిస్తున్నట్టు తెలుస్తున్నది. సరైన పత్రాలు జత చేశారా, సంతకాలు ఉన్నాయా, ఫారమ్‌లను పూర్తిగా నింపారా, ఫోటోను అటాచ్‌ చేశారా అనే వాటితో సంబంధం లేకుండా వాటిని సమర్పించటమే తమ విధి అని ఒక బీఎల్‌ఓ వెల్లడించటం ప్రక్రియ తీరుకు అద్దం పడుతున్నది. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ సులభతరంగా ఉండాలి. ఓటర్లను వేధింపులు, ఒత్తిడి, భయాందోళనలకు గురి చేయొద్దు. అయితే ఈ ప్రక్రియలో దళితులు, ఈబీసీలు, ముస్లింలు, మహిళలను భయభ్రాంతులకు గురి చేసినట్టు తెలిసింది. దర్భాంగాలోనైతే ఏకంగా ఓటును తొలగించేస్తారన్న భయాలను ఈ వర్గాలలో సృష్టించారని వార్త కథనాలు చెప్తున్నాయి. ఇక ఈ ప్రక్రియకు సంబంధించి ఈసీఐ రోజువారీ ప్రెస్‌ నోట్‌లను మీడియాకు విడుదల చేస్తున్నప్పటికీ.. ఎలాంటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను మాత్రం నిర్వహించకపోవటం గమనార్హం.
ప్రతి సెకన్‌కు 137 ఫారమ్‌ల సేకరణ!
మొదటి దశలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లటానికి 98,500 మంది బీఎల్‌ఓలను రంగంలోకి దింపారు. ఈనెల7న అందిన డేటా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. 24 గంటల్లో 1.18 కోట్ల ఫారమ్‌లను సేకరించినట్టు ఈసీఐ వివరించింది. అంటే నిమిషానికి 8,200 కంటే ఎక్కువ, ప్రతి సెకన్‌కు 137 ఫారమ్‌లు సేకరించినట్టు అర్థమవుతున్నది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎలా పని చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే కుట్రలో భాగమే ఈ ప్రక్రియ అని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్‌ఐఆర్‌కు భారత ఎన్నికల సంఘం సిద్ధపడటం వివాదాస్పదమైన విషయం విదితమే. దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలతో పాటు పలువురు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసీ చర్యను న్యాయస్థానం సమర్థించిన్పటికీ.. పలు ప్రశ్నలను సంధించింది. ఈసీకి ఉన్న అధికారం, సమీక్షా ప్రక్రియ చెల్లుబాటు, బీహార్‌ అసెంబ్లీకి కొన్ని రోజుల ముందే దీనిని చేపట్టటం.. అనే మూడు ప్రశ్నలను ఈసీకి సుప్రీంకోర్టు సంధించిన విషయం తెలిసిందే. అయితే బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
నాలుగు దశలుగా ప్రక్రియ
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మొత్తం నాలుగు దశలు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా జూన్‌ 25- జులై 4 మధ్య ఎన్యుమరేషన్‌ ఫారమ్‌ ప్రింటింగ్‌, పంపిణీ. జులై 4-జులై 25 మధ్య రెండో దశలో ఫారమ్‌లు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, కలెక్షన్‌ ఉంటుంది. మూడో దశ ఆగస్టు 1 – ఆగస్టు 30 మధ్య ఉంటుంది. ఇందులో ఎలక్టోరల్‌ రోల్స్‌ డ్రాఫ్ట్‌ను పబ్లిష్‌ చేయటం, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. నాలుగో దశలో భాగంగా సెప్టెంబర్‌ 30న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ప్రస్తుతం బీహార్‌లో రెండో దశ నడుస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -