నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులాపై అమెరికా దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) మంగళవారం చర్చ చేపట్టింది. ఈ సమావేశంలో అమెరికా ‘అక్రమ దిగ్బంధనం’ను రష్యా ఖండించింది. ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు కలిగించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవాలనే తప్పుడు సాకుతో అమెరికా కరేబియన్ జలాల్లో పౌర నౌకలను ధ్వంసం చేస్తోందని యుఎన్‌లో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా ఆ సెషన్‌లో పేర్కొన్నారు.
ఇది ‘కృత్రిమమైనది’గా పేర్కొంటూ .. ‘వెనిజులాకు వ్యతిరేకంగా ఉద్రిక్తతలను పెంచడానికి ఉద్దేశించిన సమర్థన’ అని వ్యాఖ్యానించారు. వెనిజులాలో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఉగ్రవాద సంస్థగా ముద్రవేయడం ద్వారా అమెరికా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఒక సాకుగా ఉగ్రవాదంపై పోరాటాన్ని వినియోగిస్తూ, దానిని నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఏకపక్ష యుఎస్ నిర్ణయం, దాని చర్యలను చట్టబద్ధమైన చట్ట అమలు లేదా జాతీయ రక్షణ కార్యకలాపాలుగా మారుస్తుందనే వాదనను ఆయన తిరస్కరించారు. డిసెంబర్ 16న ట్రంప్ ప్రకటనను ప్రాథమిక నిబంధనల ఉల్లంఘనకు స్పష్టమైన సాక్ష్యంగా ఆయన ఉదహరించారు. దీనికి మరిన్ని వివరణలు అవసరంలేదని అన్నారు.
రాజకీయ, సైనిక మరియు ఆర్థిక ఒత్తిడిని ప్రయోగించి వ్యతిరేక దేశాల ప్రభుత్వాలను పడగొట్టడం వెనుక ప్రధాన లక్ష్యం ఆయా దేశాల సహజ మరియు ఖనిజవనరులను స్వాధీనం చేసుకోవడమేనని అన్నారు. అమెరికా చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కానివి అని, యుఎన్, ఐక్యరాజ్యసమితి సముద్ర చ్టంపై సమావేశం (యుఎన్‌సిఎల్‌ఒఎస్), భద్రతామండలి తీర్మానాలకు విరుద్ధని ఆయన పేర్కొన్నారు. వెనిజులా ప్రభుత్వానికి, ప్రజలకు రష్యా పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని అన్నారు. ఆయనను జాతీయ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం అంతర్జాతీయ చట్టాలను సమర్థించాలని ఆయన కోరారు.



