నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించకుంటే 100శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ బెదిరింపులపై రష్యా మంగళవారం స్పందించింది. రష్యా ఎగుమతుల కొనుగోలుదారులపై ఆంక్షలు, బెదిరింపులు సహా అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇటీవలి ప్రకటనలు తీవ్రమైనవి, విశ్లేషణ అవసరమని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ”ట్రంప్ ప్రకటనలు చాలా తీవ్రమైనవి. వాటిలో కొన్ని తమ అధ్యక్షుడు పుతిన్‌ను వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసినవి. ట్రంప్ ప్రకటనను విశ్లేషించేందుకు కొంత సమయం అవసరం. పుతిన్ కచ్చితంగా స్పందిస్తారు” అని అన్నారు.
ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపిణీ చేస్తామని ట్రంప్ సోమవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనపై కూడా డిమిత్రి స్పందిస్తూ.. వాషింగ్టన్, నాటో దేశాల్లో ముఖ్యంగా బ్రస్సెల్స్‌లో తీసుకుంటున్న నిర్ణయాలను ఉక్రెయిన్ నుండి శాంతికి సంకేతంగా కాకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు సంకేతంగా భావిస్తోందని అన్నారు. ఉక్రెయిన్‌తో ప్రత్యక్షంగా చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉందని, తదుపరి చర్చలు ఎప్పుడపు జరగవచ్చనే అంశంపై ఉక్రెయిన్ నుండి సంకేతం కోసం తాము వేచి చూస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.