Sunday, July 13, 2025
E-PAPER
Homeజాతీయంగోకర్ణ గుహలో రష్యన్‌ మహిళ

గోకర్ణ గుహలో రష్యన్‌ మహిళ

- Advertisement -

– రెండు వారాలుగా పిల్లలతో అక్కడే
– రక్షించిన పోలీసులు..
– స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు

బెంగళూరు : కర్నాటకలో ఓ రష్యన్‌ మహిళ గోకర్ణలోని దట్టమైన అడవుల్లో రహస్య జీవనం సాగిస్తున్న విషయం వెలుగు చూసింది. ఓ చిన్న గుహలో ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఆమెకు నచ్చజెప్పి అక్కడ నుంచి బయటకు తీసుకువచ్చిన స్థానిక పోలీసులు.. సొంత దేశానికి తిప్పి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సదరు మహిళ వీసా గడువు 2017లోని ముగిసినట్టు తెలుస్తున్నది. ఉత్తర కన్నడ జిల్లాలోని కుంటా తాలుకాలో దట్టమైన అడవులున్నాయి. అక్కడి రామతీర్థ పర్వత ప్రాంతంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఓ గుహ వద్ద ఎవరివో దుస్తులు ఉన్నట్టు గమనించారు. దట్టమైన అడవి, కొండచరియలు విరిగిపడే ఆ ప్రమాదకరమైన ప్రాంతంలో ఎవరో నివాసం ఉండవచ్చనే అనుమానంతో ముందుకెళ్లారు. పైకి వెళ్లి చూడగా అక్కడున్న గుహలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. రష్యాకు చెందిన ఆమెను నైనా కుటినా అలియాస్‌ మోహి (40)గా గుర్తించారు. ఆరు, నాలుగేండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు.బిజినెస్‌ వీసాపై నైనా భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో గోవా నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో పర్వత ప్రాంతంలో ఓ ప్రదేశం ఆమెకు నచ్చింది. దట్టమైన అడవిలో ఉన్న గుహలో ఓ చిన్న నివాసం ఏర్పరచుకొంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం ఆరాధిస్తూ ప్రకతి ఒడిలో ధ్యానంలో మునిగిపోయింది. ఆమెకు తోడుగా ఇద్దరు చిన్నారులు మాత్రమే ఉన్నారు. ఆ గుహ ఉన్న రామతీర్థ కొండల్లో 2024లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వన్యమృగాలు, అత్యంత విషపూరిత సర్పాలు ఉండే ఆ ప్రాంతంలో రెండు వారాలుగా ఆమె ఎలా నివసించారు? ఏం తిన్నారనే దానిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఆమెకు ఎటువంటి అపాయం జరగలేదన్నారు. అయితే, ఆమె వీసా గడువు 2017లోనే ముగిసిందనీ, భారత్‌లో ఎప్పటి నుంచి ఉంటున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. ప్రస్తుతానికి స్థానిక ఆశ్రమంలో ఉంచిన అధికారులు.. రష్యన్‌ ఎంబసీకి ఈ విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే బెంగళూరుకు తరలిస్తామని, అక్కడ నుంచి ఆమె స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని జిల్లా పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -