నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి దాడి చేసింది. భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. అందులోనూ ఆధునిక ఒరెష్నిక్ హైపర్ సోనిక్ క్షిపణులతో రాష్యా దాడి చేసింది. మొత్తం 36 మిస్సైల్స్ 242 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ వైమానిక దాడి ఈయూ-నాటో దేశాల సరిహద్దు ప్రాంతంలో జరగడం విశేషం.
ఈ దాడులపై రష్యా అధికారికంగా వెల్లడించింది. ఉక్రెయిన్ లోని వ్యూహాత్మక ప్రాంతాలపై శుక్రవారం అర్ధరాత్రి తమ సైన్యం దాడి చేసిందని ప్రకటించింది. తాజా దాడుల్ని ఉక్రెయిన్ ఖండించింది. శాంతి ఒప్పందం గురించి చర్చిస్తున్న సమయంలో దాడులు సరికాదని పేర్కొంది. రష్యా తాజా దాడి కారణంగా ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.



