– కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ : అనునిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికుల భద్రతా, సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ సర్వే కమిటీ సమావేశం జరిగింది. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల ద్వారా పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, ప్రయోజనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా మాన్యువల్ స్కావెంజర్స్ లేరని, 1993 నిషేధ చట్టం పకడ్బందీగా అమలవుతోందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రజిత కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవడం జరుగుతోందని అన్నారు. జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు, 545 గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్య కార్మికులు ఇంటింటి చెత్తను సేకరించి, వాహనాల ద్వారా డంప్ యార్డులకు తరలిస్తున్నారని అన్నారు. కాగా, సఫాయి కర్మచారీలు, పారిశుద్ధ్య కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు అర్హులైన వారి పిల్లలకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ అమలయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదవశాత్తు పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చొరవ చూపాలన్నారు.
మాన్యువల్ స్కావెంజర్ నిషేధ చట్టం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా కృషి చేయాలన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని, బీమా సౌకర్యం, పీ.ఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు వర్తించేలా చూడాలన్నారు. సఫాయి కర్మచారీలు అందరూ ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రవిబాబు, సీ.పీ.ఓ రతన్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.