Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeకథసక్కుబాయి

సక్కుబాయి

- Advertisement -

ఎప్పటిలాగే నాలుగు వూర్ల అవతల ఉన్న స్కూలుకు వెళ్లేటందుకు ఆదరాబాదరాగా బస్టాండు వైపుకు నడుస్తున్న నాకు మూడు వీధుల అవతల ఉండగానే ఏడుపులు వినిపించాయి. లయబద్దంగా, శృతి తప్పకుండా గుంపు అంతా ఒకరినొకరు అల్లుకుని ఏడ్చే ఏడుపు వినటం అప్పటికి నాకేమీ కొత్తకాదు. కానీ, ఆ సమయంలో వినిపించిన దు:ఖంలో శృతి తప్పిన రాగం ఒకటి చెవినపడింది. మనసులో ఏదో అలజడి మొదలైంది.
ఏడో తరగతి పుస్తకాల బ్యాగు రెండు భుజాల ఆసరాతో వీపున తగిలించుకుని పరుగుపరుగున వెళ్లాను. పది పదిహేను మందితో కూడిన సమూహం. ఆ అలజడిని చూడాలంటే వాళ్లను తప్పించుకుని మధ్యలోకి వెళ్లాల్సిందే. తప్పదు. ఆడవారి పక్కనుంచి దూరుదామని ప్రయత్నించాను. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఉన్నారు. నా ఎత్తుకు తగినట్లుగా చూపు సారించి చూద్దామంటే… వాళ్లలాగే వాళ్ల ఫేట్యాలు కూడా మూగి ఉండటంతో సాధ్యం కాలేదు. మగవాళ్లు ఉన్న వైపుకు వెళ్లి వాళ్ల కాళ్ల సందులలోనుంచి చూసాను. ఒక యువతి నేలపై పడుకుని ఉంది. ఒళ్లంతా చెమటలతో నిస్త్రాణగా ఉంది. పొట్ట ఎత్తుగా ఉంది. ముఖం సరిగా కనపడలేదు. అంతే. నేను తిరిగి వెళ్లి బస్సు ఆగే చోట నిలబడి వారినే గమనిస్తున్నాను.
అదేమిటో. బస్సు మా వద్దకు చేరబోతున్న నాలుగైదు నిమిషాలు ముందే మాకు తెలిసిపోతుంది. పొలిమేరల్లో మేతకు వెళ్లే పశువులను అదిలించడానికి మోగే బస్సు హారన్‌ ముందుగా మా చెవినపడుతుంది. ఆ తరువాత బస్సు దూసుకొస్తుంది. అందుకే బస్సు ఎక్కేవాళ్లందరూ కిరాణా కొట్ల దగ్గర, చెట్ల కింద, బస్టాండుకు దగ్గరగా ఉన్న ఇళ్లముందు ఉండే అరుగులపై కూర్చుని తీరుబడిగా మాట్లాడుతూ ఉంటారు. హార్న్‌ విన్న తరువాత క్షణాల్లో బస్టాండు దగ్గర గుమిగూడతారు. బస్సు వచ్చేదాకా అనుకోనేలేం, వాళ్లూ మనతోపాటే ప్రయాణం చేయబోతున్నారని.
మరో పది నిమిషాలకు బస్సు హార్న్‌ వినిపించింది. ఎక్కడెక్కడి వాళ్లంతా వచ్చి బస్సు ఎక్కేందుకు సిద్ధంగా నిలబడ్డారు. అంతసేపూ ఏడుస్తూ ఉండిపోయిన సమూహంలో కూడా హడావుడి మొదలయింది. సమూహంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి మాకు ఎదురుగా, రోడ్డుకు అటువైపుగా నిలబడ్డాడు. బస్సు వచ్చింది. తోసుకుంటూ అందరూ ఎక్కేసారు. అయినా బస్సు ఇంకా కదల్లేదు.
‘ఏమై ఉంటుందబ్బా..!’ అని మనసులోనే అనుకుంటూ అద్దం జరిపి కిటికీలో నుంచి బయటకు చూశాను.
అతడు తమ సమూహం వాళ్లను రమ్మన్నట్లుగా పెద్దపెద్దగా పిలుస్తూ వారివైపుకు పరుగెత్తాడు. బహుశా కొద్దిసేపు ఆపమని చెప్పి ఉంటాడు డ్రైవరుతో. మరి కాసేపటికి వారి మధ్యన అలసిసొలసి పడుకుని ఉన్న ఆ నిండు గర్భిణిని లేపేందుకు ప్రయత్నించారు. ఆమె లేవలేకపోయింది. ఈసారి ఇద్దరు మగవారు ఎత్తుకున్నారు. మధ్యలో ఒక స్త్రీ గర్భిణీ దుస్తులను సరిచేసి ఆమె టూక్రీని ఒంటి నిండా కప్పిపెట్టింది. ముగ్గురూ కలిసి ఆమెను అతి కష్టమ్మీద బస్సు ఎక్కించారు. ఒక పూర్తి సీటుపై ఆమెను పడుకోబెట్టారు. అప్పుడు చూసాను ఆమె ముఖం. ఆమె నాకు మూడేళ్లు సీనియర్‌.
నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు ఆమె ఐదో తరగతిలో ఉన్నది. పేరు సక్కు. వాళ్ల తమ్ముడు మా క్లాస్‌మేటే. పేరు భోజ్యా నాయక్‌. భోజ్య అనే పిలిచేవాళ్లం. అతడు వాళ్ల అక్కను బాయీ అని పిలిచేవాడు. మేమూ అలాగే సక్కుబాయి అని పిలిచేవాళ్లం. మా వూరికి చుట్టూతా పదిహేను తండాలు ఉన్నాయి. వాటన్నింటికీ మా వూరే పంచాయితీ కావటంతో వాళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ల మధ్య పొలం తగాదాలైనా, ఆస్తి పంపకాలైనా, ఓటు వేయాలన్నా, మరే ఇతర కారణాలైనాసరే తండాల నుంచి ఎద్దుల బండి కట్టుకునో ట్రాక్టర్‌లలోనో గుంపులు గుంపులుగా మా వూరికి వచ్చి పనులు పూర్తి చేసుకుని వెళ్లేవాళ్లు. మామూలు సమయాల్లో కాలినడకనే వచ్చేవారు.
హాఫ్‌ లంగా, ఫుల్‌ జాకెట్లలో ఉండే సక్కుబాయికి పెళ్లి అయిన సంగతే తెలియదు. ఇప్పుడు చూస్తే ఆమె వాళ్ల డ్రెస్‌లో ఉంది. అందులోనా నిండు గర్భిణీ. మా వూర్లో అయిదో తరగతి వరకే ఉంది. ఆ తరువాత హైస్కూల్‌ కోసం పక్క వూరికి వెళ్లాల్సిందే. మా క్లాస్‌మేట్లలో అబ్బాయిలే ఎక్కువగా ఉండేవారు. వాళ్లందరూ సైకిళ్లపై వెళ్తే, మేము, అంటే నాతోపాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉండేవారు. మేమంతా బస్సులో వెళ్లేవాళ్లం.
అడవులకు చేరువలో ఉండే తండాలకు అప్పటికింకా బస్సులు వెళ్లేవి కావు. వాళ్లు బస్సు ఎక్కాలంటే మా వూరికి కాలి నడకన చేరుకోవలిసిందే. అందుకే సక్కుబాయిని హైస్కూలుకు పంపలేదేమో అనిపించింది. అయిదో తరగతి తరువాత భోజ్య కూడా కనిపించలేదు. పదో తరగతిలో ఉండగా ఒకరోజు ఇలాగే బస్సులో కనిపించాడు. టౌనులో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను అని చెప్పాడు. అందుకే సక్కు బాయి గురించి పెద్దగా తెలియలేదు.
బస్సు స్టార్ట్‌ అయింది. ఈలోకంలోకి వచ్చి పడ్డాను. బస్సులో అందరూ ఏమైంది అని అడుగుతున్నారు.
‘కాన్పు సార్‌. పిల్ల మొత్తం బయటకు రాలే.’ ఆగి ఆగి చెప్పింది ఆ సమూహంలోని ఒక పెద్దామె. బతుకు నేర్పుతున్న తెలుగు ఆమెది.
అప్పుడు అర్థమైంది. సక్కుబాయికి బిడ్డ పుట్టబోతున్నదని.
‘ఏరు. సక్కుబాయే. మన క్లాస్‌ భోజ్యా వాళ్లక్క.’ చూడమన్నట్లుగా సైగ చేసాను నా క్లాస్మేట్‌ నాగలక్ష్మికి.
‘ఓ… సక్కుబాయా?!’ ఆశ్చర్యంతోటి నావైపు చూసింది.
‘అవును. ఒక్కసారి చూసి రాపో. నామాట అబద్ధమైతే బెట్‌ కట్టుకుందాం.’ సవాల్‌ విసిరాను హుషారుగా.
‘ఆగవే తల్లి. నువ్వొకదానివి. సక్కుబాయి చచ్చిపోతదేమోనని ఏడుస్తున్నరు వాళ్లు. ఏడింటికొచ్చిన్రు వాళ్లు. నేను మంచినీళ్లకోసం బోరింగు దగ్గరకు వచ్చినప్పుడు యీడనే ఉన్నరు. అప్పుడు సక్కుబాయి అని తెలియదే.’ నాగలక్ష్మి గొంతు సీరియస్‌గా ఉంది.
‘ఎందుకే. పిల్లో, పిలగాడో పుడతరు. అంతేకదా. దానికే చచ్చిపోతరా?’ అడిగాను కళ్లు మరింత పెద్దవి చేసి.
‘పుడతరు కానీ ఈమెకు కష్టమైపోతున్నదంట. మా అమ్మ చెప్పింది ఇందాకే.’
‘ఎందుకే’ మళ్లీ సక్కుబాయి ముఖం కనిపిస్తుందేమోనని మెడను సాగదీసి ముందు సీట్లవైపుకు తొంగి చూస్తూ అన్నాను. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆతృత, ఆమెను చూడాలన్న కోరిక బలంగా ఉన్నా తెలియని వాళ్లను ఏం అడగాలో అర్ధం కాలేదు.
‘అబ్బా. ఎందుకేంటే. చదువుకోవలిసిన చిన్న పిల్లకు పెండ్లి చేసిన్రని అన్నది అమ్మ. అందుకే ఇట్లా అయితదంట. బతుకుతదో లేదో అని ఏడుస్తున్నరు.’ నాకు నాగలక్ష్మి చేసే జ్ఞానబోధ తప్ప తెలుసుకోవాలన్న నా జిజ్ఞాస తీర్చుకునే మరో మార్గం కనిపించడంలేదు.
అవును. చదువుకుంటే సక్కుబాయి పదో తరగతిలో ఉండాలి ఇప్పుడు. వయసుకు మించిన భారం మోస్తూ అలా కదలకుండా పడిఉంది.
స్కూల్లో ఉన్నప్పుడు సక్కుబాయి ఎంత బాగుండేదో. అచ్చు తెల్లటి రబ్బరు బొమ్మలాగే. ఆమె మేనిఛాయతో పోటీపడుతున్నట్లుగా ఉండేది ఆమె పొడవాటి మెరిసే రాగి రంగు జుట్టు. రెండు జడలను రిబ్బన్లతో మడిచి కట్టుకుని ఆడుతూ పాడుతూ హుషారుగా కనిపించేది.
నాలుగో తరగతిలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కనబడుతుండేది తలపై కట్టెల మోపుతోనో, చాలామంది ఆడవాళ్ల సమూహంలో ఒకత్తెగా జానపళ్ల బుట్టను మోస్తూనో.
తండాలకు దగ్గరగా ఉన్న అడవుల నుంచి వంట చెరుకును మా వూరికి తెచ్చి అమ్ముకోవడం బంజారాల జీవన భృతులలో ఒక భాగం. వారికి ఉన్న వ్యవసాయ భూములలో పంటలు పండించుకుంటూనే ఇతర ఆదాయ మార్గాలు వెతుక్కునేవారు. వాటిలో వంట చెరుకుగా ఉపయోగపడే కట్టెలను మోపులుగా చేసుకుని మా వూరిలో అమ్ముకోవడం ఒకటి. వారికి కావలిసిన సరుకులు కొనుక్కుని వెళ్తుండేవారు. వారు చేసే ఈ కఠోర శ్రమకు ఆడామగా తేడా ఏమీ కనిపించేది కాదు.
మోపు సైజును బట్టి అయిదు రూపాయలు, పది రూపాయలుగా బేరం చేసి వూర్లో కట్టెలు కొనుక్కునేవారు. మరి కొందరు బియ్యం తీసుకుని కట్టెలు ఇచ్చిపోయేవారు. మా ఇంటిలోనూ కట్టెల మోపులకోసం ప్రత్యేకమైన స్థలం ఉండేది.
కట్టెల మోపులు కొనుక్కునేందుకు వాళ్ల పేర్లు తెలియాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆడవాళ్లనైతే లక్ష్మీ అనీ, మగవాళ్లనైతే నాయక్‌ అనీ కేకవేసి పిలిస్తే సరిపోయేది. దగ్గరికి వచ్చాక వారి పేర్లు తెలుసుకుని ఆ పేర్లతో పిలిచేవాళ్లు.
కొందరు పెద్దవాళ్లతో కలిసి కట్టెలు మోసుకుంటూ వచ్చిన సక్కుబాయిని చూసినప్పుడు మనసులో తెలియని బాధ కలిగేది. దానిని ఏ రకంగా వెలిబుచ్చాలో అర్ధమయ్యేది కాదు. అంతకు కొన్నిరోజులు ముందే చాలాసార్లు అనుకున్నాను. నాగలక్ష్మితోనూ అన్నాను.
‘సక్కుబాయి కనిపించక చాన్నాళ్లయింది. పొలం పనులకు కూడా పోతుందేమో’ అని.
ఇప్పుడు ఇలా బిడ్డను సగం బయటకు, సగం లోపల ఉండి భవిష్యత్తు ప్రశ్నార్థకమై కనిపిస్తుందని ఊహించని నాకు ఆ సందర్భం గుర్తుకువస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ముప్ఫై ఏళ్లు గడిచినా మరెన్నడూ అటువంటి దృశ్యం మరోసారి చూడకపోవడం మూలానో ఏమో… ఏ భావమూ లేకుండా అలా బస్సు సీట్లో పడి ఉన్న సక్కుబాయి కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది.
బస్సు అలా ఊరి చివరదాకా పరుగులు తీసిందోలేదో. ఒక్కసారిగి ఆగింది. ఎవరు ఎక్కబోతున్నారో అని అందరూ ఆతృతగా డోర్‌వైపు చూడటం ప్రారంభించారు. ఎక్కింది మరెవరో కాదు. మా నాన్న. మా వూరిలో ఆర్‌.ఎం.పీ. ఆయనే మరి. నాన్నను చూడగానే పట్టరాని సంతోషం. మళ్లీ బస్సు పరుగందుకుంది.
‘ఒక పేషెంట్‌కు ఇంజక్షన్‌ చేయాల్సి ఉంది. బస్సు వచ్చేలోపు పూర్తి చేసి వస్తా.’ అని వాళ్లతోటి ముందే చెప్పాడట. ఆయన మెడిసిన్స్‌ బ్యాగ్‌ ఇంటిలో ఇవ్వమని ఎవరిచేతనో పంపించి బస్సు ఎక్కేసాడన్నమాట. ఎవరో పలకరించి అడిగితే చెబుతున్నాడు నాన్న. నాన్నకు ఇదంతా మామూలే. కండక్టర్‌ పక్కన కూర్చుని ఉన్నాడు.
‘ఆడపిల్లలకు పద్ధెనిమిదేళ్లు వచ్చేదాకా పెళ్లి చేయొద్దని గౌర్నమెంటుగూడ మొత్తుకుంటనే ఉంది కదయ్యా. అయినా వినరు. చేసేస్తరు. ఇగో ఇట్ల కాన్పులు కష్టమైతయి.’ నాన్న ముఖంలో దిగులు కనిపిస్తున్నది.
‘మీరు మంచిగ చేస్తరు కద సారు. మల్ల ఆస్పటలుకు తీస్కొనిపోతున్నరేందీ?’ ఇంకో ప్రయాణీకుడి నుంచి ప్రశ్న.
‘ఇగో పాతరోజులల్ల కడుపుతోటి ఉన్నోళ్లకు కాన్పు అయ్యి, తల్లీబిడ్డ బతికేదాంక భరోసా ఉండేది కాదు. ఇప్పుడు అట్ల కాదు కదా. మంచి మంచి హాస్పిటల్లొచ్చినయి. మంచిగ చూపించుకోవాలె. డాక్టర్లు చెప్పినట్టు తినాలె. మందులేసుకోవాలె. ఆరోగ్యంగ ఉంటరు. కాన్పులు మంచిగైతయి. పుట్టే పిల్లలు గూడ మంచిగుంటరు. నిన్న నొప్పులు మొదలయ్యి, ఇంత అయిన తరువాత తీసుకొచ్చిన్రు ఈడికి. ఆపరేషన్‌ అయినా మంచిదే అని తీసుకపోతున్న.’ అర్థమయ్యేవిధంగా విడమర్చి చెప్తున్నడు నాన్న.
‘మా పిల్ల దక్కినా సాలు అయ్యా.’ సక్కుబాయి సమూహంలోనుంచి ఒక నడివయసు స్త్రీ లేచి వచ్చి నాన్న రెండు చేతులు పట్టుకుని నుదుటికి ఆన్చుకుంది. చేతులు వదలకుండా నాన్న దగ్గరే కింద కూర్చుని ఏడుపు మొదలుపెట్టింది.
ఆమెను సముదాయించడానికి చాలామంది కష్టపడ్డారు. వారి పరిస్థితికి బస్సులో మరికొందరి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి.
అంతకుముందెన్నడూ కనిపించని ఈ దృశ్యం నన్ను భయకంపితురాలిని చేసింది. నాగలక్ష్మి పరిస్థితి కూడా నాలాగే ఉంది. కలిసినప్పటి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్లం వెళ్లేవరకు ఏదో ఒకటి గలగలా మాట్లాడే మా నోళ్లు ఆ రోజు మూతలు పడ్డాయి. క్లాసుల్లో ఉన్నప్పటికీ ఏమీ అర్థం కాలేదు. యాంత్రికంగా తిరిగి ఇళ్లకు చేరాం. ఆరోజు సాయంత్రం విపరీతమైన జ్వరంతో ఇంటికి చేరుకున్నాను. ఇంటికి వెనుక పెరట్లో ఉన్న వేపచెట్టు కింద నాన్న వాలు కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు.
‘అబ్బా. సక్కుబాయి బతికే ఉందా?’ ఆతృతకొద్దీ అడిగాను.
‘V్‌ా్మ… బతికే ఉంది. ఆ అమ్మాయి నీకు తెలుసా?’
‘మనవూరి స్కూల్లోనే ఫిఫ్త్‌దాకా చదివింది. మా సీనియరే.’ చెప్పాను.
ఇంతలో అమ్మ వచ్చింది. విషయం అడిగింది. నాన్న చెప్తూ చెప్తూ ఎర్రబడిన నా ముఖం గమనించాడు. చెప్తున్న విషయాన్ని ఆపి దగ్గరకు రమ్మని నా చేతిని పట్టుకుని నాడిని పరీక్షించాడు.
అమ్మ మెడ వద్ద తన చేతిని తిప్పిపెట్టి చూసింది. జ్వరం ఉందని గ్రహించి నాకు చికిత్స ప్రారంభించారిద్దరూ.
రెండు గంటల తరువాత నేను నిద్రలేచాను. అదే రోజు రాత్రి అమ్మ నాతో చెప్పింది.
‘సక్కుబాయికి ఏం కాలేదు. ఆపరేషన్‌ చేసారు. బాబు పుట్టాడంట. ఐసీయూలో ఉన్నాడు. రేపటికి బాగవుతాడంట. నువ్వు ఈమాత్రం దానికే అంతలా భయపడిపోతావా? ఇది అందరు ఆడవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితే కదా.’ అమ్మ గొంతు మెత్తగా ఉంది. మెల్లిగా నాకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తుంది.
‘ఆడవాళ్లందరికా. అమ్మో.!’ భయపడుతూ గుండెపై చేయి వేసుకున్నాను.
‘మరి మన అందరి ఇళ్లల్లో బుజ్జిబుజ్జి పాపాయిలు ఎలా వస్తున్నారనుకుంటున్నావ్‌? ఇట్లా కష్టపడితేనే వస్తారు. మీకు లెసన్స్‌లో చెప్తారులే.’ అంది వివరిస్తూ.
‘నేను కూడా ఇంతేనా?’ ఇంకా భయం రెట్టింపవుతోంది.
‘అవును.’
‘నేను చచ్చిపోతే.? నాకేమొద్దు.’ అన్నాను అమ్మ చేతిని గట్టిగా పట్టుకుంటూ.
‘ఏమీ అవదు. నువ్వు పుట్టావుగా. నాకేమన్నా అయిందా? ఏమీ కాలేదుగా. అలాగే నీకూ ఏమీ అవదు.’ వీపు నిమురుతూ చెప్పింది.
‘మరి సక్కుబాయికి అయింది కదా.’ మరో సందేహం వెలిబుచ్చాను.
‘ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా పెద్దగా అయిన తరువాత పెళ్లి చేయాలి. అప్పుడు పిల్లలు పుట్టినా మనకేమీ కాదు. చిన్నప్పుడే పిల్లలు కనాలనుకుంటెనే ఈ సమస్యలు. నువ్వు ఇప్పుడు చిన్నదానివి కదా. నీకు అర్థం కాదు. పెద్దవుతున్నాకొద్దీ ఇవన్నీ అర్థమవుతాయిలే.’ అంది అమ్మ.
(గిరిజన సంకలనం కోసం రాసినది)
– నస్రీన్‌ ఖాన్‌
writernasreen@gmail.com

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img