నవతెలంగాణ-హైదరాబాద్: చమురు నిల్వల కోసం వెనిజులా ప్రెసిడెంట్‌ను యూఎస్ ఆర్మీ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ ఆయిల్ అమ్మకాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా దేశం నుంచి సుమారు 50 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని కొనుగోలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా ప్రకటన చేశారు. అయితే మార్కెట్ ధరకే వెనిజులా ఆ ఇంధనాన్ని అమ్మనున్నట్లు పేర్కొన్నారు. హై క్వాలిటీ ఆయిల్ అమ్మకం తక్షణమే ప్రారంభం అవుతుందన్నారు. వెనిజులా ప్రజల బెనిఫిట్ కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తారని ట్రంప్ తెలిపారు. అమెరికాలోని అన్‌లోడింగ్ డాక్స్‌కు ఆ ఇంధన నౌకలను తరలిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
వెనిజులా ఇంధనాన్ని అమ్మే ప్రక్రియ పనులను ఎనర్జీ మంత్రి క్రిస్ రైట్ చూసుకుంటున్నారన్నారు. వెనిజులా ఆయిల్ పరిశ్రమ గురించి చర్చించేందుకు అమెరికా ఆయిల్ కంపెనీ పెద్దలు త్వరలో ట్రంప్‌తో భేటీకానున్నారు. చెవ్రాన్, కొనాకోఫిలిప్స్, ఎక్సాన్‌మోబిల్ లాంటి కంపెనీలు త్వరలో ట్రంప్‌ను కలవనున్నాయి. బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. మదురో, ఆయన భార్యను బంధించిన అమెరికా.. కారకస్‌లో ప్రభుత్వాన్ని నడపనున్నట్లు చెప్పింది. ఒకవేళ అవసరం అయితే మళ్లీ పెనుదాడి చేయనున్నట్లు తెలిపారు.



