Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంపెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులనుమంజూరు చేయండి

పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులనుమంజూరు చేయండి

- Advertisement -

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. మంగళవారం నాడిక్కడ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల మంజూరుపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, తెలంగాణ ఎంపీలు చర్చించారు.
1. హైదరాబాద్‌-విజయవాడ: మల్కాపూర్‌ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించడంతో పాటు సర్వీస్‌ రోడ్లను నిర్మించాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. డెత్‌ రోడ్డుగా పిలిచే హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై (ఎన్‌హెచ్‌-65) జులై 27న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందిన విషయాన్ని ఆయన దష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆగస్టు 15న నిర్వహించే ఫైనాన్స్‌ మీటింగ్‌లో ఎన్‌.హెచ్‌-65 విస్తరణను ఆమోదిస్తామని, త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు.
2. సంగారెడ్డి – చౌటుప్పల్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసిన విషయాన్ని వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం ఇండిస్టీయల్‌ కారిడార్‌గా రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో వేగంగా పనులు చేపడితే అనుకున్న వ్యయంలోనే భూసేకరణ పూర్తవుతుందని, ఆలస్యం జరిగితే భూసేకరణకు ధరలు పెరిగి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతిపాదనలు పంపితే, అనుకున్న దానికన్నా ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని గడ్కరీ హామీ ఇచ్చారు.
3. ఎల్‌బీ నగర్‌ – మల్కాపూర్‌ : చింతల్‌ కుంట చెక్‌ పోస్ట్‌ నుంచి హయత్‌ నగర్‌, ఆలిండియా రేడియో స్టేషన్‌ వరకు దాదాపు 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్‌ కారిడార్‌గా నిర్మించడంతో పాటు నాగ్‌పూర్‌లో మాదిరిగా డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌గా నిర్మాణం చేపట్టాలని కోరారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
4. హైదరాబాద్‌-శ్రీశైలం రోడ్డు జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ -765) : హైదరాబాద్‌ – శ్రీశైలం రహదారిలో టైగర్‌ రిజర్వ్‌ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్‌ కారిడార్‌ గా గుర్తించాలని కోరారు. అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ ఇస్తూ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
5. హైదరాబాద్‌-మన్నెగూడ : ఈ రహదారికి సంబంధించి.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో ఉన్న అంశాన్ని త్వరగా పూర్తి చేసి కాంట్రాక్టన్‌ను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తిచేయడానికి సహకరించాలని కోరారు. ఈ అంశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.
ఇవే కాకుండా, సేతు బంధన్‌, సీఆర్‌ఐఎఫ్‌ (సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నుంచి మంజురుకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా వచ్చే వారం సెక్రెటరీతో ప్రతిపాదనలు పంపించి మంజూరు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉప్పల్‌ ఫ్లైఓర్‌ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వీటితో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారులను అందించేందుకు హ్యామ్‌ విధానంలో ఇప్పటికే రోడ్లను ఎంపిక చేశామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -