Sunday, June 8, 2025
E-PAPER
Homeసోపతిభ్రమల మాయలో జీవితాలు స్కిజోఫ్రెనియా

భ్రమల మాయలో జీవితాలు స్కిజోఫ్రెనియా

- Advertisement -

స్కిజోఫ్రెనియా తీవ్రమైన మానసిక వ్యాధి. ప్రపంచ జనాభాలో ఒక శాతాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. యుక్త వయసు వున్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకించి మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పురుషులలో తక్కువ వయస్సులోనే ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో జుట్టు విరబోసుకుని అరుస్తుండడం, తనలో తాను మాట్లాడుకోవడం లక్షణాలు కనిపించగానే చేతబడి, దయ్యం పట్టింది, చెడుగాలి సోకిందని చికిత్స తీసుకోకుండా వ్యాధి తీవ్రత పెరిగే వరకు సమయాన్ని వథా చేస్తుంటారు.

కొంతమంది వ్యక్తులు తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురవుతారు. వారికి ఏదో అనాలోచిత ఘటన జరుగుతోంది, నన్ను ఎవరో హింసిస్తున్నారు అనే భ్రమలు కలుగుతాయి. తీవ్రమైన మానసిక ఆందోళనతో ఏదో జరుగుతోందనే భ్రమల మాయాజాలంలో కొట్టుమిట్టాడుతూ, మానసిక రుగ్మతల బారినపడతారు. ఇక నా బతుకింతే అన్న భావనలోకి మైండ్‌ను తీసుకొని వెళ్తారు. ఈ భ్రమల వల్ల వారు భయంతో కొట్టుమిట్టాడుతూ, తమ సొంత కల్పిత ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారు. ఉదాహరణకు, రోజూ ఇంటికి అపరిచితులు వస్తున్నారు, వారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్లినా నా వెంట వస్తున్నారు అనుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది వారి జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతోంది….. అనే భవన తో సతమతమవుతూ ఉంటారు. వీరు కనిపించని కల్లోలాన్ని ఎదుర్కొంటుంటారు.
ఎవరో తనను వెంబడిస్తున్నారంటూ:
మనిషి ప్రవర్తన ఆధారంగానే మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాడనే విషయం బయటకు వస్తుంది. స్కిజోఫ్రెనియా తీవ్రమైన మానసిక రుగ్మత. ఇది వ్యక్తి ఆలోచనలు, భావనలు, ప్రవర్తనలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులు వాస్తవికత నుండి దూరంగా మారతారు. అంటే లేని శబ్దాలు వినిపించడం, వస్తువులు కనిపించడం, ఇతరులు మనను తక్కువగా చూస్తున్నారనే అపోహలతో వుంటారు. ఉదాహరణకు… ‘ఎవరో తమను హింసిస్తున్నారు, వారి ఆలోచనలు వినిపిస్తున్నాయి’ అని నమ్మవచ్చు.
పిచ్చివాళ్లు కాదు
స్కిజోఫ్రెనియా జబ్బు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరికి ఉంది. భారతదేశంలో సుమారు 1.1 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. కానీ అజ్ఞానం, సామాజిక కట్టుబాట్ల కారణంగా చాలామంది సరైన చికిత్స పొందడం లేదు. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు పిచ్చివాళ్లు కాదు. వారికి ఒక వైద్యపరమైన స్థితి ఉంది. సరైన చికిత్స, సహాయంతో వారు సాధారణ జీవితాలను గడపగలరు.
చేతబడులు, దయ్యం పట్టిందా…
స్కిజోఫ్రెనియా తీవ్రమైన మానసిక వ్యాధి. ప్రపంచ జనాభాలో ఒక శాతాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి 17-40 సంవత్సరాల వయస్సు గల యువకులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి 40 వయస్సు తర్వాత కూడా రావచ్చు. ప్రత్యేకించి మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పురుషులలో తక్కువ వయస్సులోనే ప్రారంభమవుతుంది. స్కిజోఫ్రీనియా గురించి అవగాహన లేకపోవడంతో జుట్టు విరబోసుకుని అరుస్తుండడం, తనలో తాను మాట్లాడుకోవడం లక్షణాలు కనిపించగానే చేతబడి, దయ్యం పట్టింది, చెడుగాలి సోకిందని చికిత్స తీసుకోకుండా వ్యాధి తీవ్రత పెరిగే వరకు సమయాన్ని వథా చేస్తుంటారు. వ్యాధి తొలిదశలోనే గుర్తించి తొందరగా చికిత్స ప్రారంభిస్తే సుమారుగా 20 శాతం రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. మనోబలంతో స్కిజోఫ్రెనియా వ్యాధిని జయించవచ్చు.
గమ్యం లేని జీవితం….
స్కిజోఫ్రెనియా అనేది ఒక సంక్లిష్టమైన మానసిక రుగ్మత. ఇది వేర్వేరు రకాలుగా వ్యక్తమవుతుంది. కొన్ని సందర్భాల్లో వారు స్థిరమైన ఆలోచనలు లేకుండా వింత ప్రవర్తనతో వుంటారు. అస్పష్టమైన మాటలు, అసాధారణ శారీరక భంగిమలకు దారితీయవచ్చు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు తమ ఆలోచనలు బయటి వ్యక్తులకు వినిపిస్తున్నాయని, ఎవరో తమ ఆలోచనలను నియంత్రిస్తున్నారని భావిస్తారు. రోగులు తమలో తాము మాట్లాడుకోవడం, సందర్భం లేకుండా నవ్వడం, కోపగించడం వంటి అసాధారణ ప్రవర్తనలను ప్రదర్శిస్తారు.
గుర్తించరు, అంగీకరించరు :
స్కిజోఫ్రెనియా ముఖ్య లక్షణం… ఈ స్థితిలో ఉన్న చాలామంది తమకు సమస్య ఉందని గుర్తించరు, అంగీకరించరు. దీన్నే ‘అనోసోగ్నోసియా’ అంటారు. ఈ లక్షణం చికిత్సను మరింత కష్టతరం చేస్తుంది. ఎందుకంటే రోగులు తమకు సహాయం అవసరమని భావించరు. అయితే ప్రారంభ దశలోనే గుర్తించి సరైన మానసిక చికిత్స చేస్తే రోగులు సాధారణ జీవితంలోకి వస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు, సామాజిక పునరావాసం ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, స్కిజోఫ్రెనియా ఒక వ్యక్తి వ్యక్తిత్వం, తెలివితేటలను నాశనం చేయదు. ఇది వైద్యంతో సరైపోతుంది. దీనికి సరైన అవగాహన, చికిత్స వుంటే స్కిజోఫ్రెనియా వ్యక్తులు తమ జీవితాలలో విజయాలను సాధించగలరు.
మానసిక ఆరోగ్యంలో పురోగతి:
గతంలో ‘దిగాలుకు దిక్కు లేదు, మనాదికి మందు లేదు’ అనే సామెత ఉంది. కానీ ఆధునిక వైద్యశాస్త్రంలో దిగాలుకు దిక్కు ఉంది, మనాదికి మందూ ఉంది! మానసిక రుగ్మతలు, ప్రత్యేకించి స్కిజోఫ్రెనియా వంటి సంక్లిష్టమైన స్థితులు నిర్ధిష్టంగా నిర్ధారించబడి, సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి. మానసిక ఆరోగ్య నిపుణులు సైకియాట్రిస్టులు, క్లినికల్‌ సైకాలజిస్టులు, సైకోథెరపిస్టులు, ఆధునిక డయాగ్నోస్టిక్‌ పరికరాలు, మానసిక పరీక్షలు, నైపుణ్యతతో ఈ వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి, రోగుల ప్రవర్తనలోని సూక్ష్మ లోపాలను కూడా గుర్తించి, సమర్థవంతంగా నయం చేస్తున్నారు. యాంటీసైకోటిక్‌ మందులు, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, కుటుంబ-ఆధారిత చికిత్సల వంటి సమగ్ర విధానాలు రోగుల జీవిత నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. ప్రత్యేకించి, రెండవ తరం యాంటీసైకోటిక్‌ మందులు తక్కువ దుష్ప్రభావాలతో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఈ రోగులు సరైన చికిత్స, సామాజిక మద్దతుతో సాధారణ జీవితం గడపగలరు.
భరోసాను నింపాలి:
స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడంలో కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత కీలకం. కుటుంబ సభ్యులు మానసిక ఆరోగ్య నిపుణుల సూచనలతో రోగి పట్ల ఏదైనా తట్టుకునే సామర్థ్యం నీలో ఉందన్న భరోసాను అందించాలి. వారిపై సానుభూతి చూపుతున్నారన్న ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే ఆ వ్యక్తిలో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడంతోపాటు వారి చికిత్స వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా స్కిజోఫ్రెనియాను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు.
– డా. అట్ల శ్రీనివాస్‌ రెడ్డి, 9703935321

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -