రండి ఎడ్మిషన్లు జరుగుతున్నారు మా బడిలో. కొద్ది సీట్లు మాత్రమే ఉన్నారు. త్వరపడండి. రండి మా ”తిట్ల బడికి”. ఒకటి ఒకటి ఒకటి ఒకటి, రెండూ రెండూ రెండూ, మూడు మూడు మూడు…. ఇలా ఉంటాయి మా ర్యాం కులు. మొదటి బ్యాచుకే ర్యాంకులెలా వస్తాయి అనుకోవచ్చు మీరు… తెచ్చి చూపిస్తాం…. అది మాపైన మాకున్న నమ్మకం…. మా ఫోన్ నెంబర్ 420420420420……. పూర్తి వివరాలు రేపు ఇదే పేపరులో…. ఇదే స్థలంలో…
పై ప్రకటన చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. ఎవరి నోళ్ళు వారన్నమాట. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ 420420420420 చూస్తే ఇంకా భయమేసింది. పూర్తి వివరాలు రేపు అన్నారే, రేపటివరకూ ఆగవలసిందేనా… అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆ రేపటి కోసం. కొందరు నిద్ర పోయారు, కొందరు జాగరణ చేశారు. మరుసటి రోజు అయిన తరువాత మేలుకున్న వాళ్ళు, ఏ మూడుకో నాలుగుకో లేచినవాళ్ళు పేపరు కోసం వేచి చూస్తున్నారు. మామూలుగానే తెల్లవారింది అంటే సరిపోదు. పేపర్ కోసం చూసేవాళ్ళకు చాలా ఆలస్యంగా ఐన్స్టీన్ మహాశయుడు సాపేక్ష సిద్ధాంతంలో చెప్పినట్టుగా ఎన్నో గంటలు లేటుగా తెల్లవారింది. పేపరు మాత్రం రాలేదు. షాపులదగ్గరికి పోయి చూస్తే కూడా ఇంకా రాలేదని చెబుతున్నారు. టీలు, స్నానాలు, నాష్టాలు అన్నీ ఐపోయాకగానీ పేపర్ రాలేదు.
పేపర్ వచ్చినా అందులో ఇచ్చిన తిట్లబడి ప్రకటన అందరికీ నిరాశ కలిగించింది. కొన్ని అనివార్య కారణాలవల్ల మా బడి ప్రారంభించడం కొన్ని రోజులు, లేదా నెలలు, ఇంకా సంవత్సరాలు వాయిదా వేస్తున్నాము. వివరాలు తరువాత చెబుతాము అని ఉంది. మామూలు జనాలు చుప్చాప్గా ఉన్నారు కాని మీడియా మిత్రులు అలా ఉండలేరు కదా!! అందుకే ఆ ప్రకటన ఇచ్చినవాళ్ళ ఫోన్ నంబర్లు, చిరునామాలు కనుక్కొని మరీ వాళ్ళదగ్గరికి పోయి ఇంటర్వ్యూలు చేశారు. వివరాల్లోకి పోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ తిట్లబడి పెడితే తమ నోర్లు మూత పడతాయని ఏదో తమ మెదడు పక్కనపెట్టి నోటితో రాజకీయాల్లో నెగ్గుకు వస్తున్నామని, తమ బాన పొట్టల్ని కొట్టొద్దని వచ్చి ప్రాధేయపడితే అనడంకంటే అడుక్కుంటే మానేశామని, అలాగే మీ ప్రాణాలుండాలంటే ఈ బడి తెరవకూడదన్న హెచ్చరికలు కూడా వచ్చాయని, అందుకే ఊపిరుంటే ఎలాగో బతికేస్తామనీ చెప్పారు.
ఇక టీవీల్లో కహానీలు చూస్తే ఈ తిట్లబడి చేసిన హంగామా, నాయకులు భయపడడం, తిరిగి అదే నాయకులే బడి నిర్వహిద్దామనుకున్న వాళ్ళని భయపెట్టడం మొదలైన వార్తలతో తాజా ఖబర్, ఇప్పుడే అందిన వార్త, బ్రేకింగ్ న్యూస్ అంటూ వేసిందే వేసి నేటి స్టోరీ అంటూ పీ.ఆర్.పీ రేటింగులకోసం నానా హంగామా చేస్తున్నారు. ఇదేందిర భై ఈ లొల్లి? మనపేర్లు బయటపెడతారో ఏమో అని బెదిరించిన నాయకులు, వాళ్ళ అను చరులు టీవీల నుండి మొహం తిప్పడమే లేదు, ఛానల్సు మాత్రం రిమోటుతో మారు స్తున్నారు. ఎలా చేశారో, ఏమిచేశారో కాని ఒక ఛానల్ మాత్రం వాళ్లతో అంటే బడి పెడదామనుకున్న వాళ్ళతో డైరెక్టుగా ఇంటర్వ్యూ అదీ లైవ్, ప్రత్యక్ష ప్రసారం వేశారు. ఇక అందరూ అదే ఛానల్ పెట్టుకున్నారు. నైజీరియాలో వచ్చిన వరదల్లాగ అందరూ ఇదే ఛానల్ పెట్టుకొని టీవీలముందు అతుక్కుపోయారు.
తిట్లబడి నిర్వాహకులని తిని అని, యాంకర్ని యా అనీ చదూకొమ్మని మనవి.
యా: అసలు మీరు ఈ తిట్లబడి అన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు బడి తెరవాలనుకుంటున్నారు.
తిని: మనం రోజూ టీవీల్లో, చట్టసభల్లో, రాజకీయ మీటింగుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ రకరకాల నాయకుల్ని చూస్తున్నాం. అందులో కొందరు బాగా వెనుకబడి ఉన్నారు. అలాంటి వారికోసమే ఈ బడి తెరుద్దామనుకున్నాం
యా: మాకైతే అలా కనిపించలేదే, అందరూ బాగా తిడుతున్నారు, కొన్నిసార్లు కొడుతున్నారు కూడా
తిని: అలాగే అనుకుందాం అందరూ తిడుతున్నారు. కానీ ఆ తిట్లలో కొత్త కొత్త పోకడలు, కొత్త తిట్లు, తిట్టడానికి కొత్త అంశాలు కావాలి కదా అందుకే మా బడి
యా: ఇంకాస్త వివరిస్తారా
తిని: తప్పకుండా
యా: బ్రేక్ తరువాత అసలు ఈ బడి ఎందుకు తెరవాలనుకున్నట్టు? తెరిస్తే దానివల్ల కలిగే లాభాలేమిటి? ఇంకా దీని వెనుక ఉన్న అన్ని కోణాల గురించి, కారణాల గురించి తెలియాలంటే చూస్తూనే ఉండండి ఇదే టీవీ……
ఈ బ్రేకులవల్ల మంచి మంచి విషయాలు తెలుసుకోవడం లేటవుతోంది అని తిట్టుకుంటూ చారు తాగుతూ వేచి ఉన్నారందరూ. బ్రేక్ తరువాత చర్చ షురూ అయింది.
యా: చెప్పండి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో చెప్పారు, ఇంకొన్ని వివరాలు చెప్పండి మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
తిని: ఇక్కడ మీ ప్రేక్షకులంటే రాజకీయ నాయకులనే అర్థం ఒకటి తగిలించుకోండి.
వెంటనే స్క్రోలింగు ”ప్రేక్షకులంటే రాజకీయ నాయకులు అన్న తిట్లబడి నిర్వాహకులు”
తిని తిరిగి ప్రారంభించారు. ఈమధ్య రాష్ట్రపతుల మీద, ఉపరాష్ట్రపతుల మీదా అలాగే అందరి మీదా వస్తున్న తిట్లు చూసి మేము ఇంకో అడుగు ముందుకేసి కాస్త నేర్పిద్దామనుకున్నాం.
యా: ఆ ”కాస్త” గురించి కాస్త చెబుతారా
తిని: తప్పకుండా…. అసలు మేము ఈ బడి పెట్టాలనుకుంది కొన్ని మంచి మాటలు నేర్పిద్దామని
యా: నిజంగా….
వెంటనే మళ్ళీ స్క్రోలింగు ”నాయకులకు కొన్ని మంచి మాటలు నేర్పిద్దామనుకున్న తిట్లబడి నిర్వాహకులు”
తిని: అవునండి, మన విలువలు, సాంప్ర దాయాలు అని ఒకపక్క అంటూనే ఈ తిట్ల పురా ణాలు అదీ మహిళలు, గౌరవించవలసిన పదవుల్లో ఉన్నవాళ్ళపైన విచక్షణ లేకుండా మాట్లాడే నాయకుల మాటల్లా కాకుండా కాస్త సభ్యత ఉండి సభ్య సమాజం గౌరవించేలా నాయకుల్ని తయారు చేద్దామనే మా ప్రయత్నం
యా: మరి తిట్లబడి అని ప్రకటన ఇచ్చి ఆ తరువాత భయపడినట్లున్నారు
తిని: ఏమాత్రం కాదండి. అలాగ ప్రకటన ఇస్తే తప్ప జనాలు మమ్మల్ని చూడరన్న ఉపాయమే అది. మంచి మాటలు చెబితే ఎవ్వరూ వినరని మాకు తెలుసు, ముఖ్యంగా కొన్ని రాజకీయ పక్షాలు తిట్లే ఊపిరిగా, తిట్లే ఆహారంలా, తిట్లే నీళ్ళుగా తింటున్నట్టు, తాగుతున్నట్లు అనిపిస్తోంది అందుకే ఆ ప్రకటన వచ్చింది.
వెంటనే ఇంకో స్క్రోలింగు ” కొన్ని రాజకీయ పక్షాలు తిట్లే ఊపిరిగా, తిట్లే ఆహారంలా, తిట్లే నీళ్ళుగా తింటున్నట్టు, తాగుతున్నట్లు అనిపిస్తోంది అన్న తిట్లబడి నిర్వాహకులు”
యా: మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు, బడి తెరవమని చేప్పేశారుగా
తిని: ఇప్పుడు ప్రజల్లోకి పోయి మంచిని మంచిగా, చెడుని చెడుగా చూడమని చెపుదామను కుంటున్నాము. చూద్దాం భవిష్యత్తులోనైనా మన నాయకుల నోర్లు బాగుపడతాయని ఆశిద్దాం.
మరో స్క్రోలింగు ”భవిష్యత్తులోనైనా మన నాయకుల నోర్లు బాగుపడతాయని తిట్లబడి నిర్వాహకుల ఆశ”
యా: మంచిదండి, మా పీ.ఆర్.పీ రేటింగు కథ పక్కనపెడితే మన ప్రజలు నాయకులకు ఇచ్చే రేటింగు మన దేశాన్ని బాగు పరుస్తుందని ఆశిద్దాం.
తిని: అంతేనండి అంతకంటే మాకు కావలసింది ఏమీ లేదు. నమస్కారం.
– జంధ్యాల రఘుబాబు, 9849753298