Monday, December 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశాస్త్రీయ దృక్పథం మరింత పెరగాలి

శాస్త్రీయ దృక్పథం మరింత పెరగాలి

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెరిగిందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో విజ్ఞాన దర్శినీ, ది నెహ్రూ సెంటర్‌ సంయుక్తాధ్వర్యంలో విజ్ఞాన దర్శినీ రమేశ్‌ అధ్యక్షతన స్వాతంత్య్రం నుంచి స్వాలంబన వరకు, శాస్త్రీయ, ఆధునిక భారతదేశం కోసం నెహ్రూ దార్శనీకత అనే అంశంపై సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం దేశం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో మొదటి ప్రధానమంత్రి పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ చూపిన దూరదృష్టి నేటి భారతదేశానికి బలమైన పునాదిగా నిలిచిందని తెలిపారు. విద్య, శాస్త్రం, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి ద్వారా స్వావలంబన దిశగా దేశాన్ని నడిపించిన నాయకులు నెహ్రూ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు యువతకు ఇప్పటికీ మార్గదర్శకమని సూచించారు. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి, తెలంగాణ కన్జూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెస్సల్‌ కమిషన్‌ అధ్యక్షురాలు జి.రాధా రాణి మాట్లాడుతూ నెహ్రూ గారు ప్రతిపాదించిన శాస్త్రీయ దృక్పథం ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని తెలిపారు. చట్టం, శాస్త్ర విజ్ఞానం, సామాజిక న్యాయం పరస్పర అనుసంధానం తోనే సమతుల్యమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. నెహ్రూ ఆలోచనలు నేటి తరానికి తర్కబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవరచుకో వడంలో దోహదపడతాయని సూచించారు.

మాజీ ఎంపీ, ప్రొఫెసర్‌ సందీప్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన, సాంకేతికంగా బలమైన భారత నిర్మాణానికి నెహ్రూ విధానాలు మార్గాలు వేశాయని తెలిపారు. నేటి భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి స్వాతంత్య్రం అనంతర కఠిన పరిస్థితుల్లో నెహ్రూతీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయాల ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివద్ధికి శాస్త్ర విజ్ఞానం, ఆధునిక ఆలోచనలు ఎంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఐఐసీటీ రిటైర్డ్‌ సైంటిస్ట్‌ లింగయ్య నాగారపు, తెలంగాణ ట్రైకార్‌ చైర్మెన్‌ డాక్టర్‌ బెల్లయ్య నాయక్‌ తేజావత్‌, విజ్ఞాన దర్శినీ తెలంగాణ చాప్టర్‌ అధ్యక్షులు బొల్లి ఆదాంరాజ్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అలీ, కోశాధికారి జయప్రసాద్‌ కడియాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -