Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంనేటి నుంచి 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'

నేటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

- Advertisement -

నలుగురు సభ్యుల బృందం చొప్పున 200 మంది శాస్త్రవేత్తలు
– 1200 గ్రామాల్లో బృందాల పర్యటన
– వానాకాలానికి రైతులను సంసిద్ధం చేసేందుకు చర్యలు
– కార్యక్రమ పర్యవేక్షణకు నోడల్‌ అధికారుల నియామకం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే నూతన కార్యక్రమాన్ని చేపట్టనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మే 5 నుంచి జూన్‌ 13 వరకు రాష్ట్రంలోని సుమారు 1200 గ్రామాలలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సుమారు 200 మందికిపైగా శాస్త్రవేత్తలను ఏర్పాటు చేశామని తెలిపారు.
దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఒక్కో బృందం వారి రోజూవారీ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు, వారంలోని పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల్లోని రైతు వేదికల్లోగానీ, మరే ఇతర సౌకర్యవంతమైన ప్రదేశంలోగానీ రైతులకు యూరియా వాడకం తగ్గించడం, రసాయనాలను జాగ్రత్తగా వాడటం, చెల్లింపు రశీదులను భద్రపరచడం, సాగు నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంచటంపై అవగాహన కల్పిస్తారని వివరించారు. ఈ అంశాలతోపాటు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ఒక్కో బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర స్థానిక ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు, సంఘాలు పాల్గొంటాయని పేర్కొన్నారు. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతోందని గుర్తు చేశారు. కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయంలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్స్‌, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు.
విశ్వవిద్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులతోపాటు వివిధ మండలాల్లోని సహ పరిశోధనా సంచాలకులు, కళాశాలల డీన్లు దీనిని పర్యవేక్షిస్తారని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిందనీ, కాని గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోనందున రైతులు ఇలాంటి అవకాశాలను దూరం చేసుకున్నారని తెలిపారు. కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల శ్రేయస్సు కోసం, రైతులకు వ్యవసాయ సంబంధిత వివిధ అంశాలపై అవగాహన కల్పించే దిశగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వారికి వ్యవసాయ సంబంధిత అంశాలపై గల అనుమానాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -