Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంరైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

– మే 5 నుంచి జూన్‌ 13 వరకు అన్నదాతలకు అవగాహన
– యూరియా వాడకం, సాగు ఖర్చు తగ్గుదల
– పంట మార్పిడి.. ప్రయోజనాలు
– రసాయనాల వినియోగం తదితర అంశాలపై విజ్ఞానం
– వ్యవసాయ శాస్త్రవేత్తలు, కళాశాల విద్యార్థులతో సదస్సులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతు చైతన్యయాత్రల పేరుతో నిర్వహించిన సదస్సులను ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరుతో ఆచరణలోకి తీసుకొస్తోంది. రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, పంటల మార్పిడి చేయకపోవడం, భూసారం దెబ్బతినటం, పంట పెట్టుబడులు పెద్ద మొత్తంలో అవుతుండటం, వాతావరణ మార్పులతో రకరకాల చీడపీడలు వ్యాప్తి చెందుతుండటం.. వాటి నియంత్రణకు విపరీతంగా పురుగుమందులు పిచికారీ చేస్తుండటంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటు న్నాయి. చెట్లను కూడా పెంచకపోవడంతో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. సాగునీటి వాడకంలోనూ వృథా ఎక్కువగా ఉంటోంది. రైతుల్లో అవగాహన లేమే దీనంతటికీ కారణమని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రావిర్భావానికి ముందు నిర్వహించిన సదస్సుల ఆవశ్యకత ఉందని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మే 5వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యే వరకు అవగాహన సదస్సులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వావిద్యాలయం, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవగాహన సదస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా 300 మందికిపైగా శ్రాస్తవేత్తలు, వ్యవసాయ విద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి 2వేల మందికి పైగా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు.
రైతు వేదికల్లో సదస్సులు
వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లోని కృషివిజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం వరకూ సదస్సులు నిర్వహిస్తారు. సుమారు ఆరు వారాలపాటు వీటిని చేపడుతారు. వివిధ మండలాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ, అనుబంధ అధికారుల సమన్వయంతో వీటిని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో శాస్త్రవేత్తలతోపాటు ఇద్దరు వ్యవసాయ కళాశాల విద్యార్థులు భాగస్వాములవుతారు. మొత్తం ఆరు అంశాలపై ఈ సదస్సులు ఉంటాయి.
ఆరు అంశాలపై విజ్ఞానం
‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ అవగాహన సదస్సుల్లో భాగంగా ఆరు అంశాలపై రైతులు విజ్ఞానం పెంపొందేలా చూస్తారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించటం, ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించి, పెట్టుబడులు నియంత్రించటంపై అవగాహన కల్పిస్తారు. అవసరం మేరకు రసాయన ఎరువుల వినియోగం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, లైసెన్స్‌డ్‌ డీలర్ల వద్దనే విత్తనాల కొనుగోలు, రశీదులు తీసుకోవటంతోపాటు పంట పూర్తయ్యే వరకు వాటిని భద్రపరుచుకోవటంపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల పంట దెబ్బతిన్నప్పుడు నష్టపరిహారం పొందేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. సాగునీటి పొదుపు, భవిష్యత్‌ తరాలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడటంపైనా వివరిస్తారు. పంట మార్పిడి విధానం ఆవశ్యకతను తెలుపుతారు. సుస్థిర ఆదాయం పొందేందుకు మార్గాలను చూపుతారు. బీడు భూములను సాగుకు అనువుగా మార్చే క్రమంలో విపరీతంగా చెట్లను నరికివేస్తున్నారు. తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వ్యవసాయంలో చెట్ల ఆవశ్యకత ఏపాటిదో ఈ సదస్సుల్లో వివరిస్తారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు..
రైతులు సాగులో ఎంతటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. వ్యవసాయ అనుబంధ రంగా లపై దృష్టి సారించి లాభాల బాట పట్టేలా చైతన్య పరుస్తారు. రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్త లను తీసుకురావటం వల్ల రైతుల సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శాస్త్రవేత్త లకు రైతులకు మధ్య అనుబంధం ఏర్పడి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావించి ఈ కార్యక్ర మానికి రూపకల్పన చేసిందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్‌ రవి తెలిపారు. రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకునేలా స్థానికంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తోడ్పాటు నందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img