గద్వాల- ఐజ ప్రధాన రహదారిపై పెద్దఎత్తున బైటాయింపు
మొత్తం పంట తీసుకోవాలని డిమాండ్
కంపెనీలు, ఆర్గనైజర్లతో మాట్లాడి పరిష్కరిస్తామన్న అధికారులు
నేడు కలెక్టరేట్‌లో చర్చలకు హామీ
నవతెలంగాణ-జోగులాంబ గద్వాల
కంపెనీలు, ఆర్గనైజర్లు ఎకరాకి రెండు క్వింటాళ్ల పత్తి గింజలు మాత్రమే తీసుకుంటామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విత్తన పత్తి రైతులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి స్టేజి వద్ద (గద్వాల- ఐజ ప్రధాన రహదారి) బుధవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వీరికి పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ మొగిలయ్య, ఐజ తహసీల్దార్ జ్యోతి, మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దకొచ్చారు. ధర్నా విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి గురువారం కలెక్టర్ కార్యాలయంలో కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్‌లను చర్చలకు పిలుస్తామని చెప్పారు. రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేసేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆధ్వర్యంలో కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు హాజరవుతున్న సందర్భంగా బాధిత రైతులందరూ కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఇప్పటికే రైతులను అనేక రకాలుగా మోసం, దోపిడీ చేస్తున్నారని, కొన్ని సంవత్సరాలు నుంచి అనేక పోరాటాలు చేస్తున్నా కంపెనీలు, ఆర్గనైజర్ల ఆగడాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి ఈ సమస్యపై దృష్టి సారించి విత్తన పత్తి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో సుమారు 40 వేల మందికిపైగా విత్తనపత్తి సాగు చేస్తున్న రైతులున్నారని తెలిపారు. రైతు ప్రభుత్వంగా చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్‌కు విత్తన పత్తి రైతుల సమస్యలపై వివరించినా ఇప్పటికీ సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు, ఆర్గనైజర్లు ఎకరాకు రెండు క్వింటాళ్ల పంటనే తీసుకుంటామని మెలిక పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఫౌండేషన్ సీడ్ ఇచ్చి.. విత్తన పత్తిని నాటి క్రాసింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఎకరాకు రెండు క్వింటాళ్లే తీసుకుంటామనడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారన్నారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వివి.నర్సింహ్మ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్‌రాములు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మెన్ రంజిత్ కుమార్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య పాల్గొన్నారు.
విత్తన పత్తి రైతుల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES