Sunday, October 19, 2025
E-PAPER
Homeహెల్త్తీవ్రస్థాయి డెంగీ ప్రాణాంతకం

తీవ్రస్థాయి డెంగీ ప్రాణాంతకం

- Advertisement -

డెంగీ ఒక వైరస్‌. దాని వల్ల వచ్చేది ఒక మాములు జ్వరం మాత్రమే. సామాన్యంగా మిగితా వైరల్‌ జ్వరాల లాగా జ్వరమూ, వంటి నొప్పులతో, మూడు, నాలుగు రోజులు బాధపెట్టి, దానంతటదే తగ్గిపోతుంది.
ఆ విధంగా వచ్చి తగ్గిపోతే ప్రమాదం లేదు. కానీ, కొన్నిసార్లు తగ్గినట్టే తగ్గి, రెండు మూడు రోజుల్లో ఇంకో రూపంలో, తీవ్రస్థాయి డెంగీ వ్యాధిగా తిరిగి వస్తుంది. అప్పుడది ప్రాణాంతకం కావచ్చు.
సాధారణంగా ఇలా ఎవరిలో తిరగపెడుతుందో ఎవరూ చెప్పలేరు. అది నిర్ధారించడానికి అనువైన పరీక్షలూ లేవు. కాబట్టి ఈ అంటు వ్యాధి బారిన పడకుండా నివారించుకోవడం ఒకటే ఉత్తమమైన మార్గం.

ఆరోగ్య సంస్థల సమాచారానుసారం గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల డెంగీ కేసులు, వాటిలో మూడువందల మంది తీవ్రస్థాయి డెంగీ వ్యాధి వల్ల మరణించినట్టు సమాచారం. మన దేశంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపుగా యాభై వేల డెంగీ కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది.
డెంగీ వ్యాధి ఎలా వస్తుంది?
ఏడిస్‌ ఈజిప్టి అనే దోమకాటు వల్ల వస్తుంది. ఈ రకం దోమ ఇతర దోమలకు భిన్నంగా పగలు పూట, చీకటిగా ఉన్న అపరిశుభ్ర పరిసరాల్లో సంచరిస్తూ ఉంటుంది. దీని కాళ్ళపైన తెల్లటి చారలుండటం వల్ల దీనిని చాలా సులభంగా గుర్తించవచ్చు. దీనిని టైగర్‌ మస్కిటో అని కూడా అంటారు
పిల్లలు ఎక్కువగా దీని కాటుకు గురయ్యే ఆస్కారముంది. సామాన్యంగా స్కూల్‌ యూనిఫామ్‌లో కాళ్ళపై అచ్చాదన తక్కువగా ఉంటుంది కాబట్టి, బెంచ్‌ కింద వెలుతురు తక్కువగా ఉండే ఆస్కారం ఉండడం వలన, అలాంటి చోట చేరి, పిల్లలను కాళ్లపై కుడుతూ ఉంటాయి.
డెంగీ వ్యాధికి మాములుగా సూచికలేవి ఉండకపోవచ్చు. మందపాటి జ్వరం మాత్రమే రావొచ్చు. ఒళ్ళు నొప్పులు మాత్రం చాలా తీవ్రంగా ఉండవచ్చు. అందుకే దీనికి బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌ అనే పేరు కూడా ఉన్నది. సూచికలను బట్టి అందే చికిత్సతో చాలామంది రెండు మూడు రోజుల్లో కోలుకుంటారు. పిల్లలు బడికి వెళ్లడం కూడా మొదలు పెడతారు.
అలాంటప్పుడే, అకస్మాత్తుగా, బడిలోనే ఉన్నట్టుండి విపరీతంగా నీరసపడిపోయి, వాంతులు చేసుకొని, ముక్కు, చిగుళ్ల నుండి రక్తస్రావం జరిగి కంగారు పడే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. తీవ్రస్థాయి జ్వరం, రక్త విరేచనాలు, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి. తల, ఒంటి నొప్పులతో, నిలువలేని పరిస్థితి ఏర్పడుతుంది. అరుదుగా, ఆసుపత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించవచ్చు.
మొదటిసారి జ్వరం వచ్చి, తగ్గిపోయిన మూడవ రోజు నుండి వారం రోజుల వ్యవధిలో రోగి రక్తనాళాలు అక్కడక్కడా చిట్లి రక్తం కారడం మొదలయ్యి, బ్లడ్‌ ప్రెషర్‌ విపరీతంగా పడిపోవడం జరుగుతుంది. గుండె, కిడ్నీ లకు రక్తప్రసారం తగ్గి, చర్మం పాలిపోయి, శరీరం చల్లబడి పోవడం వంటివి జరుగుతాయి.
ఈ స్థితిని తీవ్ర స్థాయి డెంగీ అంటారు (పూర్వం డెంగీ హెమొరైజిక్‌ డిసీస్‌బీ షాక్‌ సిండ్రోమ్‌ అనే వారు).
తీవ్రస్థాయి డెంగీ ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితిని కల్పిస్తుంది. డెంగీ జ్వరగ్రస్తులైన వారిలో, సుమారుగా ఐదు శాతం, ఈ విధమైన స్థితిని ఎదుర్కొవల్సి రావొచ్చు. హెచ్చరికలను గమనిస్తూ వచ్చి, సకాల చికిత్స అందినప్పటికీ, ప్రాణాంతకం కావొచ్చు. సుదీర్ఘ సమయం ఆసుపత్రిలో ఉండవల్సిరావొచ్చు.
తీవ్రస్థాయి డెంగీ, సుమారుగా డెంగీ జ్వరం తగ్గిన తరువాత మూడు నుండి ఆరేడు రోజులకు హెచ్చరిక సంకేతాలతో మొదలౌతుంది. కొందరిలో తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, కళ్ళ వెనుక భాగం (రిట్రో ఆర్బిటాల్‌) లో తలనొప్పి, వాంతులు, కడుపులో వికారం, కండరాల నొప్పులు దద్దుర్లు, ముక్కు, పళ్ళ చిగుళ్ల నుండి రక్తం రావడం, విపరీతమైన కడుపు నొప్పి, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు, అలసట, అసహనంగా, ఆదుర్దాగా ఉండటం వంటి సూచికలు రావొచ్చు.
ఎవరిలో ఇలా జరుగవచ్చు?
డెంగీ వ్యాధిగ్రస్తులైన చిన్న పిల్లలు, వద్ధులు, డయాబెటిస్‌, అధిక రక్తపోటు, దీర్ఘ కాల మూత్ర పిండాల జబ్బుతో బాధపడుతున్నవారు, ఊబకాయస్తులు, వ్యాధి నుండి కోలుకున్న కొన్నాళ్ల తరువాత తిరిగి రెండవ సారి వ్యాధి బారీన పడిన వారిలో ఇటువంటి విషమస్థితి ఉత్పన్న మవ్వ వచ్చు.
డెంగీ వ్యాధి రాకుండా ఉండాలంటే..?
దోమలను అరికట్టాలి, దోమకాటు బారీన పడకుండా జాగ్రత్త పడాలి.
ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్కూలు, ఆఫీసులు, ఉద్యోగ రీత్యా పని చేసే చోట్లని దోమల నుండి సురక్షితంగా పెట్టుకోవాలి.
మనం రోజూ ధరించే బట్టలు చేతులను కాళ్ళను కప్పి ఉండేటట్టుగా చూసుకోవాలి.
నిత్యం మనముండే చోట్లలో నీరు ఎక్కడా నిలిచి ఉండకుండా చూసుకోవాలి.
గిన్నెల్లో, తెరిచి ఉంచిన డబ్బాల్లో, చెట్లల్లో, టైర్లు, క్యాన్ల వంటి పాత సామాన్లలో, ప్లాస్టిక్‌ సంచుల్లో, కొబ్బరి చిప్పల్లో, నీరు నిల్చి ఉండకుండా చూసుకోవాలి.
నిలువ చేసిన నీటిపై ఎల్లప్పుడూ మూతలు ఉండేటట్టు చూడడం, చెత్తను ఎలాపడితే ఆలా పారేయకుండా, తడి-పొడి చెత్తను, వేరువేరుగా పద్ధతిలో జి.ఎచ్‌.ఎం.సి.కి అప్పచెప్పడం వంటి సాంఘిక బాధ్యతలను నిర్వర్తించడమూ, ఇతరులను ప్రోత్సహించడమూ వంటి చర్యలు చేపట్టడం వలన మన చుట్టూ దోమలు వద్ధి చెందకుండా నివారించవచ్చు.
ఈ విధంగా కొనసాగించలేని పరిసరాల్లో, పరిస్థితుల్లో మస్కిటో రిపల్లెన్ట్స్‌ వాడకం తప్పదు.
డెంగీ వ్యాధి చికిత్స?
డెంగీ వ్యాధి సూచికల్ని బట్టి చికిత్స చేయడం జరుగుతుంటుంది. అప్పుడప్పుడు ఏ మందులూ వాడకుండానే జ్వరం తగ్గిపోతుంది.
లాబరేటరీ పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు దోహదపడతాయి.
డెంగీ వ్యాధి తీవ్ర గతిని గమనించడానికి ప్లేట్లెట్లు అనబడే రక్తకణాల సాంఖ్యను తరచుగా తనిఖీ చేయవలసి ఉంటుంది. మాములుగా లక్షన్నర నుండి నాలుగున్నర లక్షలవరకు ఉండే దీని సంఖ్యను డెంగీ గణనీయంగా పడిపోయేలా చేస్తుంది. ఇరవై వేలకంటే తక్కువగా పడిపోతే ఆకస్మిక రక్తస్రావం మొదలౌతుంది.
ఎప్పటికప్పుడు ప్లేట్లెట్ల కౌంట్లు చేయిస్తూ, అవి పదివేలకు పడిపోతే, వెంటనే రక్తం ఎక్కించి, రోగిని కాపాడుకోవాల్సి వస్తుంది.
డెంగీ జ్వరం నుండి కోలుకున్న తరువాత కనీసం వారం రోజుల వరకైనా తీవ్ర స్థాయి డెంగీ హెచ్చరికల పట్ల అప్రమత్తమై ఉండాలి. సూచికలు మొదలైన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించి సకాల వైద్యం చేయించాలి.

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -