నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని 39, 40వ వార్డుల్లో పలు సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రతి వీధిలోనూ నాణ్యమైన రోడ్లు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా 39, 40 వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని వెల్లడించారు.
గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల ముంగిటకే అభివృద్ధిని తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొంటూ కామారెడ్డి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.



