నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు వేదికగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ (South Indian History Congress) ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ వార్షిక సమావేశంలో ప్రఖ్యాత చరిత్రకారుడు, తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి అధ్యక్ష ప్రసంగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు.
“Decoding the Built and Unbuilt Heritage of Tribal World: Tribal Archaeology and Ethno-Archaeology of South India” అనే అంశంపై ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోని గిరిజన సమాజాల నిర్మిత–అనిర్మిత వారసత్వం, పురావస్తు ఆధారాలు, ప్రజా సంప్రదాయాలు, ఆచారాలు- జీవన విధానాల చారిత్రక ప్రాధాన్యతను విశ్లేషించారు.
గిరిజన అధ్యయనాల్లో ఎథ్నో–ఆర్కియాలజీ ప్రాముఖ్యత, మౌఖిక చరిత్రలు, ఆచార సంప్రదాయాల ద్వారా చరిత్రను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. గిరిజన సంస్కృతి పరిరక్షణలో ప్రభుత్వ, అకాడమిక్ సంస్థల బాధ్యతను కూడా ఆయన తన ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి (రిటైర్డ్ డీన్ & ప్రిన్సిపాల్)గా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు మరియు వారసత్వ పరిరక్షణ రంగాలలో చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు పండితులు ప్రశంసించారు.

ఈ సమావేశాన్ని వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లోర్, తమిళనాడు లోని సామాజిక శాస్త్రాల విభాగం – స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో 2025 డిసెంబర్ 20 నుంచి 22 వరకు నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, పరిశోధకులు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి ప్రసంగం గిరిజన వారసత్వ అధ్యయనాలకు దిశానిర్దేశకంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శివాదాసన్, వైస్ ప్రసిడెంట్స్ ఎంసీ రాజా, విజయకుమారి, ఈసీ మెంబెర్స్, చరిత్ర అధ్యాపకులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.



