నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ గెలుపు కంటే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సొంత జట్టుపైనా, క్రికెట్ బోర్డుపైనా చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్‌తో తలపడటానికి కూడా పాక్ జట్టు అర్హత లేదన్నట్లు ఆయన మాట్లాడారు.
ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ పాకిస్థాన్ ఓటమిపై అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మేము మ్యాచ్‌లో ఎక్కడా పోటీలోనే లేము. ఒకప్పుడు భారత్‌తో మైదానంలో పోరాడేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లను ఓడించడం అన్నది కలలో కూడా ఊహించలేం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీపై విరుచుకుపడ్డాడు. “క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యాడు. అలాంటి అసమర్థులకు ‘జాహిల్’ (అజ్ఞాని)లకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుంది?” అని తీవ్రంగా విమర్శించాడు. బాబర్ ఆజమ్‌ను ఉద్దేశించి, “మ్యాచ్ గెలిపించలేని ఆటగాడిని సూపర్ స్టార్‌ను చేశారు” అని మండిపడ్డాడు.



