నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ అవుట్‌లెట్ ‘మింట్’ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే, కొత్త సీఈవో నియామకం జరిగేంత వరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారు.
గత వారం జరిగిన బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. కొత్త సీఈవో నియామకం పూర్తయ్యే వరకు, అవసరమైతే సెప్టెంబర్ వరకు కూడా ఆయన పదవిలో ఉండే అవకాశం ఉంది. టాటా గ్రూప్ యాజమాన్యంలోకి ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత 2022 సెప్టెంబర్‌లో విల్సన్ బాధ్యతలు స్వీకరించారు. తన కాంట్రాక్ట్ గడువుకు మించి కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈవో కోసం అన్వేషణ ఇప్పటికే చివరి దశలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.



