Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగాజాలో ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు

గాజాలో ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు

- Advertisement -

– 27మంది పాలస్తీనియన్ల మృతి
గాజా:
దక్షిణ గాజాలో ఆహార పంపిణీ కేంద్రానికి సమీపంలో మంగళవారం ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో 27మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాఫాలోని ఆహార పంపిణీ కేంద్రాలకు సమీపంలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. కాగా, ఆ సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందన్నది దర్యాప్తు చేస్తున్నామని మిలటరీ ప్రకటించింది. ఉత్తర గాజాలో జరుగుతున్న పోరులో తమ సైనికులు ముగ్గురు మరణించారని ఇజ్రాయిల్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం నాటి పంపిణీ సమయంలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామనడాన్ని మిలటరీ నిరాకరించింది. ఇవన్నీ హమాస్‌ కల్పిత వార్తలని కొట్టిపారేసింది. కాగా ఆహార పంపిణీ కోసం నిర్దేశించిన మార్గాల నుండి పక్కకు మళ్ళి అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్న పలువురు అనుమానితులను మంగళవారం నాడు ఐడిఎఫ్‌ బలగాలు గుర్తించాయని తెలిపింది. వెంటనే సైన్యం హెచ్చరికగా వారిపై గాల్లోకి కాల్పులు జరిపిందని, అయినా వారు కదలకపోవడం, పైగా సైన్యం వైపునకు దూసుకు వస్తున్నందునే తాముకాల్పులు జరిపామని మిలటరీ ప్రకటించింది. ఇదిలా వుండగా, దక్షిణగాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా మిలటరీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. మవాసి మానవతా జోన్‌ దిశగా వెళ్లాలని వారికి సూచించింది. అయితే గాజాలో ఎక్కడా కూడా సురక్షిత ప్రాంతాలు లేవని పాలస్తీనియన్లు, ఐక్యరాజ్య సమితి అధికారులు చెబుతున్నారు. తాజాగా తరలింపు ఆదేశాల వల్ల నాజర్‌ ఆస్పత్రిలో పనులు నిలిచిపోతాయని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణగాజాలో ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక ఆస్పత్రి ఆదే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad