Tuesday, April 29, 2025
Homeబీజినెస్ఉద్రిక్త వేళలోనూ కొనుగోళ్లు

ఉద్రిక్త వేళలోనూ కొనుగోళ్లు

  • – సెన్సెక్స్‌ 1000 పాయింట్ల ర్యాలీ
    ముంబయి : భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల సమయంలోనూ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1006 పాయింట్లు లేదా 1.27 శాతం పెరిగి 80,218.37కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 289 పాయింట్లు లేదా 1.40 శాతం లాభపడి 24,328 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30 సూచీల్లో 23 లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ సూచీ అత్యధికంగా 5.27 శాతం పెరిగింది. గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్లు భారత ఈక్విటీల్లో కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇది మార్కెట్‌లో విశ్వాసాన్ని బలోపేతం చేసింది. టారిఫ్‌ల విషయంలో అమెరికా-చైనాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న సంకేతాలు కూడా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లూ రాణించడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎటర్నల్‌ షేర్లు అధిక నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 66 డాలర్లుగా నమోదయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి. మార్కెట్లు రాణిస్తున్నప్పటికీ.. భౌగోళిక ఉద్రిక్తతలను కొనసాగుతున్న వేళ రిటైల్‌ మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img