Monday, May 5, 2025
Homeమానవిఆడ‌వాళ్లు ఆ ప‌ని చేయ‌డ‌మా..!!

ఆడ‌వాళ్లు ఆ ప‌ని చేయ‌డ‌మా..!!

- Advertisement -

లింగ సమానత్వం అంటే కేవలం కార్పొరేట్‌ రంగాల్లోనే కాదు శ్రామిక శక్తిలో చూపాలి అని నిరూపిస్తోంది ఈ జోర్డాన్‌ మహిళ. 2006లో మొట్టమొదటి లైసెన్స్‌ పొందిన మహిళా ప్లంబర్‌గా ఖవ్లా షేక్‌ చరిత్ర సృష్టించారు. అంతే కాదు ప్లంబర్‌ పనిలోకి ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. 2014లో ఏర్పడిన వైజ్‌ ఉమెన్‌ ప్లంబర్స్‌ కో ఆపరేటివ్‌ ఆధ్వర్యంలో ఈ రంగంలో లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది. జోర్డాన్‌ సంప్రదాయ కట్టుబాట్ల కంచెను తొలగించుకుంటూ అక్కడి మహిళ తన ఉనికి కోసం చేస్తున్న కృషి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా చేస్తోంది.
నేడు జోర్డాన్‌లో వందలాది మహిళలు ప్లంబర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో దీనిని అవమానకరంగా భావిస్తూ వీరి చేస్తున్న ఈ పనులపై నిషేధం విధించారు. అక్కడి సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఒక సవాల్‌గా ఉంది. ఇప్పుడు ఆ అనిశ్చితి తొలగి జోర్డాన్‌లో మహిళా ప్లంబర్లపై ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది.
ఆడవాళ్లు ఈ పని చేయడమా!
‘మహిళ బయటకు వెళ్లి పని చేయకూడదు, అది కుటుంబానికే అవమానం. అటువంటిది చోద్యం కాకపోతే పురుషుల చేయాల్సిన ఇలాంటి పనులు ఆడవాళ్లు చేయడమేంటీ’ తహానీ ఆల్‌ షాతి, యుస్రా మోహమ్మద్‌ న్మోర్‌.. వంటి వాళ్లు ప్లంబర్లుగా శిక్షణ ప్రారంభించినప్పుడు ఇలాంటి అనేక మాటలు పడ్డారు. తమ సాటి వారి నుంచి ఎన్నో అవమానాలు భరించారు. జోర్డాన్‌లో సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా జీతంతో కూడిన పనిలో మహిళల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. అక్కడ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఇప్పటికీ చాలా మంది మహిళలకు అతి పెద్ద సవాల్‌.
నోళ్లు మూతపడ్డాయి
ఆల్‌షాతి ప్లంబర్లుగా శిక్షణ తీసుకుంటున్న తన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకసారి శిక్షణ తీసుకుంటున్న ఇతర మహిళలు వీధిలో నీళ్లు లీక్‌ అవుతున్న పైపును చూశారు. నీరంతా వృధాగా పోవడం గమనించారు. లీకేజీని ఆపడానికి వెంటనే తమ వద్ద గల ఉపకరణాలను బయటకు తీశారు. దారినపోతున్న ఒక మహిళ వారిని చూసి ‘మీరేంటి ఈ పనులు చేయడమేంటీ?’ అని తిట్టడం మొదలుపెట్టింది. దాందో అక్కడ ఇంకొంత మంది పోగయ్యారు. వాళ్లు కూడా అవే మాటలు అన్నారు. అయితే వారి మాటలను ఈ బృందం పట్టించుకోలేరు. నీళ్ల లీకేజీని ఆపాలనుకున్న పనిని సమర్థంగా పూర్తి చేశారు. నీటి నష్టాన్ని నివారించారు. దాంతో అక్కడున్నవారి నోళ్లు మూతపడ్డాయి. తమలో తాము గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నీటి పొదుపు కోసం
జోర్డాన్‌లో నీటి కొరత అనేది అతి పెద్ద సమస్య. ఇందుకు భౌగోళిక, పర్యావరణ పరమైన కారణాలు మొదటివి అయితే నీటిని దొంగిలించడం మరో ముఖ్యమైన కారణం. అందుకే జోర్డాన్‌లో మహిళల కోసం అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నీటి పొదుపు కోసం రకరకాల ఉపకరణాలను బిగించడంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. నీటి వనరుల నిర్వహణలో మహిళలను పాల్గొనేలా చేయడం మంచి నిర్ణయమని నీటి, పారిశుద్ధ్య సలహాదారు అన్నారు. ఎందుకంటే నీటి ప్రాముఖ్యత గురించి వారికే ఎక్కువ తెలుసు. ఈ మేరకు వారు యువత, వృద్ధులలో అవగాహనను తీసుకురాగలరు. ఈ కోణంలో చూసినపుడు వారు తల్లులే కాదు టీచర్లు కూడా.
నిబంధనలను సవాల్‌ చేస్తూ
అల్‌ షాతి, న్మోర్‌తో సహా కొంతమంది మహిళా ప్లంబర్లు 2014లో వైజ్‌ ఉమెన్‌ ప్లంబర్స్‌ కో ఆపరేటివ్‌ కార్యక్రమంలో చేరారు. కలిసి పని చేయడం వల్ల భద్రత, ఆర్థిక స్థిరత్వం, అలాగే పెద్ద ప్రాజెక్టులను లీడ్‌ చేసే అవకాశాలు లభిస్తాయనేది వీరి ఆలోచన. ఇందులోని సభ్యులు తమ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ఉచిత సర్వీస్‌ అందిస్తున్నారు. మొదటి సారి 2004లో 15 మంది మహిళలతో కలిసి శిక్షణ తీసుకున్నప్పుడు ‘సంస్కృతికే అవమానం’ అని ఇతరులు ఎవ్వరూ దానిని ఆమోదించలేదు. కానీ ‘నేడు ఈ పనిరాని వారు కూడా సాధారణ మరమ్మతులు చేయడం నేర్చుకుంటే ఇండ్లలో తమ ప్లంబర్‌ పనిని తామే చేసుకోవచ్చు’ అని నచ్చజెబుతూ తోటి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా ప్లంబర్‌ పని చేసే ఈ మహిళలంతా చాలా కాలంగా తమ సమాజంలోని నిబంధనలను సవాల్‌ చేస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. లింగ సమానత్వాన్ని కాపాడుతున్నారు.
జీవితాలనే మార్చింది
ఇప్పుడు అక్కడ ఆల్‌ షాతి, న్మోర్‌ లాంటి వందలాది మంది మహిళా సర్టిఫైడ్‌ ప్లంబర్లు ఉన్నారు. రాజధాని నగరమైన అమ్మాన్‌లోని ఈ మహిళలంతా ‘ఈ అసాధారణ కెరీర్‌ మా జీవితాలనే మార్చింది. ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రాన్ని అందించింది. ఇతర మహిళలకు శిక్షణ ఇస్తూ తమ దేశాన్ని పర్యటించే అవకాశాలను కల్పించింది’ అంటూ ముక్తకఠంతో అంటున్నారు. ‘నా భర్త, పిల్లలు నన్ను చూసి గర్వపడుతున్నారు. నా పొరుగువారు నన్ను చూసి అసూయపడుతున్నారు’ అని న్మోర్‌ అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -