నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న సాదుల్లా హర్షిత (నాగాపూర్) జవహర్ నవోదయకు ఎంపికయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షలో ఉత్తమ ప్రతిభతో అడ్మిషన్ సాధించిన విద్యార్థిని సాదుల్లా హర్షితను కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి అభినందించారు.
జవహర్ నవోదయలో సీటు పొందిన విద్యార్థిని హర్షితను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినినీ పాఠశాల యాజమాన్యం తరఫున సన్మానించారు. విద్యార్థిని హర్షితను శాలువాతో సత్కరించి, మెమొంటోను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యార్థులకు చదువుతోపాటు విలువలు, ఏకాగ్రత, క్రమశిక్షణ ఉండాలన్నారు. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ప్రయత్నిస్తే విజయం దరిచేరుతుంది అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ విద్యార్థులకు సలహాలు సూచనలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గుండోజి దేవేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ కే.సౌమ్య, ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.