మానవ మేధస్సుకు
ప్రత్యామ్నాయం లేదు
నాస్కామ్ పూర్వ అధ్యక్షులు డా.కిరణ్ కార్నిక్
ఘనంగా గీతం 16వ స్నాతకోత్సవ వేడుకలు
2002 మందికి పట్టాల ప్రదానం
32 మందికి బంగారు పతకాలు, వంద మందికి పీహెచ్‌డీలు :
డా. బి.వెంకట్రామన్, అరుణాచలం మురుగనాథం, ఆర్.వెంకటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్లు
నవతెలంగాణ-పటాన్‌చెరు
కృత్రిమ మేధస్సు యుగంలో నిరంతర అభ్యాసం అవశ్యమని, తద్వారా యువతకు దానిపై పట్టు సాధించే వీలు కలుగుతుందని నాస్కామ్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ కిరణ్ కార్నిక్ తెలిపారు. హైదరాబాద్ ప్రాంగణంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవం వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, సాంకేతికతలను స్వీకరించాలని చెప్పారు. వేగంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మార్పులను అర్థం చేసుకుంటూ, అభివృద్ధి పథంలో సాగే మనస్తత్వాన్ని వృద్ధి చేసుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రపంచంలో మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదన్నారు.
ప్రభావవంతమైన నాయకత్వం, బృంద కృషికి భావోద్వేగ మేధస్సు, స్వీయ అవగాహన, సానుభూతి, ప్రేరణ, సంబంధాల నిర్వహణ యువతలో కీలకమని వివరించారు.గీతం అధ్యక్షులు, విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ.. స్నాతకోత్సవ పట్టాలను స్వీకరిస్తున్న వారంతా ఉన్నత లక్ష్యాలతో తమ కలలను నిజం చేసుకోవాలని చెప్పారు. అదే సమయంలో సమాజానికి తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. గీతం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా మాట్లాడుతూ.. సంక్లిష్టమైన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి తమ దృష్టి అనువాద పరిశోధన, అంతర్ విభాగ (ఇంటర్ డిసిప్లినరీ) అభ్యాసంపై ఉందని తెలిపారు.
2002 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు
హైదరాబాద్ ప్రాంగణంలోని ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ విభాగాల నుంచి దాదాపు 2002 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 1,638 మంది యూజీ, 264 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా 100 మంది పరిశోధక విద్యారు ్థలకు డాక్టరేట్లు ప్రదానం చేశారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ముగ్గురు విశిష్ట వ్యక్తులకు గీతం గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. అందులో కల్పక్కంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం (ఐజీసీఏఆర్) పూర్వ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకట్రామన్, ప్యాడ్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అరుణాచలం మురుగనాథం, గ్రామీణ విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తూ ఆర్‌వీఆర్‌గా పేరొందిన ఆర్.వెంకటేశ్వరరావుకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డిలిట్) అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ, అదనపు ఉప కులపతులు ప్రొఫెసర్ వై.గౌతంరావు, ప్రొఫెసర్ డిఎస్.రావు, రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్, పాలకమండలి సభ్యులు, కేఎస్ పీపీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు.