నవతెలంగాణ -కోల్ బెల్ట్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ, ప్రయివేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని డిమాండ్ చేస్తూ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్( ఐఎన్టియుసి) ఆధ్వర్యంలో సోమవారం జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఐఎన్టీయూసీ, సెక్రెటరీ జనరల్ శ్రీ బి.జనక్ ప్రసాద్ గారి ఆదేశానుసారం, భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి.మధుకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూపాలపల్లి జనరల్ మేనేజర్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించబడినది. ధర్నా కార్యక్రమం ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఎస్ ఓ టు జిఎం కవీంద్ర కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భూపాలపల్లి లో ఉన్నటువంటి సింగరేణి కమిటీ హాల్ ను పోలీస్ హెడ్ క్వార్టర్ గా 12 సంవత్సరాలు ఇవ్వడం జరిగినది. సి ఈ ఆర్ క్లబ్బును ఎన్నికల కొరకు వాడుకోవడం జరిగినది. ఎం వి టి సి ని ఎస్పీ ఆఫీసుగా వాడుకోవడం జరిగినది. ప్రస్తుతం రామప్ప కాలనీలో ఉన్నటువంటి మూడు బ్లాకులను మెడికల్ కాలేజీ హాస్టల్ కొరకు వాడుకోవడం జరుగుచున్నది. సింగరేణి ఆస్తుల కొరకు కార్మిక సంఘంగా మేమే ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి కార్మికుల సౌకర్యార్థం నిర్మితమైన భవనాలను, ఫంక్షన్ హాల్ లను ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యక్తులు ఇష్టానుసారం యధేఛ్ఛగా అనుభవించడం , సింగరేణి సంస్థ రాజకీయ నాయకుల జేబు సంస్థగా మారి మిన్నకుండడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీశారు. సింగరేణి ఉద్యోగులు వసతులు కోసం ఇబ్బంది పడుతుంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనయట్లు ఇతరులు వాటిని అనుభవించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సింగరేణి సంస్థ కు సంబంధించిన ఆస్తులైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకూడదని, ఇతరుల కబ్జాలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు పతి రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, ఏరియా స్ట్రక్చర్ కమిటీ మెంబర్లు షేక్ హుస్సేన్, చిప్పకుర్తి రమేష్, బ్రాంచ్ సెక్రటరీ కుడుదుల శంకర్, ఏరియా మైనింగ్ ఇంచార్జ్ చక్రపాణి, సెంట్రల్ కమిటీ నాయకులు సంపత్, ఠాకూర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు కుడుదుల రాయమల్లు, శ్రీనివాస్, శంకర్ రెడ్డి, సీనియర్ ఐ ఎన్ టి యు సి నాయకులు నర్సింగరావు, మరియు పిట్ సెక్రటరీలు సోత్కు సమ్మయ్య, చిరుత లక్ష్మీనారాయణ, గట్టు రాజు, సంఘం శ్రీనివాస్, సంపత్ కుమార్, పొనగంటి కృష్ణ, చిన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



