నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవి ప్రారంభంలోనే మండుతున్న ఎండల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి.
పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. మండల వ్యాప్తంగా 28 ప్రాథమిక, జిల్లా పరిషత్, ఒక మోడల్, ఒక కస్తూరిబ్బా పాఠశాలలు ఉండగా, వాటిలో 1170 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యా ర్థులను ఇంటికి పంపాలని సూచించారు.



