Magazines

అసాధారణ నటుడు నానాపటేకర్‌ కన్నుమూత

1 గంట క్రితం

passes away
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 3 నిమిషాల చదవడం

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పలు భాషల్లో 100కి పైగా సినిమాలు రైతులకు అండగా నిలిచిన సామాజిక సేవకుడు


సాధారణ పాత్రల నుంచి ప్రతి నాయకుడి వరకు, భావోద్వేగ భరితమైన పాత్రల నుంచి పవర్‌ ఫుల్ క్యారెక్టర్ల వరకు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన అసాధారణ నటుడు నానా పటేకర్‌ (75) ఇకలేరు. గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే సమీ పంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నానా పటేకర్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా మరణించినట్లు వైద్యులు ధ్రువీ కరించారు. నానా పటేకర్ అసలు పేరు విశ్వ నాథ్ పటేకర్. 1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత హిందీ, మరాఠీ, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘పరిందా’, ‘ప్రహార్’, ‘అంగార్’, ‘తిరంగా’, ‘క్రాంతివీర్’, ‘ఖామో షి’, ‘కాలా’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైనవిగా నిలి చాయి. ‘క్రాంతివీర్’లో ఆయన పోషించిన పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది.

‘పరిందా’, ‘అగ్ని సాక్షి’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డులు కూడా దక్కాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నానా పటేకర్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా లీనమైపోయే నటుడిగా ప్రత్యేకమైన పేరు ఉంది. ఆయన నటించిన పాత్రలు, డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన నటనా శైలి భారతీయ సినిమాపై ఆయన వేసిన ముద్రను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి. నానాపటేకర్‌ 1978లో మరాఠీ సినీ నటి, నిర్మాత నీలకంఠిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. తన నామ్‌ ఫౌండేషన్‌ ద్వారా రైతులకు, పేదలకు అండగా నిలిచిన అరుదైన నటుడు కూడా. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండి పోయే పాత్రలు పోషించిన నానా పటేకర్ ఇక లేరన్న వార్త అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


అరుదైన నటుడు

నానా పటేకర్ లాంటి నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి పాత్రలోనూ ఆయన వైవిధ్యం ప్రదర్శించేవారు. తరాల పాటు గుర్తుండిపోయే పాత్రలను మనకు అందించారు. తన భావాలను నిస్సంకోచంగా, స్పష్టంగా చెబుతూ ఎంతో మంది అభిమానాన్ని పొందారు. హిందీ, మరాఠీ సినిమాలకు ఎంతో సేవ చేశారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు. - ప్రధాని మోదీ


నా మిత్రుడు నానాజీ ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. - రజనీకాంత్‌


నానా పటేకర్‌ అసాధారణ నటుడు. ఎంత కష్టమైన పాత్రలో నైనా సహజంగా నటించగలరు. ‘క్రాంతివీర్‌’ చిత్రంలో అద్భుత మైన నటనతో ఆకట్టుకున్నారు. భారత సైన్యంతో ఆయనకున్న అనుబంధం, దేశానికి చేసిన సేవ.. ఆయనలోని ప్రగాఢ దేశభక్తికి నిదర్శనం. - పవన్‌ కల్యాణ్‌


నానా పటేకర్‌ ప్రతి పాత్రను నిజాయతీగా పోషించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాల పాటు గుర్తుండిపోతాయి. - ఎన్టీఆర్‌


నటనలో కొత్త ఒరవడి సృష్టిం చిన కళాకారుడు. మట్టి వాసన తెలిసిన అరుదైన సహజ నటుడు. భార తీయ సినిమాలో ఆయన ఒక ఆణిముత్యం. - అల్లు అర్జున్‌


మిమ్మల్ని ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను నానాజీ. మీతో గడిపిన క్షణాలు, సంభాషణలు, మీరు వండిన వంట, పంచుకున్న జ్ఞానం ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి. - ప్రకాశ్‌ రాజ్‌



రైతులకు అండగా నిలిచిన సామాజిక సేవకుడు
ప్రముఖ సినీ నటుడు, సామాజిక సేవకుడు నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై స్పందించిన అరుదైన నటుడు నానా పటేకర్. ఆయన ఆశించిన రైతు, గ్రామీణ శ్రామికుల ఆకాంక్షల అమలుకు పోరాడడమే ఆయనకు నిజమైన నివాళి. తన నామ్‌ ఫౌండేషన్‌ ద్వారా కరువు ప్రభావిత గ్రామాల్లో నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, రైతు కుటుంబాలకు సహాయం వంటి కార్యక్రమాలను చేపట్టిన ప్రజా సేవకుడు నానా పటేకర్‌. నానా పటేకర్ రైతుల సమస్యలపై లేవనెత్తిన ప్రశ్నలను, ఆయన వ్యక్తం చేసిన ఆవేదనను ముందుకు తీసుకెళ్లడం ద్వారా మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అర్పించగలం. - ఏఐఏడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్