Magazines

తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు

1 గంట క్రితం

generations change.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 3 నిమిషాల చదవడం

సింగీతం శ్రీనివాసరావు..


ఈ పేరు వినగానే భిన్న ప్రయో గాత్మక సినిమాలు గుర్తొస్తాయి. భారతీయ సినీ పరిశ్రమలో ఏ దర్శకుడు చేయనన్ని ప్రయో గాలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి . దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయా ణంలో వెండి తెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కాలానికి అతీతంగా ఉంటూ తరాలు మారినా కొత్తగా అనిపించేలా ఆయన సినిమాలు ఉండటం విశేషం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా ‘సింగ్‌ గీతం’ అనే సినిమాని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబరు 21న సింగీతం జన్మించారు. తండ్రి రామచంద్ర రావు హెడ్‌మాస్టర్‌ కాగా తల్లి శకుంతలాబాయి వయొలీన్‌ విద్వాంసురాలు. తల్లి సంగీత నేపథ్యం ఆయనలో కూడా సంగీత అభిరుచిని పెంచింది. కాలేజీ చదువుతున్న రోజుల్లో హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ ఆధ్వర్యంలో నాటకరంగ ప్రవేశం చేశారు. సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తరుణంలో స్వయంగా రచించిన నాటకాలను తన విద్యార్థులతో ప్రదర్శింపచేశారు. దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద ‘మాయాబజార్‌’ (1957) లాంటి గొప్ప చిత్రానికి సహాయ దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు వద్ద శిష్యరికం చేశారు. కృష్ణంరాజు, కాంచన నటించిన ‘నీతి నిజాయితీ’ (1972)తో దర్శకుడిగా సింగీతం ప్రయాణం ఆరంభమైంది. ‘పంతులమ్మ’, ‘జమిందారుగారి అమ్మాయి’, ‘రామ చిలుక’, ‘పిల్ల జమిందారు’, ‘గమ్మత్తు గూఢచారులు’, ‘సుగుణసుందరి’, ‘బృందావనం’..

ఇలా ఒక సినిమాతో మరో సినిమాకు సంబంధం లేకుండా తీసి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. కమల్‌హాసన్‌ అంధుడిగా నటించిన ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంతో సింగీతం ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా మారారు. కమల్‌ నాలుగు పాత్రలు పోషించిన ‘మైకేల్‌ మదన కామరాజు’ మరో ప్రయోగం. ఇందులో పాట పాడుతూ కథను ముందుకు తీసుకుపోయే పాత్రలో సింగీతం కనిపిస్తారు. వీరిద్దరి కాంబినేషనులోనే వచ్చిన మాటల్లేని మూకీచిత్రం ‘పుష్పకవిమానం’ టాకీ చిత్రాల నడుమ ఘనవిజయం సాధించి మరో చరిత్రగా నిలిచింది. కమల్‌ను మరుగుజ్జు పాత్రలో చూపుతూ ఆయన తీసిన ‘విచిత్ర సోదరులు’ చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ప్రమాదంలో కాలు కోల్పోయి న నర్తకి జీవిత కథగా వచ్చిన ‘మయూ రి’ చిత్రంలో నిజ జీవితంలోని సుధా చంద్రన్‌ తోనే ఆ పాత్రను అద్భుతంగా పోషిం పజేసి మెప్పించారు. ఉద్యోగం చేసే మహిళల ఇబ్బందులను కళ్లకు కడుతూ వినోదాత్మకంగా తీసిన ‘ఆడ వాళ్లకు మాత్రమే’ అందరినీ ఆలోచింపజేస్తుంది. మాస్‌ హీరో బాలకృష్ణతో ‘బైరవ ద్వీపం’ వంటి జానపద చిత్రం తీసి బ్లాక్‌బస్టర్‌ చేశా రు. ఇదే హీరోతో టైం మెషీన్‌ కథాంశంగా తీసిన ‘ఆదిత్య 369’ గొప్ప ప్రయోగాత్మక చిత్రంగా సర్వత్రా ప్రశంసలు పొందింది.

కథానాయకుడు రాజేంద్రప్రసాద్‌ను స్త్రీ పాత్రలో చూపుతూ ‘మేడమ్‌’గా తీర్చిదిద్దారు. మాటలు లేని సినిమాతో ప్రేక్షకులను నవ్వించడం, ఏడిపించడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు సమాధానంగా కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘పుష్పక విమానం’ భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలు రాయి. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా కేవలం హావ భావాలు పలికిస్తూ, నేపథ్య సంగీతంతోనే అద్భుతమైన బ్లాక్‌ కామెడీని అందించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఆధునికతను ఆకళింపు చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ‘యానిమేషన్‌’ సినిమా ‘ఘటోత్కచ్‌’, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. ఇదొక ప్రయోగం. సింగీతం శ్రీనివాసరావుకు లక్ష్మీ కల్యాణితో 1960లో వివాహం జరిగింది. కథా చర్చల్లో పాలుపంచుకుంటూ తన సినిమా స్క్రిప్టులు రాయడంలో సహాయపడే ఆమెతో ఉన్న అమితమైన అనుబంధానికి గుర్తుగా.. ‘శ్రీకల్యా ణీయం’ అనే ఆత్మకథను ఇద్దరూ రచించారు. రెండు జాతీయ పురస్కారాలతో పాటు ఐదు నంది, పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు సింగీతం. సింగీతం చివరి సినిమా ‘సింగ్‌ గీతం’ దర్శకుడునాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలోనే రూపొందింది. నెలరోజుల క్రితం కూడా ఆయన కొత్త స్క్రిప్ట్‌ రాసుకున్నారు. దానికి ‘ఏ ఫ్రూట్‌ కట్స్‌ ది నైఫ్‌’ అని పేరు పెట్టారు.


తుది శ్వాస వరకూ ప్రయోగాల బాటలోనే..

భారతీయ సినీ రంగానికి సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయం.
- తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
సింగీతం కోరుకున్నట్లే తనలోని యవ్వనంతో పాటే తుదిశ్వాస విడిచారు. ఆయన్ని కలిసినప్పటి నుంచి ఎంతో ఆరాధిస్తున్నా.
- కమల్‌ హాసన్
‘సింగీతం గొప్ప దార్శనికుడు. కొత్త ఆలోచనలను అన్వేషించడంలో ఆయనకున్న ధైర్యం, అద్భుతమైన ఊహాశక్తి.. భారతీయ సినిమాకు ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను అందించాయి. ఆయన సినిమాలు రాబోయే తరాలతోనూ ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి.
- చిరంజీవి
‘భారతీయ సినిమాకే కొత్త ముద్ర వేసిన ‘ఆదిత్య 369’, తెలుగులో తొలి కంప్యూటర్ గ్రాఫిక్స్ చిత్రంగా చరిత్ర సృష్టించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’, పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణార్జున విజయం’.. ఈ మూడూ ఎంతో ప్రత్యేకం. తుదిశ్వాస విడిచే వరకూ ఆయన వివిధ భారతీయ భాషల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. - బాలకృష్ణ
సింగీతం విభిన్న కథలు రూపొందించారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమాపై ఉన్న ఆసక్తికి నిదర్శనం. - పవన్‌ కల్యాణ్‌
భారతీయ సినిమా దిగ్గజం ఇక లేరు. భారతీయ సినిమా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
- మహేష్‌బాబు
కాలానికంటే ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు సింగీతం.
- ఎన్టీఆర్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్