నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల నేపథ్యంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ(SIR)కు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలసిందే. ఎస్ఐఆర్ ప్రక్రియను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎస్ఐఆర్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ..బీహార్‌లోని చంపారన్ వేదికగా ఓటర్ అధికార్ యాత్రను చేపట్టారు. అదే విధంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో SIR ను తీవ్రంగా ఖండించాయి. అందుకు అనుగుణంగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్ఐఆర్‌ను తమ రాష్ట్రంలో నిర్వహించకుండా స్టాలిన్ సర్కార్ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. తాజాగా తమిళనాడు బాటలో కేరళ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియపై కీలక తీర్మానాన్ని ఆమోదించింది. బీహార్ తరహా ఓటర్ జాబితా సవరణను తమ రాష్ట్రంలో నిర్వహించకూడదని అసెంబ్లీలో ఏకగ్రీవంగా పీనరయి విజయన్ ప్రభుత్వం ఆమోదించింది. అందుకు ప్రతిపక్షం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది.
‘SIR ప్రక్రియ జాతీయ జనాభా రిజిస్టర్‌ను అమలు చేయడానికి ఒక బ్యాక్‌డోర్ ప్రయత్నంగా మారే అవకాశం ఉందని,
బీహార్ తరహా ఓటర్ల జాబితా సవరణ.. ఏకపక్ష తొలగింపులు జరిగాయని, అదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించాలనడం “మినహాయింపు రాజకీయాలను” ప్రతిబింబిస్తాయని హెచ్చరించింది. SIRపై దీర్ఘకాలిక తయారీ, విస్తృత సంప్రదింపులు అవసరమని, త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో యుద్ధప్రాతిపదికన SIRను అమలు చేయలనడం ఎన్నికల సంఘం తొందరపాటు చర్య’ అని తీర్మానం పేర్కొంది.