నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్మును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 9 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. మూడేళ్ల పాటు శిరీష్ చంద్ర ముర్ము ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉణ్న రాజేశ్వర్ రావు పదవీ కాలం అక్టోబర్ 8తో ముగుస్తుంది. ఆయన తన పదవీ కాలంలో బ్యాంకింగ్ నియంత్రణతో పాటు ఇతర అనేక పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షించారు. రాజేశ్వర్ రావు పదవీ విరమణతో శిరీష్ చంద్ర ముర్ము సెంట్రల్ బ్యాంకులోని ఉన్నత స్థానాల్లో ఒకటైన డిప్యూటీ గవర్నర్ పదవిని చేపట్టబోతున్నారు.



