Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రాన్స్‌జెండర్లకు నైపుణ్య శిక్షణ

ట్రాన్స్‌జెండర్లకు నైపుణ్య శిక్షణ

- Advertisement -

– స్వయం ఉపాధికి మార్గం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ట్రాన్స్‌జెండర్ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రాఫిక్‌ సిగళ్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించినట్టు మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం స్వయం ఉపాధికి దోహదపడేలా మూడు ముఖ్య రంగాల్లో శిక్షణ అందించనున్నట్టు తెలిపారు.
కార్‌ డ్రైవింగ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, డ్రోన్‌ పైలట్‌ శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని చెప్పారు. మారుతీ డ్రైవింగ్‌ స్కూల్‌ సహకారం తో డ్రైవింగ్‌ శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. డ్రోన్‌ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందనీ, ఫోటోలు, వీడియోలు చిత్రీకరణతో పాటు వ్యవసాయంలో పిచికారీ, వివాహాలు, ఇతర ఈవెంట్‌లలో విస్తృతంగా వినియోగం పెరిగిందని మంత్రి వివరించారు. ఈ శిక్షణతో ట్రాన్స్‌జెండర్ల భవిష్యత్‌ టెక్నాలజీ రంగంలో ముందుకు సాగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంతో మొత్తం 91 మంది ట్రాన్స్‌జెండర్లు లబ్ధి పొందనుండగా, రూ.17.72 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో సమాన హక్కులతో ముందుకు సాగాలని, వారిని ఓటర్లుగా కాకుండా భాగస్వాములుగా గుర్తిస్తున్నామని తెలిపారు. ”మీ ప్రతిభే మీ భవిష్యత్తు. శిక్షణను అవకాశంగా మలచుకుని స్వయం ఉపాధితో ఆత్మగౌరవ జీవితం సాధించండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది” అని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -