Tuesday, May 13, 2025
Homeజాతీయంబట్టీల్లో బానిస బతుకులు

బట్టీల్లో బానిస బతుకులు

- Advertisement -

– కుటుంబాలతో సహా రాత్రింబవళ్లు వెట్టి చాకిరీ
– చాలీచాలని వేతనాలు..కనిపించని భద్రత
– భౌతికదాడులు, లైంగిక వేధింపులు నిత్యకృత్యం
– వలసకార్మిక చట్టానికి తూట్లు

రాష్ట్రంలోని ఇటుక బట్టీలు దోపిడికీ, వెట్టి చాకిరీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. అందులో పని చేసే కార్మికుల జీవితాలు యజమానులు, గుత్తేదార్ల (సర్దార్లు) చేతుల్లో మగ్గిపోతున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, బీహార్‌, జార్కండ్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలను ఆరు నెలల ఒప్పందంపై కుటుంబాలతో సహ గంపగుత్తన తీసుకొస్తున్నారు. వారికి నామమాత్రపు వేతనాలు చెల్లించి 12 నుంచి 14 గంటలు పని చేయిస్తున్నారు. పిచ్చుక గూళ్లను తలపించే ఆవాసాలు తప్ప… మరుగు దొడ్లు, స్నానపు గదులు మచ్చుకైనా కనిపించవు. సౌకర్యాలు, వేతనాలు యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాయి. భౌతికదాడులు, లైంగిక వేధింపులు నిత్యకృత్యాలు….రాష్ట్రంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికుల క్షేత్రస్థాయి స్థితిగతులపై నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం మొదటి భాగం.
ఊరగొండ మల్లేశ్‌
తెలంగాణ గనులు, భూగర్భ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 3వేల వరకు అనుమతి పొందిన ఇటుక బట్టీలున్నాయి. మరో వెయ్యి వరకు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా మినహా ఉమ్మడి రంగారెడ్డి నుంచి మారుమూల ఆదిలాబాద్‌ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటుక బట్టీలున్నాయి. కార్మిక శాఖ అంచనాల ప్రకారం ఏటా 2లక్షల మందికిపైగా మైగ్రెంట్‌ లేబర్‌ ఇక్కడి బట్టీల్లో పని చేసేందుకు కుటుంబాలతో సహా వలసొస్తుంటారు. ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, బీహార్‌, జార్కండ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు బట్టీల యాజమానులు అడ్వాన్స్‌ చెల్లించి తీసుకొస్తారు. ఇటుక బట్టీల్లో పని చేసేందుకు వస్తున్న కార్మికుల్లో సగానికిపైగా ఒడిశాలోని బార్దా, బాలంగిర్‌, సంబల్‌పూర్‌, నౌపాడ, కలహండి, గంజాం తదితర మారుమూల జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. డిసెంబర్‌ మాసం నుంచి జూన్‌ వరకు ఆరు నుంచి ఏడు నెలల పాటు పని చేస్తారు. జత (ఇద్దరు) కార్మికులకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన చెల్లించడం ఒక విధానమైతే, వెయ్యి ఇటుకలకు డిమాండ్‌ను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకు చెల్లించడం మరో విధానం. అయితే వీరిని ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే సమయంలో ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో వారితో ఒప్పందం చేసుకుంటారు. ఇందుకోసం సర్దార్‌ అనే దళారి వ్యవస్థ ఉంది. వారు ఆయా ప్రాంతాల్లో సబ్‌ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని లేబర్‌ను రాష్ట్రానికి తరలిస్తారు. కార్మికులకు చెల్లించే మొత్తంలో సర్దార్లు 10 నుంచి 20 శాతం కమీషన్‌ తీసుకుంటారు. అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం 1979 ప్రకారం కార్మికుడికి రవాణా, వసతి, అలవెన్స్‌ అందించాలి. వలస కార్మికులకు కనిష్టంగా రూ.50, గరిష్టంగా రూ.75 అలవెన్స్‌ చెల్లించాలి. వైద్య సదుపాయాలు, రక్షణ దుస్తులను అందించాలి. కార్మికుని ఉపాధికి సంబంధించిన పూర్తి వివరాలతో బ్యాంక్‌ పాస్‌బుక్‌ తీయించాలి. వారికి చెల్లించే మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాలో మాత్రమే జమ చేయాలి. చట్టంలోని నిబంధనలను అమలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కాని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇటుకబట్టీల్లో కూడా ఇవి అమలు కావడం లేదు. ఎక్కడో అరకొర తప్పితే చాలా వరకు బట్టీల యజమానులు కార్మికులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం సైతం అందిం చకపోగా వారికిచ్చిన అడ్వాన్స్‌ల్లోనే కోతపెడుతున్నారు. బట్టీలు దాటి బయటకు వెళ్లే దారి లేకపోవడంతో తమపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో వలస కార్మికులు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారు.
పిచ్చుక గూళ్లు….
బట్టీల్లో పని చేసే కార్మికులకు కనీస వసతుల కల్పనలో యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పిచ్చుక గూళ్లను తలపించే పూరి గుడిసెలే కార్మికుల ఆవాసాలు. నాలుగు ఇటుకలు పేర్చి వాటిపైన తాటిపత్రి లేదా, ప్లాస్టిక్‌ కవర్‌ కప్పుతారు. ఊరికి చివర, అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా బట్టీలుండటంతో దోమలు, పాములతో సహ జీవనం చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం వలస కార్మికులకు పని చేసే చోట ఏర్పాటు చేసిన ఆవాసాల్లో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా స్నానాల గదులు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా ఎక్కడా అవి కనిపించవు. చిన్న పాటి వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఆడ, మగ తేడా లేకుండా సామూహిక బహిరంగ స్నానాలు చేస్తున్నారు. యాజమాన్యాలు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పాము కాట్లు, కరెంట్‌ షాక్‌లకు గురవుతున్నారు.
వలస కార్మికుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : కోటం రాజు, తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వలస కార్మికుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కార్మికులు పని చేస్తున్న ప్రాంతంలోనే మరుగు దొడ్లు, మంచినీరు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలి. కార్మిక శాఖ అధికారులు బట్టీలను సందర్శించి వారికి లేబర్‌కార్డుతో పాటు, వెల్ఫేర్‌ బోర్డులో సభ్యతం ఇవ్వాలి. బట్లీల్లో పని చేస్తున్న మహిళా కార్మికులపై భౌతిక, లైంగిక దాడులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
12 నుంచి 14 గంటల పని
బట్టీల్లో పని చేసే కార్మికులు రోజూ 12 నుంచి 15 గంటలు గొడ్డు చాకిరీ చేయాల్సిందే. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇటుకలు తయారు చేస్తారు. ఇద్దరు వ్యక్తులు(జత ఒకింటికి) వారానికి 10 వేల ఇటుకను తయారు చేసి ఆరబెట్టాలి. అప్పుడే ఆరు నెలల కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఒప్పుకున్న మొత్తాన్ని అందజేస్తారు. అందులో ఏ మాత్రం తక్కువైనా వారి చెల్లింపుల్లో కోత పెడుతారు. దాంతో కార్మికులు తమ పిల్లల్ని పనిలో దింపుతున్నారు. 14 ఏండ్ల పిల్లలను పనిలో పెట్టకూడదనే నిబంధన ఉన్నా ఇక్కడ అలాంటి చట్టాలేవీ పని చేయవు. తెలంగాణ కార్మిక శాఖ గతంలో ఇటుకబట్టీల వద్ద బాలకార్మిక పాఠశాలల ఏర్పాటుకు యత్నించినప్పటికీ అంతగా సక్సెస్‌ కాలేదు. దాంతో కార్మికుల పిల్లలు సైతం తల్లిదండ్రులతో పాటు ఇటుక తయారీలో పనిచేస్తున్నారు. ఒప్పందం ప్రకారం చెల్లించే మొత్తంలో వివాదాలు తలెత్తితే కార్మికులపై యజమానులు భౌతిక దాడులు పాల్పడుతున్నారు. అక్కడ పని చేసే సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందితో పాటు ఒక్కోసారీ యజమానులు కూడా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా రెండువందలకుపైగా భౌతికదాడులు, లైంగిక వేధింపులు, చైల్డ్‌ లేబర్‌యాక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. బాండెడ్‌ లేబర్‌ నిర్మూలన చట్టం 1976 ప్రకారం కలెక్టర్ల నేతృత్వంలోని విజిలెన్స్‌ కమిటీలు సరైన రీతిలో స్పందించలేదనీ, ఫలితంగా బట్టీల యజమానులు ఇష్టారాజ్యంగా కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -