Sunday, May 25, 2025
Homeరాష్ట్రీయంజూన్‌ 2 నుంచిఅన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోస్లాట్‌ బుకింగ్‌

జూన్‌ 2 నుంచిఅన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోస్లాట్‌ బుకింగ్‌

- Advertisement -

ఇప్పటికే 47 చోట్ల విజయవంతంగా అమలు
నిషేధిత భూముల వివరాలకు ప్రత్యేక పోర్టల్‌
త్వరలో గ్రామ పరిపాలనాధికారుల సేవలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రిజిస్ట్రేషన్‌ శాఖలో చేపట్టిన స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని జూన్‌ 2నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో స్లాట్‌ బుకింగ్‌ విధానంపై రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆస్తుల క్రయ, విక్రయదారులకు పారదర్శకంగా సేవలందించేందుకు ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్‌ 10న 22 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, మే12 నుంచి 25 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. రెండు విడతల్లో 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందనీ, 94 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రెండు విడతల్లో కలిపి దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్‌ బుకింగ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆస్తుల క్రయ విక్రయ దారులు స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, సమర్థమైన సేవలందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన సంస్కరణల అమలు బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం దృష్ట్యా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరిస్తున్నామనీ, పని భారం అధికంగా ఉన్న తొమ్మిది చోట్ల అదనపు సబ్‌ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియమించామని తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారుల నియామక పరీక్ష ఆదివారం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి దాదాపు ఐదు వేల మందికిపైగా హాజరవుతారనీ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా వీరి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
ప్రత్యేక పోర్టల్‌
నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భూ భారతి తరహాలో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశామనీ, అందులో నిషేధిత ఆస్తుల వివరాలను పొందుపరుస్తామని అన్నారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తే క్షణాల్లో హైదరాబాద్‌లోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రధాన కార్యాలయంలో తెలిసిపోయేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిబంధనలను కాదని నిషేధిత భూములను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -