Friday, May 16, 2025
Homeజాతీయంజవాబు లేని ప్రశ్నలెన్నో…?!

జవాబు లేని ప్రశ్నలెన్నో…?!

- Advertisement -

– భద్రతా లోపం వల్లనే పహల్గాం దాడి
– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే ఆపరేషన్‌ ప్రారంభం
– కాల్పుల విరమణపై మూడో దేశం ప్రకటన
– ఇప్పటికీ చిక్కని ముష్కరులు
– నష్టంపై సమాచారమివ్వని ప్రభుత్వం
న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12న టీవీల ముందుకు వచ్చి పాకిస్తాన్‌ కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడిందని దేశ ప్రజలకు తెలియజేశారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారత్‌ నాశనం చేసిందని కూడా చెప్పారు. అయితే దాదాపుగా అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే వాణిజ్యాన్ని నిలిపివేస్తానని భారత్‌, పాకిస్తాన్‌ దేశాలను హెచ్చరించానని, దీంతో ఆ రెండు దేశాలు అందుకు అంగీకరించాయని చెప్పుకొచ్చారు. ‘మీరు రండి…మీతో ఎంతో వ్యాపారం చేయబోతున్నాం అని చెప్పాను. యుద్ధం ఆపితేనే వాణిజ్యం అని అన్నాను. లేకపోతే లేదని చెప్పేశాను. దాంతో అకస్మాత్తుగా మేము యుద్ధాన్ని ఆపేస్తామని వారు తెలిపారు. ఆపేశారు’ అని వివరించారు.
ఇందులో వాస్తవం ఉన్నదా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. తుపాకీ మోతలు ఆగిపోయాయి. దీంతో జరిగిన పరిణామాలను పరిశీలించి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఉంది.
ఆపరేషన్‌ సిందూర్‌ను ఎందుకు ప్రారంభించారు?
పహల్గాంలో అమాయకులైన 26 మందిని వారి కుటుంబ సభ్యుల ముందే ముష్కరులు కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్‌ సిందూర్‌ మొదలైంది. అయితే పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగినప్పుడు ఆ సమీప ప్రాంతాలలో ఎక్కడా భద్రతా దళాలు లేవు. ప్రాణాలతో బయటపడిన వారే ఈ విషయాన్ని తెలియజేశారు. మతం ఆధారంగా బాధితులను ఎంపిక చేసుకోవడానికి ఉగ్రవాదులు కొంత సమయం తీసుకున్నారు. ‘చర్య తీసుకోవడానికి తమకు చాలినంత సమయం ఉంటుందని, ఎటువంటి సహాయం రాదని కూడా వారికి తెలుసు. మా ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేసింది’ అని ఐశాన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె భర్త శుభం ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు. కాల్పులు జరిగిన తర్వాత తన సోదరుడు లెఫ్టినెంట్‌ వినరు నర్వాల్‌ గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడని, సకాలంలో సాయం అంది ఉంటే బతికేవాడని, కానీ అది జరగలేదని సృష్టి అనే మహిళ అవేదన వ్యక్తం చేసింది. వందలాది మంది పర్యాటకులను ఆకర్షించే బైసారన్‌ ప్రాంతంలో భద్రతా దళాలను ఎందుకు నియోగించలేదు? వీఐపీలకు పటిష్టమైన భద్రత ఉన్నప్పుడు పన్ను చెల్లింపుదారులకు ఎందుకు లేదని శీతల్‌ అనే మహిళ ఓ మంత్రిని ప్రశ్నించింది. ఆమె భర్త శైలేష్‌ కలాతియా ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకొని ఉంటే బైసారన్‌లో పర్యాటకులు సురక్షితంగా ఉండేవారు. ఆపరేషన్‌ సిందూర్‌ అవసరమే ఉండేది కాదు.
కాల్పుల విరమణ ఎవరి నిర్ణయం?
కాల్పుల విరమణను ప్రకటించింది భారత్‌ లేదా పాకిస్తాన్‌ కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఆ తర్వాత పాకిస్తాన్‌ దానిని ధృవీకరిస్తూ అమెరికా ప్రమేయాన్ని అంగీకరించింది. మన దేశం మాత్రం ఆ విషయాన్నే ప్రస్తావించలేదు. పాక్‌ తన డీజీఎంఓ ద్వారా కాల్పుల విరమణకు వేడుకున్నదని, ఆ అభ్యర్థనకు భారత్‌ అంగీకరించిందని ప్రధాని మోడీ చెప్పారు. ఇదే నిజమై కాల్పుల విరమణ భారత్‌ తీసుకున్న నిర్ణయమే అయితే అమెరికాలో ట్రంప్‌ ఎందుకు ప్రకటన చేశారు? ఎక్కడైనా వివాదం తలెత్తినప్పుడు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుంటుంది. శాంతిని సూచిస్తుంది. మిత్ర దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తాయి. అయితే నిర్ణయం తీసుకోవడం, ఆ ప్రకటన చేయడం మాత్రం ఆయా దేశాలకు ఉన్న ఏకైక హక్కు. సార్వభౌమాధికారం కలిగిన భారతదేశం ఈ అధికారాన్ని వాషింగ్టన్‌కు ఎందుకు అప్పగించింది?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనలో భారత్‌, పాకిస్తాన్‌లను ఒకే గాటన కట్టడం ఆందోళన కలిగించే అంశం. మన దేశం భయంకరమైన ఉగ్రదాడికి గురైంది. ప్రతీకారాన్ని తీర్చుకునే హక్కును ఉపయోగించుకుంది. అయినప్పటికీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే, వారికి ఆశ్రయం కల్పించే పాకిస్తాన్‌తో మనల్ని సమానంగా చూశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారంలో మూడో పక్షం జోక్యానికి అవకాశమే లేదని భారత్‌ పదే పదే స్పష్టం చేస్తోంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ట్రంప్‌ మధ్యవర్తిత్వం అంగీకారయోగ్యమేనా?
ఎవరైనా జవాబుదారీ వహిస్తారా?
పఠాన్‌కోట్‌, యురి, పుల్వామా, తాజాగా పహల్గాం…ఈ దాడులకు ప్రధాని మోడీ తన ప్రభుత్వంలో ఎవరినైనా బాధ్యులను చేస్తారా? దాడులకు ప్రతీకారం తీర్చుకుంటే సరిపోతుందా? వాటిని నిరోధించడం ప్రభుత్వ కర్తవ్యం కాదా?
పాక్‌ కాల్పులలో చనిపోయిన భారతీయులెందరు?
ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్‌ జరిపిన కాల్పులలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో నలుగురు చిన్నారులు, 12 సంవత్సరాల కవలలు కూడా ఉన్నారు. ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఎందుకు ఖాళీ చేయించలేదు? ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టకుండా ఎవరు నిరోధించారు? ఈ మరణాలకు ఎవరు జవాబుదారీ? పాక్‌ కాల్పులలో మరణించిన వారి భార్యల నుదుటి సిందూరం సంగతేమిటి? చిన్నారులను కోల్పోయిన కుటుంబాల బాధను ఎవరు తీరుస్తారు?
పహల్గాం ముష్కరులు ఎక్కడీ
పహల్గాం మారణహోమానికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభమైంది. అయితే ఆ దాడికి బాధ్యులైన నలుగురు ముష్కరులను ఇప్పటికీ చట్టం ముందు నిలబెట్టలేదు. వారు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఎందుకు పట్టుబడలేదు? కాల్పుల విరమణకు అంగీకరించడానికి ముందు వారిని ప్పగించాల్సిందేనని పాకిస్తాన్‌ను భారత్‌ ఎందుకు డిమాండ్‌ చేయలేదు?
ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందా?
ఆపరేషన్‌ను ఆపేసిన అమెరికానే ఈ ప్రశ్న అడగాల్సి ఉంటుంది. బహుశా పార్లమెంటులో ప్రభుత్వం ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వవచ్చు. అనేక మంది ఉగ్రవాదులను హతమార్చా మని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని మాత్రమే ప్రధాని మోడీ చెప్పారు.
మనం విమానాలను కోల్పోయామా?
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ ఓ రాఫెల్‌ సహా యుద్ధ విమానాలను కోల్పోయిందని అంతర్జా తీయ మీడియాలో వచ్చిన వార్తలపై విదేశాంగ కార్యదర్శి మిస్రి స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు సమాచారాన్ని అందజేస్తామని చెప్పారు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది? వైమానిక దళ అధికారి ఒకరు కొన్ని నష్టాలు జరిగాయని చెప్పారు కానీ వివరాలు ఇవ్వలేదు. ఏదైనా వివాదం వచ్చినప్పుడు లాభనష్టాలు రెండూ ఉంటాయి. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి ఓ లక్షణం.
పుల్వామా దర్యాప్తు ఏమైంది?
పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వారుపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఆరు సంవత్సరాలు గడిచాయి. పుల్వామాలో జరిగిన నిఘా వైఫల్యానికి, భద్రతా లోపానికి ఎవరూ బాధ్యత వహించలేదు. పహల్గాంలో కూడా అవే వైఫల్యాలు, లోపాలు చోటుచేసుకున్నాయి. అలాంటప్పుడు పుల్వామాపై జవాబులు ఆశించగలమా?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -