Monday, May 5, 2025
Homeప్రధాన వార్తలుసామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గించాలి

సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గించాలి

- Advertisement -

– ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
– 20న జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/కల్వకుర్తి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన చేయడానికి నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు. కగార్‌ చర్యలను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని తెలిపారు. సామాజిక, ఆర్థిక అసమానతలు, కుల వివక్షతను రూపుమాపేందుకు విద్యా, వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి చట్టాలకు వ్యతిరేకంగా మే 20న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఆదివారం తెలంగాణ పోరాటయోధుడు కందికొండ రామస్వామి సంస్మరణ దినోత్సవం సందర్భంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు వచ్చిన జాన్‌వెస్లీ.. కల్వకుర్తి పట్టణంలోని టీఎస్‌ యూటీఎఫ్‌ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరగనున్న కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చకూడదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని అన్నారు. కేంద్ర బలగాలను దండకారణ్యంలో మావోయిస్టులపై ఉసిగొల్పి వారిని ఎన్‌కౌంటర్లు చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలిపారు. కర్ర గుట్టలో మావోయిస్టులను చుట్టుముట్టిన పారా మిలటరీ బలగాలను వెంటనే వెనక్కి పిలిపించి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హౌం మంత్రి ప్రకటించడం సరైనది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరు శాతం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతోపాటు స్థలాలు లేని వారికి ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. కేరళ తరహాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్‌ కార్డుకు 14 నిత్యవసర సరుకులు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అందాల పోటీలతో విదేశీ పెట్టుబడులు రావని, వారికి మౌలిక వసతులు కల్పించి పెట్టుబడులు రప్పించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా కార్మిక సంఘాలతో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈనెల 20న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌. శ్రీనివాసులు, కందికొండ గీత, దేశనాయక్‌, ఆంజనేయులు, నాయకులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
జాన్‌ వెస్లీని ప్రజాసంఘాల సన్మానం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా నియామకం అయిన తర్వాత తొలిసారి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో పర్యటనకు రావడంతో కల్వకుర్తి పట్టణంలో సీపీఐ(ఎం), సీఐటీయూ, టీఎస్‌యూటీఎఫ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌, తదితర కార్మిక సంఘాల నాయకులు జాన్‌వెస్లీకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు అంజనేయులు, సీనియర్‌ నాయకులు ఏపీ మల్లయ్య, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాములు, టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు చిన్నయ్య, నెహ్రూ ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు టి. చెన్నయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -