ప్రతీ పాఠశాలలో ఆవశ్యకం…
ఎంఈవో పొన్నగంటి ప్రసాదరావు.
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఇంకుడు గుంతలతో ఎంతో సామాజిక ప్రయోజనం ఉందని, ఇందుకోసం ప్రతీ పాఠశాలలో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ఎంఈవో పొన్నగంటి ప్రసాదరావు అన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని నెహ్రూ నగర్ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రాంగణంలో ఇంకుడు గుంత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని అన్ని పాఠశాలల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి మండల జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయులు కు సూచించామని అన్నారు. భవిష్యత్తు తరాలకు త్రాగునీరు అందాలంటే ఇంకుడు గుంత లే శరణ్యం అని తెలియజేశారు. ఇంకుడు గుంతలు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున వాటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మండలంలోని 63 పాఠశాలల్లో మే 7 వ తేదీ నాటికి 70 ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలని తీర్మానించారు. ఇంకుడు గుంతలు ఒక మీటర్ లోతు, ఒక మీటర్ పొడవు, ఒక మీటర్ వెడల్పుతో అందుబాటులో ఉన్న గులక రాళ్లు, ఇతర మెటీరియల్ ఉపయోగించి తయారు చేసుకోవాలని దీనికి ఎక్కువ ఖర్చు అవసరం లేదని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వ్యాఖ్యానాలను గుర్తు చేశారు. స్థానిక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారి సహాయంతో ఈ పని వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బేబీ పద్మ,సీసీఓ మెహబూబ్, సీఆర్పీ లు ప్రభాకర్ చార్యులు రామారావు, మల్లేష్ పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలతో సామాజిక ప్రయోజనం..
- Advertisement -
RELATED ARTICLES