Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంవికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

- Advertisement -

– ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య
– 13న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ – బంజారాహిల్స్‌

వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని, సంక్షేమానికి ప్రత్యేకంగా వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న 48 రకాల సమస్యలపై హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో డైరెక్టర్‌కు శనివారం ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, ఉపాధ్యక్షులు జె.రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికళతో కూడిన ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్బంగా అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులున్నారని తెలిపారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది ఉంటే 4,90,044 మందికే పింఛన్‌ వస్తోందని తెలిపారు. 2016 ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం, 2017 మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. మహిళా వికలాంగులపై లైంగికదాడులు, వేధింపులు, వికలాంగులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైకల్యం కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు వారు దూరమవుతున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి మే 13న డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు.రాష్ట్రంలో ఉన్న టీసీపీసీ కేంద్రాలను బలోపేతం చేస్తూ, ఉమ్మడి జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో వికలాంగ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్స్‌ అమలు కావడం లేదన్నారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహం రూ.2 లక్షలకు పెంచడంతోపాటు జంటలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే రూ.5 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 40 శాతం వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికీ పరికరాలు ఇవ్వడంతోపాటు చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి మోటారైస్డ్‌ వాహనాలు ఇవ్వాల న్నారు. వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో భవిత సెంటర్స్‌ ఏర్పాటు చేసి మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్‌హెచ్‌సీ కేంద్రాల్లో సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు రూ.25,000 ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -