Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుప్రభుత్వ భవనాలపై సోలార్‌ ప్లాంట్లు

ప్రభుత్వ భవనాలపై సోలార్‌ ప్లాంట్లు

- Advertisement -

– ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచితంగా సోలార్‌ పంప్‌సెట్లు
– వారం రోజుల్లో అన్ని వివరాలు పంపండి : కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
: గ్రామ పంచాయతీ భవనం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శనివారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌మిట్టల్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీ, టీజీ రెడ్కో సీఎమ్‌డీ వీ అనీల తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం అమలును వేగవంతం చేయాలనీ, దానికోసం ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల వివరాలు పంపాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పారు. రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, పార్కింగ్‌, క్యాంటీన్‌లకు సంబంధించిన మ్యాపింగ్‌ ప్లాన్లు హైదరాబాద్‌కు పంపాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాదు నుంచే పంపిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి కలెక్టర్‌ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఏవైనా ఉన్నా, వాటిని కూడా కలెక్టర్లు హైదరాబాద్‌కు పంపవచ్చని చెప్పారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక ప్రశ్నావళిని పంపిస్తామనీ, వివరాలు దానిలో నమోదు చేసి, వారంరోజుల్లో విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆయా ప్రభుత్వ భవనాల వివరాలను పంపాలని చెప్పారు. నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖల పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయనీ, వాటి వివరాలు కూడా పంపాలని కలెక్టర్లకు సూచించారు.
సోలార్‌ పంప్‌సెట్లు ఏర్పాటు చేయండి
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపిణీ చేసిందనీ, ఆ భూముల్లో నల్లమల డిక్లరేషన్‌ ద్వారా ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకం ద్వారా ఆయా భూముల్లో ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ పద్ధతిని ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించామనీ, ఈ నెలలోనే ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు వారంలోగా పంపాలని చెప్పారు. వీటిపై ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీతో పాటు విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంలు) సీఎమ్‌డీలను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img