నవతెలంగాణ-హైదరాబాద్: సెలవుపై ఇంటికి వచ్చిన జవాన్ పై కాల్పులు జరిగిన సంఘటన హర్యానాలోని సోనిపట్ జిల్లాలో జరిగింది. ఖేరి దమ్కన్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల కృష్ణన్ కుమార్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అతడు విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట సొంత గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కన్వర్ యాత్ర కోసం హరిద్వార్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్ కృష్ణన్, వారి మధ్య ఘర్షణ జరిగింది.
ఈ గొడవ తర్వాత కృష్ణన్ సెలవుపై తన గ్రామానికి వచ్చాడు. జూలై 28న తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న అతడిపై కారులో వచ్చిన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్వర్ యాత్ర కోసం హరిద్వార్ వెళ్లి కృష్ణన్‌తో గొడవ పడిన గ్రామానికి చెందిన వ్యక్తులు అతడ్ని చంపినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. కారు డ్రైవర్ సాగర్, ప్రవీణ్ అలియాస్ మెంధక్, మోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితులు నిషాంత్, అజయ్ పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్ కృష్ణన్‌తోపాటు ఆనంద్ అలియాస్ పహియా అనే మరో వ్యక్తిని కూడా కాల్చి చంపేందుకు నిందితులు ప్లాన్ వేసినట్లు వెల్లడించారు.