– మగ్గం వర్క్, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
– మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాల్లోనూ చురుకైన భాగస్వామ్యం
– తండ్రి సేవా బాటలోనే సమాజసేవ – నిర్వాహకురాలు సోనియా శంకర్
నవతెలంగాణ – కామారెడ్డి
పేద మహిళలకు స్వయం ఉపాధి కి శిక్షణ ఇస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించాలనే లక్ష్యంతో సోనియా శంకర్ ఫౌండేషన్ ద్వారా మగ్గం వర్క్, టైలరింగ్‌లో గత 25 సంవత్సరాలకు పైగా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకురాలు సోనియా శంకర్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నవతెలంగాణతో మాట్లాడిన ఆమె, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు జీవనోపాధి మార్గం చూపించాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలకు మగ్గం వర్క్, టైలరింగ్ వంటి నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి, వారు తమ ఇంటి నుంచే ఉపాధి పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నామని తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని 23, 24 వార్డులలో అనేక మంది మహిళలు ప్రస్తుతం మగ్గం వర్క్ చేయడం, టైలరింగ్ పనులు చేయడం ద్వారా కుటుంబానికి ఆదాయం సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. వారి భర్తలు రోజువారి కూలీలు కావడంతో కొన్నిరోజులు పని లేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా కుటుంబాలు నిలదొక్కుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్వయం ఉపాధితో పాటు సమాజ సేవలో కూడా తమ సంస్థ చురుకుగా పాల్గొంటుందని ఆమె తెలిపారు. చలికాలంలో నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా తమ సంస్థ భాగస్వామ్యం అవుతూ మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు.తండ్రి సేవా బాటలోనే తాను సమాజసేవలోకి వచ్చానని సోనియా శంకర్ తెలిపారు. తమ తండ్రి గ్రామంలో రాజకీయ నాయకుడిగా ఉండి పలువురికి సహాయం చేస్తుండగా, సహాయం పొందిన వారి ముఖాల్లో కనిపించిన ఆనందం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో తాను కూడా సమాజానికి ఉపయోగపడాలని సంకల్పించి తన భర్త శంకర్ సహాయంతో సోనియా శంకర్ ఫౌండేషన్‌ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తాను చేసే ఈ కార్యక్రమాలకు తన భర్త, తమ ఇద్దరు కుమారుల సహకారం ఎంతో ఉందన్నారు. పేద మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలను బలోపేతం చేసుకోవాలని సోనియా శంకర్ పిలుపునిచ్చారు.



