నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్‌ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్‌కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, బెల్జియన్ చట్టాల ప్రకారం చోక్సీని భారత్‌కు అప్పగించడంలో ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లోని ఒక కోర్టు తన తీర్పులో చోక్సీ నేరాలు భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 120-B, 201, 409, 420, 477-A కింద చట్టం ప్రకారం శిక్షార్హమైనవని తెలిపింది. చోక్సీపై మోసం, దుర్వినియోగం, ఫోర్జరీ అభియోగాలు బెల్జియన్ చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైనవని కోర్టు స్పష్టం చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన చోక్సీ, మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్బుడాకు పారిపోగా.. నీరవ్‌మోదీ లండన్‌లో ఉంటున్నాడు. ఇటీవల అంట్వర్ప్‌లోని కోర్టు చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. భారత్‌కు చోక్సీని అప్పగిస్తే ఆయనను ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నెంబర్ 12లో ఉంచుతామని అధికారులు కోర్టుకు హామీ ఇచ్చారు.