మహిళల జీవితంలో 40 ఏండ్ల వయసు ఒక కీలకమైన మలుపు. ఈ దశలో శరీరంలో అనేక అంతర్గత, హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, జీవక్రియ నెమ్మదించడం వల్ల బరువు పెరగడం, ఎముకలు బలహీనపడటం, అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలామంది మహిళలు కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ వయసులో సరైన అవగాహన, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
వయసుతో పాటు స్త్రీ శరీరంలో వచ్చే మార్పులు
35–40 ఏండ్లు: నిశ్శబ్ద మార్పులు
హార్మోన్ల హెచ్చుతగ్గుల ప్రారంభం
హార్మోన్ల మార్పులు శరీరంలో అంతర్గతంగా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి.
40–44 ఏండ్లు: నిద్రలేమి, అసౌకర్యం
హార్మోన్ల మార్పుల ప్రభావం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా ప్రశాంతత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
45–47 ఏండ్లు: పెరిమెనోపాజ్ ప్రారంభం
మెనోపాజ్కు ముందు దశ (Perimenopause) తొలి లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి.
47–49 ఏళ్లు: క్రమరహిత నెలసరి
రుతుక్రమం (నెలసరి) తరచుగా అస్తవ్యస్తంగా, అసమతుల్యంగా మారుతుంది.
48–50 ఏండ్లు: వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు
అకస్మాత్తుగా శరీరంలో వేడి ఆవిర్లు రావడం, రాత్రి వేళల్లో విపరీతంగా చెమటలు పట్టడం పెరుగుతాయి.
50–51 ఏండ్లు : మానసిక స్థితిలో మార్పులు
ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల మూడ్ స్వింగ్స్, చిరాకు సర్వసాధారణం అవుతాయి.
52–53 ఏండ్లు: మెనోపాజ్ దాటడం
వరుసగా 12 నెలల పాటు నెలసరి రాకపోవడం ద్వారా మెనోపాజ్ పూర్తయినట్లు ధృవీకరించబడుతుంది.
53–55 ఏండ్లు: లక్షణాలు శాంతించడం
మెనోపాజ్ సంబంధిత తీవ్ర లక్షణాలు సాధారణంగా తగ్గడం ప్రారంభిస్తాయి.
55–57 ఏండ్లు: గుండె ఆరోగ్యంపై దృష్టి
ఈస్ట్రోజెన్ రక్షణ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
57–60 ఏండ్లు: ఎముకల సాంద్రత తగ్గడం
ఆస్టియోపోరోసిస్, ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం పెరుగుతుంది.
60+ ఏండ్లు: కీళ్లు, కండరాల మార్పులు
కీళ్ల నొప్పులు, బిగుతుతనం, కండరాల క్షీణత మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
రోజువారీ డైట్లో ఉండాల్సిన పోషకాలు
ఈ మార్పులను తట్టుకోవడానికి మహిళలకు రోజూ అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు.
క్యాల్షియం & విటమిన్ డి (ఎముకల బలం కోసం)
తీసుకోవాల్సిన ఆహారం: పాలు, పెరుగు, మజ్జిగ, రాగులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు.
ప్రయోజనం: ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడటం), కీళ్ల నొప్పుల నివారణకు తోడ్పడుతుంది.
ప్రోటీన్ (కండరాలు బలంగా ఉండటానికి)
తీసుకోవాల్సిన ఆహారం: ఉడకబెట్టిన గుడ్డు తెల్లసొన, పెసరపప్పు, శనగలు, మొలకెత్తిన విత్తనాలు, పనీర్, లేదా చికెన్/చేపలు.
ప్రయోజనం: జీవక్రియను పెంచి, శరీరానికి అవసరమైన శక్తిని, కండరాల బలాన్ని ఇస్తుంది.
ఫైబర్ & యాంటీ ఆక్సిడెంట్లు (గుండె, జీర్ణక్రియ కోసం)
తీసుకోవాల్సిన ఆహారం: ఆపిల్, చిలగడదుంపలు, టమాటోలు, బెర్రీలు, జొన్నలు, ఓట్స్ వంటి తృణధాన్యాలు.
ప్రయోజనాలు: బరువు నియంత్రణ, బిపి, కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ, మలబద్ధక సమస్య నివారణకు తోడ్పడుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (హార్మోన్ల సమతుల్యత కోసం)
తీసుకోవాల్సిన ఆహారం: బాదం, ఆక్రోట్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా విత్తనాలు.
ప్రయోజనం: హార్మోన్ల హెచ్చుతగ్గులను తగ్గించి, అలసటను నివారిస్తుంది, చర్మం పొడిబారకుండా చూస్తుంది.
ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమైన చిట్కాలు
తగినంత నీరు తాగడం: రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం వల్ల అలసట తగ్గడమే కాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది.
ఉప్పు, చక్కెర తగ్గించడం: బిపి, ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance) సమస్యలు రాకుండా ఉండటానికి ఉప్పు, శుద్ధి చేసిన (processed) చక్కెర పదార్థాలను తగ్గించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం: ఆహారంతో పాటు రోజువారీగా కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయడం ఎంతైనా అవసరం.
వాణీ అయోధ్య
క్లినికల్ డైట్ కన్సల్టంట్
99593 61180







కామెంట్లు (0)