Magazines

మీ తెలివైన నిర్ణయంలోనే ఉంది

56 నిమిషాల క్రితం

బలమైన ఆకర్షణ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటం చాలా క్లిష్టం. ఎదురుగా కనిపిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలు రెండూ బలమైన ఆకర్షణ కల్గివున్నప్పుడు.. ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినపుడు... ఏది, ఎందుకు ఎంచుకోవాలో అర్ధంకాని పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురౌతూనే వుంటుంది.

తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఒక్కొక్కసారి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ కెరీర్‌ని ఎంచుకునేటపుడు, బతుకుదెరువుకోసం ఉద్యోగాన్ని ఎంచుకొనేటపుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. దీని ఫలితంగానే ఉజ్వలమైన భవితను కైవసం చేసుకోగలం. సరిగ్గా ఇటువంటి మలుపులలోనే నిర్ణయం తీసుకోవడం ఎలాగో చేతకాక అనేకమంది దుష్ఫలితాలకు తమంతట తామే తెరతీస్తారు.

తెలివి-మనసు

కొంతమంది నేను చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాననుకుంటారు. మరికొంతమంది నేను నా అంతరాత్మ ప్రబోధాన్ని బట్టే ఓటువేస్తామంటారు. నిర్ణయాలను గైకొనటంలో వీరు తమ తెలివితేటలకన్నా అంతరంగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే ఒక నిర్ణయం తీసుకోవడం వెనుక ఈ రెండింటి ప్రమేయం, తెలివి- మనసు తప్పనిసరిగా వుంటాయి. ‘తెలివి’ ఏం చేయాలో చెబుతుంది. ‘మనసు’ అలా చేయడం మీకు ఇష్టమా, కష్టమా తెలుస్తుంది. జీవిత ప్రయోజనాల గురించి ‘తెలివి’ పాటుపడ్తుంది. ‘మనసు’ ఆంతరంగిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. బయటకు కనిపించే ప్రయోజనాల మాటెలా వున్నా, మానసికంగా ఇష్టత లేనపుడు ఆత్మ సంతృప్తి లభించదు. ఇష్టానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి జీవితంలో రాజీ పడకపోవడం వల్ల సామాజిక జీవితాన్ని, సమస్యల వలయంలోకి నెట్టేశామన్న రంపపుకోతా తప్పదు. స్పందనను బట్టే నిర్ణయం తీసుకోవాలా..? తూనికరాళ్ళను బట్టే నిర్ణయాలు తీసుకోవాలా..? అని ఆలోచించవల్సి వచ్చినప్పుడు, ఇది ఒక డోలాయమానస్థితికి గురి చేస్తోంది. ఫలితంగా అటు నిర్ణయం తీసుకోలేక, వదిలి పెట్టనూ లేక మనిషి సంఘర్షణకు గురి అవుతాడు. తెలివి చెప్పేదొకటి, మనసు చెప్పేదొకటి అయినపుడు ఈ సంఘర్షణ మరీ ఎక్కువవుతుంది. ఎటూ తేల్చుకోక సంకట పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలైన కెరీర్ ఎంపిక, పెళ్ళివంటి సందర్భాలలో సరిగ్గా నిర్ణయం తీసుకోవల్సిన సామర్ధ్యాలను సంతరింపచేసుకోవడం అనివార్యం. భవిష్యత్తులో జరుగనున్న అనుకూల, ప్రతికూల సన్నివేశాలలో మిమ్మల్ని మరింత జటిలమైన స్థితిలోకి నెట్టేసేవి ఈ నిర్ణయాలే. కనుక ఈ ముఖ్యమైన సందర్భాలలో సరియైన నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ నిర్ణయం మీ తెలివితేటలు, మీ హృదయ స్పందన రెండింటి అంగీకారంతో తీసుకోవడం అనివార్యం. ఈ రెండింటి మధ్య వివాదం ఏర్పడినపుడే మీరు నిర్ణయం తీసుకోలేని నిస్సహాయ స్థితిలో పడిపోతారు. ఎడిన్బర్గ్ యూనివర్శిటీకి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ మెక్ ఎల్రాయ్ ఈ సందర్భంగా సరైన నిర్ణయం తీసుకోవటానికి నాల్గుదశలతో కూడిన సరళమైన కార్యాచరణ సూత్రాన్ని ఒకదాన్ని మనకు వివరిస్తాడు.

1) సమాచార సేకరణ: మీరు నిర్ణయం తీసుకోవల్సి వున్న అంశంపై మీరు పూర్తి అవగాహనను కల్గి వుండాలి. అప్పుడే మీరు ‘తగిన’ నిర్ణయం తీసుకోగల్గుతారు. మీకు అందుబాటులో గల పలు రకాల వనరులనుండి (స్నేహితులు, బంధువులు, మీడియా) మీరు మీ నిర్ణయం తీసుకోవటానికి తగిన సమాచారాన్ని సేకరించండి.

2) ప్రయోజనాలను గుర్తించండి : సమాచారం లభ్యమయ్యాక, అవగాహన ఏర్పడిన తర్వాత మీరు వాటి ప్రయోజనాలను అంచనా వేయాలి. ఫలానా ఉద్యోగం ఎంచుకోవడంవల్ల మీకు ఏం లభిస్తుంది. ఫలానా కోర్సు చదవటం వల్ల కలిగే లాభాలేమిటి..? ఫలానా ఉద్యోగం చేయడం వల్ల ఎక్కువ జీతం వస్తుందని మీకు అన్పించినా, ఆ ఉద్యోగంలో వున్న సమస్యలు, ఇతిబాధలు మిమ్మల్ని ఎంతవరకూ మీ ప్రతిభా సామర్ధ్యాలను వెలికితీయగలవన్నది ఆలోచించాలి. ఒక పనిని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఆలోచిస్తేనే వాటిని సరిగ్గా సరిపోల్చగల్గుతారు.

3) మీ విలువలను పరిశీలించండి: మొదటి రెండు అంశాలు మీ తెలివితేటలకు సంబంధించిన అంశాలు. మూడు నాలుగు అంశాలు మీ మానసిక ప్రపంచానికి సంబంధించినవి. ఇది ముఖ్యంగా మీ విలువలు, వైఖరులను బట్టి ఆధారపడి వుంటుంది. ఫలానా ‘పని’ని చేయడం వల్లనో, ఫలానా నిర్ణయం వల్లనో మీ విలువలను వదిలిపెట్టవల్సిన పరిస్థితి ఎదురయితే సంఘర్షణ తప్పదు. మీరు మానసికంగా పెట్టుకున్న విలువలతో కూడుకున్న వాటికి, మీ విలువలు సమ్మతించే వాటికి మీరు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తగు నిర్ణయం తీసుకోవాలి.

4) చక్కగా అమలుపర్చండి : నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని అమలులో పెట్టడం చాలా అవసరం. ఇక్కడ మీరు మీ అపారమైన ప్రజ్ఞాపాటవాలను, మానసికంగా మీరు అమితోత్సాహంతో ముందంజ వేయగలిగే ప్రేరణలను మిళితం చేసి మీ నిర్ణయం అమలుకు తగిన ప్రణాళికను రూపకల్పన చేయాలి. తీసుకున్న నిర్ణయం మేరకు లక్ష్యాన్ని సాధించడానికి విలువలతో కూడుకున్న అంతిమ ప్రయోజనాల సాధనే ముఖ్య ధ్యేయంగా మీ ‘యాక్షన్’ను ప్లాన్ చేసుకోవాలి. ఈ రూపకల్పనకు, నిర్ణయాల అమలుకు మీ తెలివితేటలు, స్వయం అంచనా సామర్ధ్యం, దీంతోబాటు మానసికంగా మీ అంతరాత్మ తోడ్పాటు కూడా లభించి.. అద్భుతమైన ప్రయోజనాలు సాధించగల్గుతారు.

ఈ నాలుగు దశలను దృష్టిలో పెట్టుకుని మనసుకు నచ్చిన తెలివైన నిర్ణయాన్ని ఎంచుకోండి. మీ ఉజ్యల భవితను కాంతిమయం చేసుకోండి.

డా.హిప్నో పద్మా కమలాకర్‌ 9390044031
కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్