ఆ రోజు లక్ష్మికి, ఆమె ఏడేళ్ల కొడుకు బుజ్జీగాడి జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతోంది. బుజ్జి ఆశించినది సాధించగలడా లేదా అనే సంశయం ఆమె మనసును తొలిచేస్తోంది. లక్ష్మికి కష్టాలు కొత్త కాదు, చిన్నతనం నుండే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఏడేండ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి, మామయ్య ఇంట్లోనే పెరిగింది. మామయ్య కొడుకు రమేష్‌తో పెళ్లై, ముగ్గురు పిల్లలకు తల్లి అయినా ఆమె సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి భర్త రమేష్‌తో పాటు, చిన్న కొడుకు చిన్నాను కూడా బలి తీసుకుంది.
ఐటీఐ చదివిన రమేష్, ఒక వాహన విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. వచ్చే కొద్దిపాటి జీతంతోనే లక్ష్మి, తన ముగ్గురు పిల్లలను పెంచుతూ, ఎంతో జాగ్రత్తగా కుటుంబాన్ని పోషిస్తూ, ప్రతి నెలా కొంత సొమ్మును బ్యాంకులో పొదుపు చేసేది. అలా వారి జీవితం సంతోషంగా గడుస్తున్న సమయంలో, కరోనా మహమ్మారి వ్యాపించి, దేశమంతా లాక్డౌన్ విధించడంతో రమేష్ పనిచేసే ఫ్యాక్టరీ మూతపడింది. కొన్ని రోజులకే ఆయన ప్రాణాలు కూడా కోల్పోవడంతో, ఇద్దరు చిన్న పిల్లల బాధ్యత లక్ష్మిపై పడింది. బ్యాంకులో దాచుకున్న డబ్బు కూడా హారతి కర్పూరంలా కరిగిపోయింది. రోజులు గడవడం కష్టంగా మారింది. భర్త ఉన్నప్పుడు ఏనాడూ గడప దాటని ఆమె, ఇప్పుడు ఆ పసి పిల్లలను ఎలా పెంచాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంది. ఒక తల్లి హృదయం బాధపడుతున్నా, ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని త్వరలోనే దానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంది.
“బుజ్జీ, చంటీ.. లేవండమ్మా! చాలా వేళయింది. తొందరగా లేచి ముఖం కడుక్కోండి, జావ కాచాను” అంటూ పిల్లల్ని ప్రేమగా లేపింది లక్ష్మీ. బుద్ధిగా లేచి ముఖం కడుక్కుని వచ్చిన వారికి, పంచదార వేసిన వేడి వేడి జావను గ్లాసులో పోసి అందించింది. వాళ్ళు రమేష్ చనిపోయినప్పటి నుండి పాలు ముఖం ఎరుగరు కానీ ఏ రోజు పేచీ పెట్టలేదు. పెద్దవాడు బుజ్జికి ఏడేళ్లు ఉంటాయి. గుండ్రని ముఖం, గులాబీ పెదవులు, ఊడుతున్న పళ్ళతో చాలా ముద్దుగా ఉంటాడు.
‘బుజ్జి, ఈ రోజు బడికి వెళ్లకు. స్నానం చేసి, మంచి బట్టలు వేసుకో. గుడికి వెళ్లి అయ్యగారిని కలిసి వద్దాం’ అంది జావ తాకుతున్న బుజ్జితో.
‘లేదమ్మా, ఈ రోజు బడికి వెళ్లాలి. మాస్టారు ఈ రోజు కొత్త పాఠం చెబుతానని అన్నారు’ అని అనునయంగా అన్నాడు బుజ్జి. వాడు ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. బుజ్జికి బడి అంటే, చదువంటే చాలా ఇష్టం. అంతేకాక, అక్కడ కడుపు నిండా భోజనం పెడతారు కదా, అందుకే వాడు ఒక్క
రోజు కూడా బడి మానేవాడు కాదు. వాడి ముద్దు ముద్దు మాటలకు లక్ష్మి ఇక ఏమీ అనలేక, అయిష్టంగానే వాడిని స్కూలుకు పంపింది. సాయంత్రం బుజ్జి స్కూలు నుంచి ఇంటికి రాగానే, వాడికి మంచి బట్టలు వేసి, ఒక చిన్న సంచిలో పసుపు కుంకుమతో పాటు పెరట్లో కాసిన రెండు జామపళ్ళు, ఒక పది రూపాయల నోటు సిద్ధం చేసి, చంటిని పక్క ఇంటి కాంతాన్ని చూసుకోమని చెప్పి, బుజ్జి చేయి పట్టుకుని గుడికి బయలుదేరింది.
లక్ష్మీ గుడికి చేరేసరికి ఆలస్యం అవ్వడంతో, పూజారి రామాచార్యులు గారు పూజ ముగించి, గుడి మెట్ల మీద నుండి దిగుతూ కనిపించారు. ఆయనను చూడగానే, ఆమె తెచ్చిన సంచిని ఆయనకు ఇచ్చి, దండం పెట్టి ‘అయ్యగారూ! మీరు మా బుజ్జిగాడిని ఆశీర్వదించండి’ అని జాలిగా అంది. రామాచార్యులు గారు చేతిలోని సంచిని చూస్తూ, బుజ్జి తల నిమురుతూ ‘ఏమయింది లక్ష్మీ? ఎందుకీ ఇవన్నీ?’ అన్నారు. లక్ష్మీ, వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ “మీకు తెలుసుగా, మా ఆయన కాలం చేసి మూడేళ్లు దాటింది. నేను ఎప్పుడు ఇంటి గడప దాటి వెళ్ళి పని చెయ్యలేదు. ఇన్నాళ్లుగా ఇరుగు పొరుగు వారికి బట్టలు కుట్టి, ఇద్దరు పిల్లలను చాలా కష్టపడి సాకుతున్నాను. కానీ ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతున్నారు. ఇక చాలా కష్టంగా ఉంది, చేతిలో చిల్లి గవ్వ ఆడటం లేదు అయ్యా. అందుకే నేను బాగా ఆలోచించి, ఈ వచ్చే ఆదివారం రోజు మా బుజ్జి గాడి చేత వేషం కట్టించి, మన పక్క ఊరు కొమురులో జరుగుతున్న జాతరకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. వేషం చూసినవారు ఎంతో కొంత డబ్బులు వేస్తారు కదా, దానితో నాకు కొంత ఉపశమనం కలుగుతుంది” అంది కొత్త ఉత్సాహంతో.
రామాచార్యులు గారు ఆమె మాటలకు ఆశ్చర్యంగా చూశారు. ‘ఏమిటమ్మా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు’ అన్నాడు అయోమయంగా. అతని మాటలకి లక్ష్మీ, బుజ్జిని దగ్గరకి తీసుకుని “అయ్యా! మా బుజ్జిగాడు గాంధీ తాత వేషం కడితే చాలా బాగుంటాడు. మొన్న స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్కూల్లో వాడి టీచర్ రమా మేడమ్ వాడి చేత ఆ వేషం వేయించారు. నేను కూడా ఆ రోజు స్కూల్‌కి వెళ్ళాను. ఆ వేషంలో అచ్చం గాంధీ తాత లాగానే ఉన్నాడు అనుకోండి. రమా మేడమ్ చాలా మంచి ఆమె. నేను అడిగితే, వేషంకి కావాల్సినవన్ని నాకు ఇప్పిస్తారు. ఆదివారం బుజ్జికి స్కూల్ ఉండదు కదా, ఆ రోజు వేషం కట్టించి, జాతరకి తీసుకువెళ్ళి, అక్కడ నిలబడితే ఎంతో కొంత డబ్బు సంపాదిస్తాం కదా” అంది ఆశగా.
ఆమె మాటలకు రామాచార్యులు గారు “నీకు అసలు ఇలాంటి ఆలోచన ఎలా కలిగింది అమ్మా?” అన్నారు కొంత అసహనంగా. “నేను నమ్మిన ఆ కోదండ రాముడే దారి చూపాడు అయ్యా. మొన్న మా పక్క కాంతం గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ టీవీ వార్తలలో చూశాను. రాజస్థాన్‌లోనో, ఎక్కడో ఒక అబ్బాయి రోజు రకరకాల దేశ నాయకులు, ఎందరో మహానుభావుల వేషాలు కట్టి, డబ్బులు ఆర్జించి కుటుంబ పోషణ చేస్తున్నాడు. అది చూసిన వెంటనే నాకు బుజ్జి గాడి గాంధీ వేషం గుర్తొచ్చింది. వాడికి కూడా వేషం కట్టించి ఎంతో కొంత డబ్బు ఆర్జించుకోవచ్చు అని అనుకున్నాను. వాడి బడికి సెలవు రోజుల్లో, ఆదివారాలలో వేషం కట్టిస్తాను. నేను ఆశించింది తప్పు కాదు కదా అయ్యా?” అంది దీనంగా చేతులు జోడిస్తూ. ఆమె మాటలకు ఆయన మనసు చలించిపోయింది. పరిస్థితిని గ్రహించిన ఆయన ఇక ఏమి అనలేక, బుజ్జి గాడికి తన ఆశీస్సులు అందించారు.
కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుండి లక్ష్మీ మనసు బాధ, ఆందోళనతో, తాను చేస్తున్నది సరియైనదా కాదా అన్నది తెలుసుకోలేని స్థితిలో ఉంది. చివరికి ఉండబట్టలేక, రాత్రి పిల్లలకి భోజనం పెడుతూ “బుజ్జి.. జాతరలో వేషం కట్టి, పొద్దున నుండి సాయంత్రం వరకు నిలబడి ఉండగలవా?” అంది సందేహంగా. “ఎందుకు నిలబడలేను? నేను గాంధీ తాత వేషం వేసి అందరినీ మెప్పిస్తే బోలెడు డబ్బులు వస్తాయి. కానీ అమ్మా.. నాకు, చంటికి పెద్ద బుడగలు కొనిపెట్టాలి” అన్నాడు ఉత్సాహంగా. వాడి మాటలకు లక్ష్మి నవ్వుతూ దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకుంది.
బుజ్జి అంత చిన్న వయసులోనే చాలా పరిణితి చెందాడు. గుడిలో తల్లి చెప్పింది విన్నప్పటి నుండి, ఎలాగైనా జాతరకి వెళ్లి, వేషం కట్టి, బోలెడు డబ్బు సంపాదించి తల్లికి ఇచ్చి, ఆమె మొహంలో నవ్వు చూడాలి అనుకున్నాడు. ఆదివారం ఉదయం నిద్రలేచి, ఇంటి పనులు చక్కబెట్టుకుని, పిల్లలను నిద్రలేపి, సిద్ధం చేసి, బుజ్జిని వారి పక్కనే ఉన్న రమా మేడమ్ వద్దకు తీసుకెళ్లి, గాంధీ తాత వేషం వేయించింది. ఇంటికి తిరిగి వచ్చి, ఒక సంచిలో భోజనం, నీళ్లు, గొడుగు, ఒక చిన్న చాప పెట్టి, చంటిని కాంతానికి అప్పగించి, బుజ్జి చేయి పట్టుకుని బస్ స్టేషన్ వైపు బయలుదేరింది. బస్సు దొరికి వారు కొమురు చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది.
జాతర జరిగే మైదానం అంతా రకరకాల దుకాణాలతో అందంగా సర్ది ఉంది. జనాలు గుంపులుగా కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా జాతర అంతా తిలకిస్తున్నారు. కొంతమంది పిల్లలు రంగుల రాట్నం ఎక్కి కేకలు పెడుతుంటే, మరికొందరు సరదాగా బొమ్మలు కొనుక్కుంటున్నారు, మరికొందరు తమకు నచ్చిన తినుబండారాలు కొనుక్కుని ఆస్వాదిస్తున్నారు. జాతరలో ఎక్కడ చూసినా జనాల సందడే. బుజ్జి గాడు అన్నిటినీ చాలా ఆసక్తిగా చూస్తున్నాడు, కానీ పాపం ఏమీ అడగకుండా తల్లి చేయి పట్టుకుని ఆమె వెంటే నడవసాగాడు. లక్ష్మీ, ఒక అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని నేలపై చాప పరిచి, బుజ్జి చేతికి కర్రను అందించి, నిలబెట్టింది. బుజ్జి, తన కళ్ళజోడును సర్దుకుని, రమా మేడమ్ నేర్పిన ‘రఘుపతి రాఘవ రాజా రామ్, పతీత పావన సీతారామ్. ఈశ్వర్ అల్లాహ్ తేరే నామ్, సబ్కో సమ్మతి దే భగవాన్’ అనే భజన పాడటం ప్రారంభించాడు.
బుజ్జి పాట ఎంత మధురంగా, మనసును హత్తుకునేలా ఉందంటే.. దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరూ కాసేపు ఆగి మరీ వినేవారు. లక్ష్మీ, బుజ్జికి ఎండ తగలకుండా గొడుగు పట్టి, మధ్య మధ్యలో మంచినీళ్లు అందిస్తూ, తినడానికి పెడుతూ, వాడికి సేద తీరుస్తూనే ఉంది. సాయంత్రం అయ్యేసరికి సుమారు వెయ్యి రూపాయల వరకు పోగు కావడంతో, బుజ్జి ఇంకా కొంతసేపు ఉండాలంటున్నా లక్ష్మి వారించి. ఇంటికి బయలుదేరింది. బుజ్జిగాడు జాతర నుండి తిరిగి వచ్చినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాడు. జాతరలో చాలా డబ్బు రావడమే కాక.. తల్లి వాడికీ, చంటికి బుడగలు, చేగోడీలు, జంతికలు, పీచు మిఠాయి కూడా కొని పెట్టింది. రాత్రి చెరోపక్క పిల్లలని పెట్టుకొని పడుకున్న లక్ష్మీకి బుజ్జిగాడు ఏడుస్తూ ఏదో కలవరిస్తుంటే మెళుకువ వచ్చింది.
“అమ్మా.. ఏడవకు అమ్మా, నేను వేషం కట్టి నీకు బొలేడు డబ్బులు తెస్తాను.. చాలా డబ్బులు వస్తే నీకు ఏ కష్టం ఉండదు కదా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా.. నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు’’ అంటున్నాడు. వాడి ఏడుపు విన్న లక్ష్మీ నిర్ఘాంతపోయింది. బుజ్జిగాడి లేత మనసులో తను అన్నది ఇంతగా ప్రభావితం చేస్తుందని ఆమె అస్సలు అనుకోలేదు. ఇంత చిన్నపిల్లాడు డబ్బులు ఆర్జించి తల్లిని సంతోషపెట్టాలన్న తన ప్రవర్తనకు లక్ష్మీ బాధతో కుంగిపోయింది. బుజ్జిగాడి మనసులో ఉన్న నిజం తెలిసిన ఆమెలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి.
“నేను బయటకు వెళ్లి పని ఎందుకు చేయలేను? చిన్న పిల్లాడి చేత వేషం కట్టించినప్పుడు ఎక్కడికి పోయింది నా సిగ్గు? బుజ్జి గాడి వద్ద ఈనాడు ఒక మంచి పాఠం నేర్చుకున్నాను. కష్టపడి పని చేస్తే ఏదీ అసాధ్యం కాదు. ఇకనుండి బుజ్జి గాడు కాదు, నేనే బయటకు వెళ్లి పని చేస్తాను. ఇంత పెద్ద లోకంలో నాకు ఏదో ఒక పని ఖచ్చితంగా దొరుకుతుంది,” అని సంకల్పం చేసుకుంది.
పిల్లలకి నిద్రలో దుప్పటి జరిగిపోవడంతో మళ్ళా సరిగా దుప్పటి కప్పుతున్న లక్ష్మీ దృష్టి కిటికీ బయటకి మరలింది. తెల్లవారతుండగా లేత సూర్యుని కిరణాలు మెల్లగా చీకటిని పారద్రోలుతున్నాయి. లక్ష్మీ మనసులో కూడా నిరాశ అనే చీకటి తొలగి ఆశ అనే ప్రకాశం మెల్లగా నిండిపోయింది. ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ఏదైనా సాధించాలని కోరుకుంటే, ఈ సృష్టి స్ఫూర్తిని అందించి, దాన్ని సాధించేలా సహాయపడుతుంది.
- తాతా కామేశ్వరి







కామెంట్లు (0)