Magazines

దివ్యభారతి తొందరపడి రాలిన సినీ మందారం

33 నిమిషాల క్రితం

Divya Bharti: A cinematic blossom that fell too soon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 7 నిమిషాల చదవడం

భారతీయ చలనచిత్ర వినీలాకాశంలో జిగేల్‌‌మంటూ ఒక వెలుగు వెలిగి అకాలంగా రాలిపోయిన తారల జాబితా ఒకరిద్దరితోనో, పదుల సంఖ్యతోనో ఆగిపోదు. వెండితెర చీకటి తెరల వెనుక ఉన్న చెరలు ఏవీ అంత తొందరగా మనకు బహిర్గతంగా కనిపించవు. చీకటి సామ్రాజ్యపు కాల నాగులు సినీ పరిశ్రమను తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంలో ఎందరినో తెరవెనుక నుండే మట్టిలో కలిపేసిన కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కథే దివ్యభారతిది.


‘తరచూ నేను ఒక కలకంటాను. ఆ కలలో ఒక ఎత్తైన ప్రదేశం మీద నుండి కళ్ళు మూసుకొని కిందికి దూకుతాను. ఈ కల నాకు ఎందుకు వస్తుందో అర్థం కాదు. అయితే అలాంటి కలలు వస్తున్నందుకు నేను ఎప్పుడూ భయపడలేదు. అందరూ భయపడే మృత్యువంటే నాకు భయం లేదు.’ - దివ్యభారతి

దివ్యభారతి పేరు గుర్తుకు రాగానే 1990ల నాటి హిందీ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక్క సారిగా ముగ్ద మనోహరమైన ఆ లేలేత అమాయకపు బేల చూపుల ముఖం గుర్తొస్తుంది. అప్పటి హిందీ తెలుగు స్టార్ హీరోలు అందరూ ఆమెతో సినిమాలు చేయడానికి మరో మాట లేకుండానే అంగీకరించే వారు. కేవలం మూడు నాలుగేండ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన దివ్యభారతి స్మృతులు నేటికి మన జ్ఞాపకాలలో తాజాగానే ఉన్నవి.

దివ్య భారతి 1974 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి ఓంప్రకాష్ భారతి ఇన్సూరెన్స్ అధికారి. తల్లి మీతా భారతి గృహిణి. దివ్య ముంబైలోని మాణెక్జీ కూపర్ హైస్కూల్‌లో 9వ తరగతి వరకు చదువుకుంది. ఆమెకు నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ, గణపతి ఉత్సవాల సమయంలో జరిగే ఫ్యాషన్ షోలలో మాత్రం పాల్గొనేది. దివ్య భారతి ముఖ కవళికలు సూపర్ స్టార్ శ్రీదేవిని పోలి ఉండటంతో సినిమా అవకాశాలు వచ్చాయి. మొదట్లో దివ్య సినిమాల్లో నటించడం తండ్రికి ఇష్టం లేదు. ఐతే తల్లి మాత్రం సినిమాల్లో నటించాలని బలవంత పెట్టింది. ఆమె పంతమే నెగ్గింది. నందుతోలాని దివ్యకు ‘గునాహోన్ కా దేవతా’ చిత్రంలో నటించే అవకాశం కల్పించాడు. అప్పుడు ఆమెకు14 ఏండ్లు ఆరు నెలలు. ఈలోగా ‘ఆతంక్ హి ఆతంక్’, ‘రుద్ర అవతార్’ చిత్రాలలో అమీర్ ఖాన్ సరసన దలీప్ శంకర్ చిత్రాలకు సంతకం చేసింది. ఆ తర్వాత కీర్తి కుమార్, గోవింద సరసన ‘రాధా కా సంగం’ చిత్రం కోసం దివ్యని తీసుకోవాలని దలీప్ శంకర్‌ను కలిసి వారి ఒప్పందాన్ని రద్దు చేయించి ఆమెను ఎంతో ఆర్భాటంగా చిత్రరంగంలోకి పరిచయం చేశాడు. కానీ మొదటి షాట్ తీయకముందే ఆమె స్థానంలో జూహీ చావ్లాను తీసుకున్నాడు. ఈ విభేదాలకు ఇరుపక్షాలు వేర్వేరు కారణాలు చెప్పారు. ‘కీర్తి ఆమె పట్ల అతిగా అధికారం చెలాయించడం’ వల్లే ఆమె తప్పుకుందని ఆ తర్వాత బయటపడింది. ఐతే దివ్య, గోవిందాతో ప్రేమ వ్యవహారం నడుపుతోందని కీర్తి దాన్ని సహించలేకపోయాడని పత్రికలు రాశాయి. మరికొన్ని పత్రికలు ‘దివ్య అపరిపక్వతే ఆమె ఆ సినిమా నుండి తప్పుకోవడానికి కారణమని రాశాయి.

విచిత్రంగా ఈ పరిణామాలు ఇతర చిత్రనిర్మాతలు దివ్య ఇంటిముందు వరుస కట్టడానికి దోహద పడినవి. బోనీ కపూర్, షబ్నం కపూర్, శేఖర్ కపూర్, సుభాష్ ఘాయ్ వంటి పెద్ద దర్శకులు ఆమెను స్క్రీన్ టెస్ట్ చేశారు. వారందరూ ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు కానీ ఎవరూ అవకాశాలివ్వలేదు. ఆమె ప్రతిభ కంటే ఆమెలోని అపరిపక్వతే ఇందుకు కారణం అన్నారు. నిజానికి ‘ప్రేమ్’ సినిమా కోసం బోనీ కపూర్ మొదట ఆమెనే ఎంచుకున్నాడు. కానీ దివ్యను తప్పించి టబును తీసుకున్నాడు. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ కూడా ‘సౌదాగర్’కోసం ఆమెను పిలిచాడు. కానీ 20 రోజుల తర్వాత ఆమెను తప్పించి మనీషా కొయిరాలాను ఎంపిక చేసుకున్నాడు. పరిశ్రమలోకి రావడంతోనే 15 ఏండ్ల దివ్యపై తిరస్కరణ ప్రభావం పడింది. ఫలితంగా ఆమె ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఇంతలో దక్షిణాది తమిళ ‘నీలా పెన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తొలిసారిగా తెరపై కనిపించింది. ఆ వెంటనే తెలుగులో రామానాయుడు బొబ్బిలి రాజాతో దక్షిణాదిన స్టార్డమ్ అందుకున్నది.

రాజీవ్ రాయ్ తన ‘విశ్వాత్మ’ సినిమా కోసం ఒక కొత్త ముఖం కోసం వెతుకుతున్నారని వినగానే దివ్య భారతి తన పోర్ట్‌ ఫోలియోతో ఆయనను కలిసి అదే రోజు ఆ సినిమాకు సంతకం చేసింది. వెంటనే దివ్య నైరోబీలో సుదీర్ఘ అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్ళిపోయింది. తిరిగి వచ్చేసరికి ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అప్పటివరకు ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే దివ్య భారతి 14 సినిమాలకు సంతకం చేసింది. దీవానా, దిల్ ఆష్నా హై వంటి సినిమాలతో తనను ప్రసిద్ధిలోకి తెచ్చింది ఆమెనే అని షారుఖ్ ఖాన్ చెప్పడంతో ఆమె షారుఖ్ ఖాన్ హీరోయిన్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీదేవిని కొద్దిగా పోలి ఉండి కెమెరా ముందు ఏమాత్రం బిడియం లేకుండా ప్రవర్తించే ఆ టీనేజర్‌కు బాలీవుడ్ ఆఫర్లు వరుస కట్టినవి. విశ్వాత్మ బాగానే ఆడినప్పటికీ ఆ సినిమా విజయం త్రిదేవ్ సినిమా దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయినా నేటికీ ప్రేక్షకులు ‘సాత్ సముందర్ పార్’ పాటలోని దివ్యని గుర్తుంచుకున్నారు. తర్వాత ఆమె సంగీత ప్రధానమైన ‘దిల్ కా క్యా కసూర్’ విడుదలై పరాజయం పాలైంది. ఐనప్పటికీ ఆమె స్టార్‌గా ఎదిగింది.


ఆ తర్వాత గోవిందా సరసన పెహ్లాజ్ నిహ్లానీ దర్శకత్వంలో వచ్చిన ‘షోలా ఔర్ షబ్నం’ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్. దివ్య మళ్ళీ విజయాల బాట పట్టింది. నాలుగు నెలల తర్వాత రాజ్ కన్వర్ ప్రేమకథ ‘దీవానా’ 1992లో అతిపెద్ద హిట్టయింది. ఈ సినిమాలో రిషి కపూర్, కొత్త నటుడు షారుఖ్ ఖాన్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. దీవానా ఘన విజయంతో దివ్య భారతి అగ్రశ్రేణి తారగా ఎదిగింది. ఈ సినిమాలోని పాటలు దేశమంతటా మారుమోగినవి. ఆ సమయంలో సునీల్ శెట్టితో ‘బల్వాన్’, గోవిందాతో ‘జాన్ సే ప్యారా’ చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రజాదరణతో దూసుకుపోతున్న దివ్యను న్యూఢిల్లీలో జరిగే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రారంభ జ్యోతిని వెలిగించడానికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.

1991లో ఫిల్మ్‌సిటీలో దివ్య భారతికి సాజిద్ నడియాడ్‌వాలాతో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆమెకు 16 ఏండ్లు. గోవిందానే సాజిద్‌ను దివ్యకు పరిచయం చేశారు. ఆ తర్వాత షూటింగ్ సెట్లలో సాజిద్ ప్రతిరోజూ కలుసుకునేవారు. 1993 జూన్ ‘మూవీ’ పత్రిక ఇంటర్వ్యూలో సాజిద్ ‘1992 జనవరి 15న దివ్య నన్ను వివాహం చేసుకుంటానని చెప్పింది’ అని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే ఆమె పేరును చాలామంది హీరోలతో ముడిపెట్టి వార్తలు వస్తున్నాయి. ఈ వివాదాలన్నింటికీ ముగింపు పలకాలని, పెండ్లి చేసుకోవాలని ఆమె భావించింది. ‘ప్రతి ఒక్కరితోనూ నాకు ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు’ అని ఆమె బాధపడేది. ఆ తర్వాత 1992 మే 20న, ముంబైలోని వెర్సోవాలో ఉన్న సాజిద్ నివాసం ‘తులసి అపార్ట్‌మెంట్స్’లో దివ్య భారతి సాజిద్ నడియాడ్‌వాలను వివాహం చేసుకుంది. ఈ వివాహ సమయంలో ఆమె హెయిర్ డ్రెస్సర్ సంధ్య, ఆమె భర్త, ఒక ఖాజీ మాత్రమే హాజరయ్యారు. దివ్య ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘సనా’ అనే కొత్త పేరును కూడా పెట్టుకున్నది.

అయితే విధి మరోలా తలచింది. 1993 ఏప్రిల్ 5న, దివ్య భారతి తన 5వ అంతస్తు అపార్ట్‌మెంట్ నుండి కింద పడిపోయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 ఏండ్లు మాత్రమే. అంతకు ముందు రోజే కుమార్తె పక్షాన తండ్రి ఫిలింఫేర్ లక్స్ సుందరి అవార్డు అందుకున్నాడు. ఆమె మరణం ప్రమాదవశాత్తూ జరిగిందా, ఆత్మహత్యా, హత్యనా అనే కోణాల్లో చర్చలు జరిగాయి. ఆమె మరణించిన సమయంలో ఆమె డ్రెస్ డిజైనర్ కూడా ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారని చెబుతారు. కానీ ఆ దురదృష్టకర సంఘటనను మాత్రం అడ్డుకోలేకపోయారు. 1998లో ఆమె మరణానికి సంబంధించిన దర్యాప్తును పోలీసులు ముగించారు. కానీ ఆమె మరణం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. అప్పట్లో వెండితెరపై అత్యంత పిన్న వయస్కురాలైన నటిగా ఉన్న ఆమె అంత్యక్రియలకు సుమారు 500 మంది హాజరయ్యారు. తన కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంటున్న తరుణంలో ఆకస్మికంగా మృతి చెందింది. నేడు దివ్య భారతి జీవించి ఉంటే ఆమెకు 52 ఏండ్లు ఉండేవి. తన నట జీవితంలో ఎన్ని విజయాలను నమోదు చేసుకొని ఉండేదో. బాలీవుడ్‌లో ప్రచారంలో ఉండే సామెత ప్రకారం ‘స్టార్‌డమ్ కోసం చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువేమో’.

terala sitaraమరణం ఇంకా మిస్టరీనే...

దివ్యభారతి మరణంపై పలు కుట్రలు కోణాలు ప్రచారంలో ఉన్నప్పటికీ అది ఒక ప్రమాదవశాత్తూ జరిగిన మరణమని ఆమె తల్లిదండ్రులు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ముంబైలోని తన ఐదవ అంతస్తు అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి కింద పడటంతో ఆమె మరణించింది. అప్పుడే చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన దివ్య తన రాబోయే చిత్రం ‘ఆందోళన్’కు సంబంధించి ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లాను తన నివాసంలో కలవాల్సి ఉంది. నీతా తన భర్త శ్యామ్‌తో కలిసి అక్కడికి వచ్చింది. అక్కడ ఉన్నవారంతా మద్యం సేవిస్తున్నారు. దివ్య బాల్కనీ అంచున కూర్చుంది. అయితే వెనక్కి తిరిగే క్రమంలో ఆమె అదుపు తప్పి కింద పడిపోయింది. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు ఆమె ఇంకా శ్వాస తీసుకుంటున్నది. కానీ తీవ్ర గాయాల కారణంగా కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. దివ్య మరణాన్ని కొందరు హత్య అని, మరికొందరు ఆత్మహత్య అని పేర్కొన్నారు. ఆ కాలంలో హిందీ సినీ నిర్మాణంలో ముంబై అండర్ వరల్డ్ డబ్బును ఉపయోగిస్తు న్నారనే ప్రచారం ఉండటంతో ఇది వారి పనేనని కూడా కొందరన్నారు. తర్వాత తన కుమార్తె మరణం చుట్టూ ఉన్న ఈ వదంతులను తోసిపుచ్చుతూ దివ్య తండ్రి ఒక ప్రకటనలో ‘ఆత్మహత్య లేదా హత్య అనే ప్రశ్నే లేదు. అవును ఆమె కొంచెం తాగింది. కానీ ఆమె డిప్రెషన్‌లో లేదు. ఆమె అంచు మీద కూర్చుని బ్యాలెన్స్ కోల్పోయి నేరుగా నేల మీద పడిపోయింది’ అని చెప్పాడు. ఇండియా టుడే రాసిన కథనం మరోలా ఉంది. ‘సాజిద్‌ని పెండ్లి చేసుకున్న తర్వాత కూడా దివ్యభారతి రాత్రింబవళ్ళు ఎందుకు కష్టపడ వలసి వచ్చింది? ఇంతకుముందు నిర్మించిన ‘నరమ్ చలీ జానే’, నిర్మాణంలో ఉన్న ఆందోళన్ రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌ల కారణంగా సాజిద్ భారీగా అప్పులు చేశాడనీ సినీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు తల్లిదండ్రుల నుంచి కూడా ఆమెకు డబ్బు ఒత్తిళ్ళు ఎక్కువైనాయి. ఆమె మద్రాసులో ఓ షూటింగ్‌ ముగించుకు రాగానే మర్నాడు మారిషస్ బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ, ఆమె పెగ్ మీద పెగ్ తాగడం మొదలు పెట్టింది. మధ్యలో తన సైకియాట్రిస్ట్ డాక్టర్ లుల్లాకు ఫోన్ చేసి ‘మానసికంగా బాగా కుంగిపోయి ఉన్నానని, వెంటనే బయలుదేరి రండీ’ అన్నది. కూతురి మరణ వార్త తెలియగానే తండ్రి ఓంప్రకాష్ భారతి స్పృహ తప్పి వడిపోయాడు. స్పృహ వచ్చిన మరుక్షణం ఆయన తన భార్య మీతాపై విరుచుకు వడుతూ ‘ఇదంతా నీవల్లే జరిగింది. నువ్వు సినిమాల్లో నటించమంటూ దివ్యను ఒత్తిడి చేయకపోతే ఈ దుర్ఘటన జరిగేది కాదు’ అని కేకలు పెట్టాడు. ఏదిఏమైనా దివ్యభారతి మరణం వెనుక ఉన్న అనుమానాలు ఇప్పటికీ ఆమె అభిమానులను వీడలేదు.

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా...

హిందీలో పలు పెద్ద ప్రాజెక్టుల నుండి తొలగించడంతో దివ్య భారతి తీవ్ర నిరాశకులోనై ముంబైని వదిలి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వచ్చిన సాయంత్రం తెలుగు సినీ రంగ అతిపెద్ద నిర్మాత డి. రామానాయుడు దివ్య భారతిని ‘బొబ్బిలి రాజా’ చిత్రంలో వెంకటేష్ సరసన నటించే అవకాశం కల్పించాడు. ఆ తర్వాత ఆమెకు అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 1991 నవంబర్ నెల ‘మూవీ’ పత్రికలో దివ్య భారతి ‘నాకు నటించాలని లేదు, నేను వద్దని చెప్పాను. కానీ మా అమ్మ ఒప్పుకుంది. బొబ్బిలి రాజా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేను సూపర్ స్టార్‌గా మారిపోయాను!’ అన్నది. దక్షిణాది ప్రేక్షకులు ఆమెను సౌందర్య దేవతలా ఆరాధించారు. అప్పట్లో విజయశాంతి తర్వాత స్థానం ఆమెదే. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం అప్పట్లో ఆమె ఒక్కో సినిమాకు 25 లక్షల రూపాయల భారీ పారితోషికం తీసుకునేది. అంతేకాకుండా షూటింగ్ ఆలస్యమైతే అదనపు రోజుకు లక్ష రూపాయల చొప్పున తీసుకునేది. 90వ దశకంలో ఇది చాలా పెద్ద మొత్తం. 1991లో దివ్య భారతి చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో రౌడీ అల్లుడు, ధర్మ క్షేత్రం, అసెంబ్లీ రౌడీ, నా ఇల్లు నా స్వర్గం, చిట్టెమ్మ మొగుడు చిత్రాల్లో నటించింది. అసంపూర్తిగా ఉన్న ‘తొలి ముద్దు’ చిత్రంలో ఆమెకు బదులుగా రంభతో మిగిలిన సన్నివేశాలను పూర్తి చేసి విడుదల చేశారు. బాలీవుడ్‌‌లో ఆమెను ‘తెలుగు చిత్రాల శ్రీదేవి’గా పిలిచేవారు.


హెచ్‌.రమేష్‌‌బాబు, 93916 34727

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్